దాహం తీర్చనున్న ‘దేవాదుల’ | Sakshi
Sakshi News home page

దాహం తీర్చనున్న ‘దేవాదుల’

Published Fri, Feb 23 2018 1:11 AM

availability of Godavari waters will be increased - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: ఈ ఏడాది నిండు వేసవిలోనూ గోదావరి జలాల లభ్యత పెరగనుంది. దేవాదుల దిగువన తుపాకులగూడెం బ్యారేజీలో భాగంగా నిర్మించిన కాఫర్‌ డ్యామ్‌ వల్ల లభ్యత జలాలు మరింత పెరిగాయి. జనవరి చివరి నుంచి ఇప్పటికి 16 కిలోమీటర్ల మేర గోదావరి నీరు నిలవడంతో ఉమ్మడి వరంగల్, కరీంనగర్‌ జిల్లాల తాగునీటి ఇక్కట్లు తొలగనున్నాయి. కాఫర్‌ డ్యామ్‌తో నిలిచిన నీటిలో ఒక టీఎంసీ మేర నీటిని తరలించగా, జూలై నాటికి కనిష్టంగా నాలుగైదు టీఎంసీలు తరలించి రిజర్వాయర్ల ద్వారా తాగునీరు సరఫరా చేసేలా అధికారులు రంగం సిద్ధం చేశారు.  

తొలిసారి వేసవిలో మళ్లింపు.. 
ఏటా గోదావరిలో జూలై నుంచి నవంబర్‌ వరకు 120 నుంచి 130 రోజుల పాటే నీటి లభ్యత ఉంటుంది. ఆ రోజుల్లోనే దేవాదుల నుంచి పంపింగ్‌ సాధ్యపడుతుంది. వేసవిలో నీటి ఎద్దడి ఎదుర్కొనేందుకు వీలుగా తుపాకులగూడెం వద్ద కాఫర్‌ డ్యామ్‌ నిర్మించారు. నిజానికి దేవాదుల పంపుల ద్వారా తుపాకులగూడెంలో నిల్వ చేసే నీటిని తీసుకోవాలంటే 72 మీటర్ల వద్ద గోదావరి నీటిని ఆపాల్సి ఉంటుంది. ప్రస్తుతం అక్కడ 71 మీటర్‌ లెవల్‌లో 3 వేల క్యూసెక్కుల మేర గోదావరి ప్రవహిస్తోంది. ఇలాగే జూన్, జూలై వరకు ఉంటుంది. దీన్ని దృష్టిలో పెట్టుకొని 72 మీటర్ల వద్ద నీటిని ఆపేలా జనవరిలో రెండో వారంలోనే కాఫర్‌ డ్యాం నిర్మించారు. జనవరి 30న దేవాదుల ఇన్‌టేక్‌ పంపులను మంత్రి హరీశ్‌రావు ప్రారంభించారు. దేవాదుల, మొదటి, రెండో దశలోని మోటార్ల ద్వారా ఇప్పటికే ధర్మసాగర్‌ (1.5 టీఎంసీ) రిజర్వాయర్‌కు ఒక టీఎంసీ నీటిని ఎత్తిపోశారు. ధర్మసాగర్‌ నుంచి గండిరామారం (0.4 టీఎంసీ), బొమ్మకూరు (0.19 టీఎంసీ) రిజర్వాయర్‌కు నీటిని తరలించేలా ఇప్పటికే ప్రణాళికలు సిద్ధం కాగా, మార్చిలో బొమ్మకూరు నుంచి బోయినగూడెం (0.12 టీఎంసీ), లద్దనూరు (0.29 టీఎంసీ) రిజర్వాయర్లకు పంప్‌ చేయాలని నిర్ణయిం చారు. ఆ వెంటనే వెల్దండ (01.5 టీఎంసీ), తపాసుపల్లి (0.3 టీఎంసీ) రిజర్వాయర్‌లకూ వేసవిలో నీటిని తరలించి తాగునీటి లభ్యత పెంచేందుకు కసరత్తు చేస్తున్నారు.ర

300 చెరువులు.. 1.5 లక్షల ఎకరాలు.. 
ధర్మసాగర్‌ చెరువు నుంచే ఆర్‌ఎస్‌ ఘణపురం రిజర్వాయర్‌ అక్కడినుంచి అశ్వరావుపల్లి (0.71 టీఎంసీ), చిట్టకోడూర్‌ (0.30 టీఎంసీ) రిజర్వాయర్‌లను నింపే చర్యలు ప్రారంభమయ్యాయి. మొత్తంగా ఈ వేసవికి 4 నుంచి 5 టీఎంసీలు మళ్లించుకునే వెసులుబాటు కలగనుంది. ఈ నీటితో దేవాదుల కింద 300 చెరువులను నింపడంతో పాటు రొటేషన్‌ పద్ధతిన సుమారు 1.5 లక్షల ఎకరాలకు సాగునీరు అందించొచ్చని అధికారులు చెబుతున్నారు. గతంలో 2014లో 4.15 టీఎంసీ, 2015లో 7.3 టీఎంసీ, 2016లో 6.83 టీఎంసీ, 2017లో 7.93 టీఎంసీల నీటిని దేవాదుల నుంచి ఎత్తిపోయగా, ఈ ఏడాది ప్రథమార్ధంలోనే 4 నుంచి 5 టీఎంసీలు ఎత్తిపోసే అవకాశం ఉంది. అది ఈ ఏడాది చివరికి కనిష్టంగా 20 టీఎంసీలకు చేరే అవకాశం ఉంటుందని నీటిపారుదల వర్గాలు చెబుతున్నాయి. ఇప్పటివరకు గరిష్టంగా 319 చెరువులకు నీరివ్వగా, అది 500కు పెరిగే అవకాశం ఉంటుందని అంటున్నాయి. 

Advertisement
Advertisement