Sakshi News home page

నేడు భద్రాద్రిలో ‘పర్యావరణ’ తనిఖీలు

Published Thu, Aug 18 2016 3:41 AM

నేడు భద్రాద్రిలో ‘పర్యావరణ’ తనిఖీలు

నెలాఖరులోగా తేలనున్న థర్మల్ విద్యుత్ కేంద్రం భవితవ్యం
తనిఖీ నివేదిక ఆధారంగా పర్యావరణ అనుమతులపై నిర్ణయం
29, 30వ తేదీల్లో సమావేశం కానున్న నిపుణుల సాధికారిక కమిటీ
ఇప్పటికే ప్రాజెక్టుపై రూ.800 కోట్లను వెచ్చించిన జెన్‌కో

హైదరాబాద్: రాష్ట్ర విద్యుదుత్పత్తి సంస్థ(జెన్‌కో) ఖమ్మం జిల్లా మణుగూరులో నిర్మిస్తున్న 1,080 (4X270) మెగావాట్ల భద్రాద్రి థర్మల్ విద్యుత్ కేంద్రాన్ని కేంద్ర పర్యావరణ, అటవీ శాఖ గురువారం తనిఖీ చేయనుంది. ఈ తనిఖీల్లో నిర్ధారించే అంశాల ఆధారంగానే ఈ ప్రాజెక్టు భవితవ్యంపై కేంద్రం నిర్ణయం తీసుకుంటుంది. ఈ విద్యుత్ కేంద్రానికి పర్యావరణ అనుమతుల జారీ కోసం జెన్‌కో పెట్టుకున్న అభ్యర్థనపై పరిశీలన జరపాలా, వద్దా? అనే అంశంపై 8 వారాల్లోగా నిర్ణయం తీసుకోవాలని కేంద్ర పర్యావరణ శాఖను నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ (ఎన్జీటీ) గత జూలై 11న ఆదేశించిన విషయం తెలిసిందే. సెప్టెంబర్ 11తో ఆ గడువు ముగియనున్న నేపథ్యంలో... తనిఖీలు జరుగనున్నాయి. కేంద్ర పర్యావరణ శాఖ నిపుణుల సాధికారిక కమిటీ ఈ నెల 29, 30వ తేదీల్లో ఢిల్లీలో సమావేశమై తుది నిర్ణయం తీసుకోనుంది.


తనిఖీలు ఎందుకు?
ఏవైనా ప్రాజెక్టులు చేపట్టినపుడు.. ఎలాంటి నిర్మాణ పనులు ప్రారంభించక ముందే ఆ స్థలంలో పర్యావరణంపై పడే ప్రభావాన్ని అంచనా వేసి కేంద్ర పర్యావరణ శాఖకు నివేదిక సమర్పించాలి. ఆ నివేదిక ఆధారంగా పర్యావరణ అనుమతులపై కేంద్రం నిర్ణయం తీసుకుంటుంది. అయితే ఈ అధ్యయానికి ముందే భద్రాద్రి ప్రాజెక్టు నిర్మాణ పనులను జెన్‌కో చేపట్టడంతో ప్రాజెక్టు స్థలంలో మార్పులు జరుగుతున్నాయి. దీంతో పర్యావరణ ప్రభావంపై సరైన అధ్యయనం సాధ్యమా? అన్న అంశంపై పరిశీలన జరపాలని ఎన్జీటీ ఆదేశించింది. ఈ మేరకు ప్రొఫెసర్ సీఆర్ బాబు నేతృత్వంలో పర్యావరణ శాస్త్రవేత్తలతో కేంద్ర పర్యావరణ శాఖ ఓ బృందాన్ని ఏర్పాటు చేసింది. ఆ బృందం గురు, శుక్రవారాల్లో ప్రాజెక్టుస్థలంలో తనిఖీలు జరిపి.. ఈ నెల 24లోగా కేంద్రానికి నివేదిక సమర్పించనుంది. ఆ నివేదిక ఆధారంగా ప్రాజెక్టుకు అనుమతులపై కేంద్ర పర్యావరణ శాఖ నిర్ణయం తీసుకోనుంది. అయితే రూ.5,044 కోట్లతో చేపట్టిన భద్రాద్రి విద్యుత్ కేంద్రాన్ని 2016లోగా పూర్తి చేస్తామని రాష్ట్ర ప్రభుత్వం గతంలో ప్రకటించింది. ఎన్జీటీ కేసు, పర్యావరణ అనుమతుల జారీలో జాప్యంతో గడువును మరో రెండేళ్లకు పొడిగించాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇప్పటికే యంత్రాల కొనుగోళ్లు, ఇతర నిర్మాణ పనుల కోసం రూ.800 కోట్లను జెన్‌కో ఖర్చు చేసింది. ఒకవేళ పర్యావరణ అనుమతుల జారీపై పరిశీలన జరపవద్దని నిర్ణయిస్తే.. ప్రాజెక్టు నిర్మాణాన్ని విరమించుకునే పరిస్థితి ఉత్పన్నం కానుంది.

Advertisement

తప్పక చదవండి

Advertisement