ఉద్యోగాలు వచ్చేలా.. | Sakshi
Sakshi News home page

ఉద్యోగాలు వచ్చేలా..

Published Sat, Feb 13 2016 3:21 AM

ఉద్యోగాలు వచ్చేలా..

♦ ప్రైవేటు వర్సిటీల బిల్లులో కీలక నిబంధనలు
♦ సెంటర్ ఆఫ్ ఎక్స్‌లెన్స్ ఉన్న సంస్థలకే అనుమతి
♦ సంస్థల బ్రాండ్ ఇమేజ్ ప్రధానం   
♦ వచ్చే అసెంబ్లీ సమావేశాల్లోనే బిల్లు
 
 సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ప్రైవేటు యూనివర్సిటీలకు అనుమతి ఇచ్చే విషయం లో కొన్ని కీలక నిబంధనలు పొందుపరచాలని ప్రభుత్వం నిర్ణయానికి వచ్చింది. ఉద్యోగ, ఉపాధి అవకాశాల కల్పనే లక్ష్యంగా ప్రైవేటు యూనివర్సిటీలకు అనుమతి ఇవ్వాలని భావి స్తోంది. ప్రైవేటు యూనివర్సిటీలను స్థాపించే సంస్థల బ్రాండ్ ఇమేజ్‌ను ప్రధానంగా పరిగణనలోకి తీసుకోవాలన్న నిర్ణయానికి వచ్చింది. తద్వారా యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలను పెంచడంతోపాటు రాష్ట్రం, హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్‌ను అంతర్జాతీయ స్థాయికి తీసుకువెళ్లే విధంగా చర్యలు చేపట్టవచ్చని యోచిస్తోంది.

ఈ మేరకు అవసరమైన నిబంధనలను ప్రైవేటు యూనివర్సిటీల ముసాయిదా బిల్లులో పొందుపరుస్తోంది. దేశంలోని వివిధ రాష్ట్రాల్లో ప్రైవేటు వర్సిటీలు అధిక మొత్తంలో ఉన్నప్పటికీ వాటి వల్ల పెద్దగా ప్రయోజనం లేకుండా పోతోందని, స్థానిక యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లభించని పరిస్థితులు నెలకొనడంతో ప్రభుత్వం ఈ నిర్ణయానికి వచ్చినట్లు తెలిసింది. మార్కెట్ అవసరాలకు అనుగుణంగా కోర్సులను పేరున్న విద్యా సంస్థలు నిర్వహిస్తేనే ఉపాధి అవకాశాలు మెరుగవుతాయన్న ఆలోచనతో ఈ చర్యలకు సిద్ధమైంది.

ఇదే అంశంపై శుక్రవారం రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి కె.తారక రామారావు కూడా ఉన్నత విద్యాశాఖ, ఉన్నత విద్యామండలి అధికారులతో చర్చించి, పలు సూచనలు చేసినట్లు తెలిసింది. రాష్ట్రంలో, హైదరాబాద్‌లో పెట్టుబడులు పెట్టేందుకు అంత ర్జాతీయ స్థాయి సంస్థలు అనేకం ముందుకు వస్తున్న నేపథ్యంలో ఇక్కడ ఏర్పాటు చేసే ప్రైవేటు యూనివర్సిటీలు కూడా ఆయా సంస్థల పారిశ్రామిక అవసరాలు, స్థాయికి అనుగుణంగా ఉండేలా చర్యలు తీసుకోవాలన్న నిర్ణయానికి ప్రభుత్వం వచ్చింది. అలాగే దేశంలోని రిలయన్స్ వంటి వివిధ కార్పొరేట్ దిగ్గజాలు విద్యా సంస్థలను ఏర్పాటు చేసేందుకు ఆసక్తి చూపిస్తున్న నేపథ్యంలో వచ్చే అసెంబ్లీ సమావేశాల్లో ప్రైవేటు యూనివర్సిటీల బిల్లును ప్రవేశ పెట్టేందుకు చర్యలు చేపట్టింది.

 అవసరాలకు అనుగుణంగానే కోర్సులు
 పారిశ్రామిక అవసరాలకు అనుగుణంగా మానవ వనరులను అందించే కోర్సులను ప్రైవేటు యూనివర్సిటీల్లో ప్రవేశ పెట్టేందుకు ప్రభుత్వం చర్యలు చేపడుతోంది. హైదరాబాద్‌ను ఎడ్యుకేషన్ హబ్‌గా మార్చేందుకు, అంతర్జాతీయ స్థాయి గుర్తింపు వచ్చేలా ప్రైవేటు వర్సిటీల అనుమతుల్లో జాగ్రత్తలు తీసుకునేందుకు కసరత్తు చేస్తోంది. ఈ నేపథ్యంలో ప్రైవేటు యూనివర్సిటీల్లో సంప్రదాయ డిగ్రీ కోర్సులు ఉండే అవకాశం లేదు. అంతర్జాతీయ సంస్థల అవసరాలకు ఉపయోగపడే కోర్సులు ఉంచాలని భావిస్తోంది.

Advertisement

తప్పక చదవండి

Advertisement