సుపరిపాలనకు చిహ్నం బీజేపీ | Sakshi
Sakshi News home page

సుపరిపాలనకు చిహ్నం బీజేపీ

Published Mon, Jun 27 2016 12:47 AM

సుపరిపాలనకు చిహ్నం బీజేపీ - Sakshi

కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిరణ్ రిజిజు

 సాక్షి, హైదరాబాద్: కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చాక ప్రజలకు సుపరిపాలన అందుతోందని కేంద్ర హోంశాఖ సహాయమంత్రి కిరణ్ రిజిజు అన్నారు. బీజేపీ అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో ప్రజలకు సౌకర్యవంతమైన పాలన సాగుతోందన్నారు. అలాగే కేంద్ర పథకాలు, నిధులు అందకపోతే ప్రజలు నిలదీయాలని సూచించారు. ఆదివారం బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ఆపార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కె.లక్ష్మణ్, ఎమ్మెల్సీ రామచంద్రరావు, ఎమ్మెల్యే ఎన్‌వీఎస్‌ఎస్ ప్రభాకర్‌లతో కలిసి మంత్రి కిరణ్ రిజిజు విలేకరులతో  మాట్లాడారు. దేశంలో ఎమర్జెన్సీ విధించి నేటికి 41ఏళ్లు పూర్తయ్యిందన్నారు. ఎమర్జెన్సీకి వ్యతిరేకంగా దేశ వ్యాప్తంగా ముఖ్య పట్టణాలలో అప్పటి పరిస్థితులను వివరిస్తున్నట్లు ఆయన చెప్పారు.

ఎమర్జెన్సీ కారణంగా అప్పటి ప్రధాని ఇందిరాగాంధీ ప్రజాస్వామ్య వ్యవస్థలన్నింటినీ కుప్పకూల్చారన్నారు.  దేశ వ్యాప్తంగా సుపరిపాలనకు చిహ్నం బీజేపీ మాత్రమే అని వెల్లడించారు. కేంద్రం ప్రవేశపెట్టే పథకాలు అట్టడుగు వర్గాలకు చేరేందుకు ప్రధాని నరేంద్రమోదీ నిరంతరం సమీక్షిస్తుంటారని చెప్పారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కూడా కేంద్రం ప్రకటిస్తున్న పథకాలను, నిధులను లబ్ధిదారులకు అందేలా చూడాలని కోరారు. అభివృద్ధి విషయంలో అన్ని రాష్ట్రాలకు సహాయ సహకారాలు అందించేందుకు కేంద్రం సిద్ధంగా ఉందన్నారు. గత ప్రభుత్వ హయాంలో మంత్రుల నిలయాలైన... నార్త్, సౌత్ బ్లాకుల వద్ద దళారులు రాజ్యమేలేవారని, తాము అధికారంలోకి వచ్చాక వారందరినీ తరిమేశామన్నారు.

పాలనలో పారదర్శకత కోసం సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించుకొని ప్రజలకు సత్వరన్యాయం చేకూరుస్తున్నట్లు చెప్పారు. రాష్ట్ర విభజన తర్వాత రెండుగా ఏర్పడిన తెలుగు రాష్ట్రాలకు కేంద్రం పూర్తి సహాయ సహకారాలు అందిస్తుందన్నారు. తమ హయాంలో తీవ్రవాద ఘటనలు తగ్గుముఖం పట్టాయని వివరించారు. పఠాన్‌కోట్‌దాడికి సంబంధించి పాకిస్తాన్ స్పందన కోసం ఎదురు చూస్తున్నామని, ఈ ఘటనలో త్వరలో కేంద్రం తన నిర్ణయాన్ని వెలువరిస్తుందన్నారు. అలాగే జమ్ముకశ్మీర్‌లో ఉగ్రవాదుల దాడిని తీవ్రంగా ఖండిస్తున్నట్లు చెప్పారు. అనంతరం రాష్ట్ర హైకోర్టు విభజనపై ఏపీ బార్ కౌన్సిల్ అధ్యక్షుడు నర్సింహారెడ్డి కేంద్ర మంత్రి కిరణ్ రిజిజుకు ఒక వినతిపత్రం అందజేశారు.

Advertisement
Advertisement