బుకింగ్ క్లోజ్ | Sakshi
Sakshi News home page

బుకింగ్ క్లోజ్

Published Sun, Jan 5 2014 3:27 AM

బుకింగ్ క్లోజ్

 =సంక్రాంతి రైళ్లపైనా దళారుల కన్ను
 =అర్ధరాత్రి నుంచే కౌంటర్ల వద్ద పాగా
 =సిబ్బందితో కుమ్మక్కు క్షణాల్లోనే
 =రిజర్వేషన్లు పూర్తి నిఘా వ్యవస్థ నిర్వీర్యం
 =ప్రయాణికుల ఆందోళన

 
సాక్షి, సిటీబ్యూరో : సంక్రాంతి సెలవులకు సొంతవూళ్లకు వెళ్లేందుకు ప్రణాళికలు రూపొందించుకుంటున్న నగరవాసులకు చాంతాడులా కనిపిస్తోన్న వెయిటింగ్ జాబితా తీవ్ర నిరాశకు గురి చేస్తోంది. రాజ ధాని నుంచి వివిధ ప్రాంతాలకు దక్షిణమధ్య రైల్వే ప్రకటిస్తున్న రైళ్లు దళారుల జేబులు నింపుతున్నాయి. ప్రత్యేక రైళ్లకు బుకింగ్‌లు ప్రారంభమైన క్షణాల వ్యవధిలోనే దళారులు రిజర్వేషన్లను ఎగరేసుకెళ్తున్నారు. దీంతో సగటు ప్రయాణికుడు ఉసూరంటూ వెనుదిరగ వలసి వస్తోంది. లేదా  వెయిటింగ్ జాబితాకు పరిమితం కావలసి వస్తోంది.

ఏజెంట్లు, దళారుల రూపంలో వ్యవస్థీకృతంగా కొనసాగుతోన్న ఈ అక్రమాలను అరికట్టేందుకు రైల్వే ఏర్పాటు  చేసే నిఘా వ్యవస్థ, కట్టుదిట్టమైన భద్రత యథావిధిగా అపహాస్యానికి గురవుతూనే ఉన్నాయి. సంక్రాంతి ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకొని నగరం నుంచి విశాఖపట్టణం, కాకినాడ, తిరుపతి, బీదర్ తదితర ప్రాంతాలకు ప్రత్యేక రైళ్లతోపాటు రెగ్యులర్ ఎక్స్‌ప్రెస్‌లలో అదనపు బోగీలను కూడా ఏర్పాటు చేస్తున్నారు. ఈ ప్రత్యేక     రైళ్లు, బెర్తులు సాధారణ ప్రయాణికులకు అందుబాటులోకి రావడం లేదు.

అధికారుల నియంత్రణ చర్యలను తోసిరాజని దళారులు యథేచ్ఛగా రెచ్చిపోతున్నారు. రిజర్వేషన్ కౌంటర్లలో పనిచేసే కొంతమంది సిబ్బందితో కుమ్ముక్కై సాగిస్తున్న ఈ అక్రమ దందాలో ప్రయాణికులే సమిధలవుతున్నారు. నగరంలోని సికింద్రాబాద్, నాంపల్లి, కాచిగూడ తదితర ప్రధాన స్టేషన్‌లతోపాటు అన్ని రిజర్వేషన్ కేంద్రాల్లో దళారుల నియంత్రణపై నిఘా వ్యవస్థ నిర్వీర్యమతోంది.
 
వ్యూహాత్మకంగా బుకింగ్‌లు
 
సాధారణ రోజుల్లో నగరం నుంచి 80కి పైగా ఎక్స్‌ప్రెస్ రైళ్లు, మరో 150  ప్యాసింజర్‌లు, లోకల్ ట్రైన్‌లు రాకపోకలు సాగిస్తాయి. ప్రతిరోజు లక్షా 50 వేల మంది  ప్రయాణికులు బయలుదేరుతారు. సంక్రాంతి, దసరా, దీపావళి, వేసవి సెలవులు వంటి ప్రత్యేక రోజుల్లో ప్రయాణికుల సంఖ్య పెరుగుతుంది. ఈ డిమాండ్‌కు అనుగుణంగా అదనపు రైళ్లను ఏర్పాటు చేస్తారు. తాజాగా సంక్రాంతి రద్దీని దృష్టిలో ఉంచుకొని ఇప్పటి వరకు 30కి పైగా ప్రత్యేక రైళ్లను ప్రకటించారు. రెగ్యులర్ రైళ్లకు త్రీటైర్, స్లీపర్‌క్లాస్ బోగీలను అదనంగా ఏర్పాటు చేశారు.

దీంతో వేలసంఖ్యలో అదనపు బెర్తులు అందుబాటులోకి వచ్చాయి. కానీ ఇవి ప్రయాణికుల దరికి చేరకుండానే  దళారులు కొల్లగొట్టుకొని పోతున్నారు. ప్రయాణికులతో ముందుగానే ఒప్పందం కుదుర్చుకుంటున్న కొందరు ఏజెంట్లు రైల్వే అధికారులతో తమకున్న సంబంధాల దృష్ట్యా తేలిగ్గా రిజర్వేషన్లు లభిస్తాయంటూ ప్రయాణికులను నమ్మించి బేరం కుదుర్చుకుంటున్నారు.

రిజర్వేషన్ బుకింగ్ కష్టాలను చవిచూసే ప్రయాణికులు సహజంగానే వారి మాటలను నమ్మేస్తున్నారు. దీంతో ముందస్తుగానే ప్రయాణికుల గుర్తింపుకార్డులను సేకరించి తమ దగ్గర పనిచేసే వ్యక్తులను బుకింగ్ కార్యాలయాల వద్ద లైన్లలో పెట్టేస్తున్నారు. ప్రయాణికుల కంటే దళారులు, ఏజెంట్లకు చెందిన వ్యక్తులే ముందు వరుసలో నించొని మొత్తం రిజర్వేషన్లను ఎగరేసుకెళ్తున్నారు. బుకింగ్ సిబ్బందికి, ఏజెంట్లకు ముందుగానే కుదిరిన ఒప్పందం మేరకు ఈ అక్రమ వ్యాపారం యథేచ్ఛగా కొనసాగుతోంది.
 

Advertisement

తప్పక చదవండి

Advertisement