హైకోర్టులో పుస్తకాల చోరీ | Sakshi
Sakshi News home page

హైకోర్టులో పుస్తకాల చోరీ

Published Tue, Mar 22 2016 4:38 AM

హైకోర్టులో పుస్తకాల చోరీ - Sakshi

♦ నిందితుడు న్యాయవాదే..  
♦ పట్టించిన సీసీ కెమెరాలు
 
 హైదరాబాద్: హై సెక్యూరిటీ జోన్ అయిన హైకోర్టు నుంచే పుస్తకాలు అపహరించాడో దొంగ. రంగంలోకి దిగిన చార్మినార్ పోలీసులు విషయం తెలిసి ఆశ్చర్యపోయారు. అక్కడ పనిచేస్తున్న న్యాయవాదే ఈ చోరీకి పాల్పడినట్లు సీసీ కెమెరాల సాక్షిగా తేలింది. దీంతో అతన్ని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. డీసీపీ వి.సత్యనారాయణ వివరాలు తెలిపారు. కాకినాడకు చెందిన కుంటల గంగవేణు గోపాలకృష్ణ (49) 2012 నుంచి హైకోర్టులో న్యాయవాదిగా ప్రాక్టీస్ చేస్తున్నారు.

తనకు పెద్ద కేసులు రాకపోవడం... వీటికి తోడు లా బుక్స్ కూడా లేకపోవడంతో కేసుల కోసం వినియోగదారులెవరూ ఇతని వద్దకు వచ్చేవారు కాదు. దీంతో కోర్టు హాల్‌లోని న్యాయశాస్త్రానికి సంబంధించిన పుస్తకాలను గత 9 నెలల నుంచి దొంగిలిస్తున్నారు. పుస్తకాలు పోతున్న విషయం తెలుసుకున్న న్యాయమూర్తులు ఈ విషయమై చార్మినార్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. వారు హైకోర్టులోని సీసీ కెమెరాలను పరిశీలించగా విషయం బయటపడింది. దీంతో ఈ నెల 20న పోలీసులు నిందితుడు గోపాలకృష్ణను అదుపులోకి తీసుకొని విచారించగా.. 144 పుస్తకాలు దొంగిలించినట్లు అంగీకరించారు. వాటిని స్వాధీనం చేసుకొని ఆయన్ను అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. 

Advertisement
Advertisement