బలవంతపు భూసేకరణకు బ్రేక్‌ | Sakshi
Sakshi News home page

బలవంతపు భూసేకరణకు బ్రేక్‌

Published Tue, Apr 25 2017 12:18 AM

బలవంతపు భూసేకరణకు బ్రేక్‌ - Sakshi

- పెనుమాక భూములపై యథాతథస్థితి
- రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశం
- సామాజిక ప్రభావ అంచనా చేపట్టాలి
- రైతుల అభ్యంతరాలను పరిగణనలోకి తీసుకోవాలి
- ఉత్తర్వులు జారీ చేసిన ఉన్నత న్యాయస్థానం
- 251 మంది పెనుమాక రైతులకు ఊరట
- చంద్రబాబు సర్కారుకు చెంపపెట్టు


సాక్షి, హైదరాబాద్‌/తాడేపల్లి రూరల్‌ (మంగళగిరి) :  రాజధాని పేరుతో.. రైతుల నుంచి బలవంతంగా భూములను లాక్కోవడం కోసం భూ సేకరణ నోటిఫికేషన్‌ జారీ చేసిన చంద్రబాబు ప్రభుత్వానికి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. భూసేకరణకు ప్రయత్నాలకు ఉమ్మడి హైకోర్టు బ్రేక్‌ వేసింది. గుంటూరు జిల్లా, పెనుమాక గ్రామ రైతులను వారి భూముల నుంచి ఖాళీ చేయించకుండా యథాతథస్థితి (స్టేటస్‌కో)ని కొనసాగించా లని హైకోర్టు రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. దీంతో కొన్ని నెలలుగా పోరాడుతున్న రైతులకు ఊరట లభించినట్లయింది. 2013 భూ సేకరణ చట్ట నిబంధనలను అనుసరించి సామాజిక ప్రభావ అంచనా (ఎస్‌ఈఎస్‌) చేపట్టడంతో పాటు, భూ సేకరణ నోటిఫికేషన్‌పై బాధితుల అభ్యంతరాలను పరిగణనలోకి తీసుకోవాలని ప్రభుత్వానికి హైకోర్టు తేల్చి చెప్పింది.

ఈ ఆదేశాలతో రైతులు దాఖలు చేసిన పిటిషన్లను పరిష్కరిస్తున్నట్లు తెలిపింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్‌ ఆకుల వెంకట శేషసాయి సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. రాజధాని ప్రాంత అభివృద్ధిలో భాగంగా భూ సేకరణ కోసం ప్రభుత్వం ఈ నెల 11న జారీ చేసిన ప్రాథమిక నోటిఫికేషన్‌ను సవాలు చేస్తూ పెనుమాకకు చెందిన 251 మంది రైతులు హైకోర్టులో వేర్వేరుగా పిటిషన్లు దాఖలు చేశారు. ఈ వ్యాజ్యంపై సోమవారం న్యాయమూర్తి జస్టిస్‌ ఎ.వి.శేషసాయి విచారణ చేపట్టారు.

తూతూమంత్రంగా గ్రామసభలు, సర్వేలు..
పిటిషనర్ల తరఫు న్యాయవాది పొన్నవోలు సుధాకర్‌రెడ్డి వాదనలు వినిపిస్తూ, ప్రాథమిక నోటిఫికేషన్‌ జారీ చేసేందుకు చట్ట నిబంధనల ప్రకారం పలు విధి విధానాలను అనుసరించాల్సి ఉందని, అయితే ప్రభుత్వం వాటిని విస్మరించిందని తెలిపారు. 2013 భూ సేకరణ చట్టం ప్రకారం నోటిఫికేషన్‌ జారీకి ముందు సామాజిక ప్రభావ అంచనా చేపట్టాల్సి ఉండగా, అది కూడా చేయలేదన్నారు. ఇక గ్రామసభల నిర్వహణ, క్షేత్రస్థాయి సర్వేలు తదితర వాటన్నింటినీ తూతూ మంత్రంగా ఒక్క రోజులోనే ముగించిందని ఆయన కోర్టుకు నివేదించారు. తరువాత ప్రభుత్వ ప్రత్యేక న్యాయవాది (ఎస్‌జీపీ) డి.రమేశ్‌ వాదనలు వినిపిస్తూ, తాము జారీ చేసింది కేవలం ప్రాథమిక నోటిఫికేషన్‌ మాత్రమేనన్నారు.

ఈ నోటిఫికేషన్‌పై అభ్యంతరాల స్వీకరణకు తమకు చట్ట ప్రకారం 60 రోజుల గడువు ఉందని ఆయన తెలిపారు. పిటిషనర్లు తెలియచేసే అభ్యంతరాలను తప్పక పరిగణనలోకి తీసుకుంటామన్నారు. చట్ట ప్రకారం పూర్తి చేయాల్సిన అన్ని విధి విధానాలను పూర్తి చేసిన తరువాతనే తుది నోటిఫికేషన్‌ జారీ చేస్తామని ఆయన వివరించారు. ఇరుపక్షాల వాదనలు విన్న న్యాయమూర్తి, సామాజిక ప్రభావ అంచనా చేపట్టి, భూ సేకరణపై రైతుల అభ్యంతరాలను పరిగణనలోకి తీసుకోవాలని ప్రభుత్వాన్ని ఆదేశించారు. అప్పటివరకు రైతుల భూముల విషయంలో యథాతథస్థితిని కొనసాగించాలని స్పష్టం చేస్తూ ఈ వ్యాజ్యాలను పరిష్కరించారు.

భూమి కోసం పెనుమాక రైతుల పోరాటం..
స్వచ్ఛంద భూ సమీకరణ అంటూ పైకి చెబుతూనే రాజధాని పరిధిలోని 29 గ్రామాలలో రైతులను సీఆర్‌డీఏ అధికా రులు రకరకాలుగా భయభ్రాంతుల కు గురి చేశారు. దీంతో తాడేపల్లి మండలం పెనుమాకకు చెందిన 670 ఎకరాల యజమానులు స్థానిక ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి ఆధ్వర్యంలో హైకోర్టులో పిటిషన్‌ వేశారు. సామాజిక సర్వేలు నిర్వహించకుండానే నిర్వహించినట్టు చిత్రీకరించడం, జరీబు భూములను మెట్ట గా చూపించి  మోసగించే ప్రయత్నం చేయడంతో రైతులు తమకు జరుగుతున్న అన్యాయంపై  కోర్టును ఆశ్రయించారు. కోర్టు చీవాట్లతో సీఆర్‌డీఏ అధికారులు పెనుమాకలో రైతులతో సమావేశం నిర్వహించారు.దీనికి హాజరైన ఎమ్మెల్యే అళ్ల రామకృష్ణారెడ్డి సామాజిక సర్వే వివరాలు తెలపాలని కోరడంతో సర్వే బృందం తూతూ మంత్రంగా లెక్కలు చూపించింది. రైతులు ఎంతమంది నష్టపోతున్నారు, ఎన్ని ఇళ్లు పోతున్నాయనే వివరాల పత్రాలను వైఎస్సార్సీపీ నేతలు చూపించడంతో నివ్వెరబోయిన అధికారు లు సమావేశం వాయిదా వేసి పరార య్యారు.దాంతో సీఆర్‌డీఏ అధికారుల తప్పుడు సర్వే పత్రాలను రైతులు అక్కడే దహనం చేశారు. ఉండవల్లిలో సైతం ఇదే తీరు ఎదురుకావడంతో ప్రభుత్వం భూసేకరణ నోటిఫికేషన్‌ జారీ చేసింది. దాన్ని సవాలు చేస్తూ ఎమ్మెల్యే ఆర్కే ఆధ్వర్యంలో రైతులు కోర్టును ఆశ్రయించడంతో హైకోర్టు స్టే ఆదేశాలను జారీచేసింది.

Advertisement

తప్పక చదవండి

Advertisement