మీ మాటలు నీటి మూటలు కాకుండా చూడండి | Sakshi
Sakshi News home page

మీ మాటలు నీటి మూటలు కాకుండా చూడండి

Published Sun, Jun 19 2016 1:43 AM

మీ మాటలు నీటి మూటలు కాకుండా చూడండి - Sakshi

కేంద్రమంత్రి వెంకయ్యకు వైఎస్సార్‌సీపీ నేత భూమన సూచన
 
 సాక్షి, హైదరాబాద్: పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేల సభ్యత్వం వెంటనే రద్దయ్యేలా ఫిరాయింపుల నిరోధక చట్టాన్ని సవరించాలన్న కేంద్రమంత్రి ఎం.వెంకయ్యనాయుడు.. తన మాటలను నీటి మూటలు కాకుండా కార్యరూపం దాల్చేలా చూడాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి భూమన కరుణాకర్‌రెడ్డి సూచించారు. సన్మాన సభల్లో సుద్దుల మాదిరిగా ఉత్తి మాటలు చెబితే సరిపోదని, లోక్‌సభలో రెండింట మూడొంతుల మెజారిటీ ఉన్నందున చిత్తశుద్ధితో చట్ట సవరణకు కృషి చేయాలని భూమన కోరారు. శనివారం ఆయన పార్టీ కేంద్ర కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు.

పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలపై స్పీకర్ అనర్హత వేటు వేయకపోయినా అడిగే అధికారం లేకుండా పోయిందని, స్పీకర్ అధికార పార్టీ నుంచి వచ్చిన వారు కావడం వల్లే ఇలా జరుగుతోందన్నారు. అందుకే ఈ విచక్షణాధికారాన్ని స్పీకర్ల పరిధి నుంచి తీసేసి ఎన్నికల కమిషన్‌కు అప్పగిస్తూ ఆర్డినెన్స్ తీసుకువచ్చి, తర్వాత చట్టం చేయాలని వైఎస్సార్‌సీపీ డిమాండ్ చేస్తోందన్నారు. తమ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఏప్రిల్ 26న కేంద్ర హోంమంత్రి రాజ్‌నాథ్ సింగ్‌తో సహా జాతీయ పార్టీల నేతలందరికీ ఈ విషయాన్ని సూచించారని చెప్పారు. ఈ మేరకు కేంద్ర హోం మంత్రికి వైఎస్ జగన్ రాసిన లేఖను ఆయన ప్రదర్శించారు. తమ పార్టీ ఎంపీ ఎస్పీవై రెడ్డి పార్టీ ఫిరాయించిన అంశంపై లోక్‌సభ మహిళా స్పీకర్ సుమిత్రా మహాజన్‌కు ఫిర్యాదు చేసినా ఇంత వరకు నిర్ణయం తీసుకోలేదన్నారు.

 బాబును  ఎందుకు మందలించలేదు?
  ఏపీలో ప్రతిపక్ష ఎమ్మెల్యేలను కొనుగోలు చేస్తున్న చంద్రబాబును.. ఆయనకు ఆత్మీయుడైన వెంకయ్య హెచ్చరించి, వారించి ఉండాల్సిందన్నారు. శాంతిభద్రతల్లో రాష్ట్రం ఐదో స్థానానికి దిగజారిందని, రాష్ట్రంలో ఎస్సీ, ఎస్టీలపైనే ఎక్కువగా కేసులు నమోదవుతున్నాయని చెప్పారు. గతంలో ఒకరిద్దరు చాలని చెప్పి.. ఇపుడు ఎక్కువ మంది పిల్లల్ని కనాలంటున్న చంద్రబాబును చూస్తుంటే కన్యాశుల్కంలో మరో గిరీశంలా మారారన్నారు.

Advertisement
Advertisement