ఖద్దరుకే ఓటు | Sakshi
Sakshi News home page

ఖద్దరుకే ఓటు

Published Sat, Jan 23 2016 1:11 AM

ఖద్దరుకే ఓటు

కొత్త డ్రెస్ కోడ్‌లో అభ్యర్థులు
 
ఎన్నికలు వచ్చాయంటే నేతల డ్రెస్ కోడ్ మారిపోతుంది. ఖద్దరు ఒంటిమీద పడిందంటే ‘పెద్దరికం’ వచ్చినట్టు భావిస్తారు. తెల్లని దుస్తుల్లో మెరిసిపోతూ హుందాగా తయారై.. ఓటర్లను ఆక ట్టుకునేందుకు ఉత్సాహంతో ఉరకలేస్తారు. అదే సందడి ఇప్పుడు నగరంలోని ఖద్దరు దుకాణాల వద్ద కనిపిస్తోంది. అదును చూసుకుని షాపుల యజమానులు ‘స్పెషల్’ అంటూ అమ్మకాల జోరు పెంచారు.     
 
రాజకీయాలకు.. ఖద్దరుకు విడదీయరాని అనుబంధం. ఢిల్లీ నుంచి గల్లీ దాకా.. ఈ బంధం తరతరాలుగా కొనసాగుతోంది. అందుకే నాయకులు, నాయకులమని భావించేవారు.. నేతలు కావాలనుకునేవారు ఖద్దరుకే ఓటేస్తున్నారు. గ్రేటర్ ఎన్నికల సీజన్ కావడంతో గిరాకీ పెరిగింది. నిన్నటివరకు టీ షర్ట్స్, జీన్స్‌లో కన్పించినవారు డివిజన్ అభ్యర్థిగా ఖరారవడంతో నిమిషాల్లో డ్రెస్ మార్చేసి ఖాదీకి షిఫ్టవుతున్నారు. అడుగు బయటపెట్టగానే వారి వెంట తిరిగే చోటా నాయకులు, కార్యకర్తలు కూడా అభ్యర్థి రూట్లోనే ఖద్దరులో కనిపిస్తున్నారు. రోజంతా ఎండలో తిరిగినా ఈ దుస్తుల వల్ల ఇబ్బంది ఉండడం లేదని, ఎక్కువ మందిని కలిసేందుకు వీలవుతుందనేది నేతల అభిప్రాయం. ఖద్దరు టోపీలు, కండువాలకు సైతం డిమాండ్ బాగానే పెరిగింది.
 
సీజన్‌లో లుక్ మారాల్సిందే..

ఎప్పుడూ టోర్న్ జీన్స్, టైట్ ఫిట్స్.. టీషర్ట్స్‌లో ఉండేవారు కూడా ఇప్పుడు ఖాదీకే ఓటేస్తున్నారు. ఇటీవల రాజకీయ నేతలు కొత్త ఫ్యాషన్‌కు షిఫ్ట్ అయ్యారు. సీనియర్ నేతలతో పాటు వారి వారసులు సైతం ఎన్నికలు రాగానే లుక్ మార్చేశారు. వీరు ఫ్యాషన్‌గా కనబడేందుకు ఖద్దరునే నచ్చిన డిజైన్‌లో కుట్టించుకుంటున్నారు. ఈ దుస్తుల్లో పొలిటికల్ స్టేటస్ వస్తుందనే భావనతో యంగ్ జనరేషన్ కూడా ఆ రూట్లోనే నడుస్తోంది. వారి అభిరుచుల మేరకు కొత్త డిజైన్లను షాపు యజమానులు అందుబాటులో ఉంచుతున్నారు.
 
ఎన్నికలొస్తే పండగే..
హైదరాబాద్‌లో దాదాపు 150కి పైగా ఖద్దరు షాపులున్నాయి. వేసవిలో వ్యాపారం ఫుల్ జోష్‌గా సాగుతోంది. సీజన్‌లో రోజుకు సుమారు రూ. 50 లక్షల వ్యాపారం జరుగుతుందని అంచనా. ముఖ్యమైన పండగలప్పుడు కొంత పర్వాలేదు. తర్వాత ఎన్నికలు వచ్చాయంటే నేతలు, వారి వెంట ఉండేవారు ఈ షాపుల వైపే చూస్తున్నారు. దీంతో సీజన్‌ను మించి వ్యాపారం సాగుతుంది.
 
ఆ రకాలకే ఓటు..
పొందూరు (ఆంధ్రప్రదేశ్), సేలం, తిరువూర్ (తమిళనాడు), భాగల్‌పూర్ (బీహార్), మస్లిన్ (బెంగాల్) ఖద్దరుకు ఎక్కువ డిమాండ్ ఉంటుందని భాగ్యనగర్ ఖాదీ బండార్ యజమాని బొప్పన నర్సింహారావు తెలిపారు. మాజీ ముఖ్యమంత్రి వై.ఎస్.రాజశేఖర్‌రెడ్డి తమ దుకాణం నుంచే పొందూరు పంచెలు కొనేవారని గుర్తుచేసుకున్నారు. తమిళనాడు గవర్నర్ రోశయ్య, ఏపీ శాసన మండలి చైర్మన్ చక్రపాణి, రాయపాటి సాంబశివరావు, నిర్మాత డి.సురేష్‌బాబు తమవద్దే ఖద్దరు కొంటారని చెప్పారు. ఈ దుస్తులు కట్టుకుని మండే ఎండలో తిరిగినా ఏ ఇబ్బందులు ఉండవని స్వరాజ్ ఖాదీ వీవర్స్ అధినేత కె. వెంకట్రావు తెలిపారు.
 
యువతరంగం ‘ఓటె’త్తాలి
⇒ఓటు ప్రజాస్వామ్యంలో అత్యంత శక్తివంతమైన ఆయుధం.
⇒ఒక్క క్షణం ఆలోచిస్తే దేశ భవిష్యత్‌ను, ప్రజల మనుగడను నిర్ణయించేది.
⇒ఓటు ఉండటం కాదు.. ఓటు వేయడం ప్రతి ఒక్కరి బాధ్యత.
⇒ఐదేళ్లకోసారి మీకు దక్కే ఈ అవకాశాన్ని  వినియోగించుకొని సరైన నాయకుడ్ని ఎంచుకోండి.
⇒నగర భవితను మార్చేది మీ ఓటే. ఓటు వేయడం నిర్బంధ బాధ్యతని గుర్తుంచుకోండి.
⇒ప్రజాస్వామ్యంలో మీ గొంతు వినిపించేది ఈ ఓటే.
⇒అందరూ వినియోగించుకుంటేనే మంచి ప్రభుత్వానికి పట్టం కట్టగలరు.
⇒యువత కదలివస్తే నగర భవిత మారుతుంది. యువతరంగం ఓటు కోసం తరలిరావాలి.
 
సీవీ ఆనంద్,    సైబరాబాద్ పోలీస్ కమిషనర్
 
 

Advertisement

తప్పక చదవండి

Advertisement