సై..సై..సైకిల్! | Sakshi
Sakshi News home page

సై..సై..సైకిల్!

Published Thu, Dec 17 2015 11:57 PM

సై..సై..సైకిల్! - Sakshi

‘కారు ఫ్రీ థర్స్ డే’లో పోలీసుల భాగస్వామ్యం
సైకిల్ తొక్కిన సీపీ ఆనంద్

 
సిటీబ్యూరో:  ఐటీ కారిడార్‌ను కాలుష్య రహితంగా తీర్చిదిద్దేందుకు నాలుగు నెలల క్రితం ప్రారంభించిన ‘కారు ఫ్రీ థర్స్ డే’ కార్యక్రమాన్ని సమర్థంగా ముందుకు తీసుకెళ్లడానికి సైబరాబాద్ పోలీసులు చేతులు కలిపారు. ఇక నుంచి ప్రతి గురువారం తాము కూడా కార్యాలయాలకు వెళ్లేందుకు ప్రజా రవాణా వ్యవస్థను ఉపయోగించాలని యోచిస్తున్నారు. ఇప్పటికే ప్రతి గురువారం సైకిళ్లు, బస్సులపై వస్తున్న వారికి మద్దతిస్తూ... మరికొంత మందిలో ఆ స్ఫూర్తిని రగిలిస్తున్నారు. ఇందులో భాగంగానే మైండ్ స్పేస్ నుంచి గచ్చిబౌలిలోని సైబరాబాద్ పోలీసు కమిషనరేట్ కార్యాలయం వరకు గురువారం సాగిన‘సైకిల్ విత్ సీపీ’లో కమిషనర్ సీవీ ఆనంద్‌తో పాటు ట్రాఫిక్ డీసీపీ అవినాష్ మహంతి, మాదాపూర్ డీసీపీ కార్తికేయ, పలువు రు పోలీసులు, ఐటీ ఉద్యోగులు, ఎస్‌సీఎస్‌సీ సభ్యులు, హైసా సభ్యులు, విద్యార్థులు పాల్గొన్నారు.

‘కారు పూలింగ్’పై దృష్టి
ఐటీ ఉద్యోగులు గురువారం మినహా మిగతా రోజుల్లో కార్యాలయాలకు సొంత కార్లనే ఉపయోగిస్తుంటారు. అందుకే ‘కారు పూలింగ్’ (షేరింగ్) వ్యవస్థపై సైబరాబాద్ పోలీ సులు దృష్టి సారించారు. దీనికి సైబరాబాద్ సెక్యూరిటీ కౌన్సిల్, హైసాతో కలిసి నడుస్తున్నారు.
 
సైక్లింగ్ సంస్కృతి పెరగాలి
 ఐటీ సెక్టార్‌లో వివిధ ప్రాం తాలకు చెందిన 4 లక్షల మంది ఉద్యోగులు పని చేస్తున్నారు. విదేశీయులూ వచ్చిపోతుంటారు. వచ్చే రెండేళ్లలో ఉద్యోగుల సంఖ్య ఆరు లక్షలకు పెరగవచ్చని అంచనా. గూగుల్, మైక్రోసాఫ్ట్ వంటి సంస్థలు మరిన్ని కార్యాలయాలు ఏర్పాటు చేసుకోవాలనుకుంటున్నాయి. ఫలితంగా వాహనాల సంఖ్యతో పాటు కాలుష్యమూ పెరిగే అవకాశముంది. అందుకే ఇప్పటి నుంచే ఐటీ ఉద్యోగుల్లో సైక్లింగ్, వాకింగ్, రన్నింగ్ సంస్కృతి పెంచే దిశగా పోలీసుల సహకారంతో ఎస్‌సీఎస్‌సీ, హైసా పనిచేస్తున్నాయి. ఐటీ కంపెనీలు ఉద్యోగులకు సైకిల్ అవసరాన్ని చెబుతున్నాయి. సైక్లింగ్‌కు ప్రత్యేక లైన్లను కోన్‌ల ద్వారా ఏర్పాటు చేస్తామని ట్రాఫిక్ పోలీసులు చెబుతున్నారు. సైక్లింగ్ అలవాటు ఆరోగ్యానికీ మంచిదని అంటున్నారు.
 
ప్రతి గురువారం సైకిల్‌పై వెళతా
భవిష్యత్‌ను దృష్టిలో పెట్టుకొని ఐటీ కారిడార్‌లో కాలుష్యాన్ని తగ్గించాల్సిన అవసరముంది. ఐటీ ఉద్యోగులు ప్రతి గురువారం కారు ఫ్రీ డేను పాటించడం మంచిది. ఇక నుంచి ప్రతి గురువారం యూసఫ్‌గూడలోని మా ఇంటి నుంచి గచ్చిబౌలి పోలీసు కమిషనరేట్ కార్యాలయం వరకు సైకిల్ మీద వెళతా. మరికొందరు పోలీసులు స్ఫూర్తి పొందేలా చేస్తా. కాలుష్యం పెరగడం మన ఆరోగ్యానికి మంచిది కాదు. ఇంధనం వాడకుండా ట్రాన్స్‌పోర్టు మెకానిజమ్ చాలా అవసరమని గుర్తించాలి.
 - సీవీ ఆనంద్, సైబరాబాద్ పోలీస్ కమిషనర్
 
నాతో పాటు తీసుకెళతా
 రోజూ సికింద్రాబాద్ నుంచి మైండ్ స్పేస్‌కు కారులో వస్తుంటా. కారు పూలింగ్ అప్లికేషన్ రైడ్ ఐటీ యాప్‌ను స్మార్ట్‌ఫోన్‌లో డౌన్‌లోడ్ చేసుకున్నా. అందులో మెంబర్‌గా చేరా. రోజూ ఉదయం 9 గంటలకు బయలుదేరుతా. ఈ మార్గంలో ఎవరైనా ఉంటే నా కారులో ఎక్కవచ్చనే మెసేజ్ పోస్ట్ చేస్తా. అప్పటికే ఈ యాప్‌లో సబ్‌స్క్రైబ్ చేసుకున్న వారిని ఎక్కించుకొని కార్యాలయానికి వస్తా. నాతో పాటు ప్రయాణించిన వారికి కిలోమీటర్‌కు రూ.రెండు నుంచి రూ.నాలుగు చొప్పున చార్జీ పడుతుంది. దీనివల్ల రోడ్డెక్కే వాహనాలు తగ్గుతాయి. ట్రాఫిక్ ఉండదు. కాలుష్యం తగ్గుముఖం పడుతుంది.
 భరణి,  ఐటీ ఉద్యోగి  .
 
మైండ్ స్పేస్ జంక్షన్ నుంచి సైబరాబాద్ పోలీసు కమిషనరేట్ కార్యాలయానికి సైకిల్‌పై వెళుతున్న సీపీ సీవీ ఆనంద్, మాదాపూర్ డీసీపీ కార్తికేయ,
 ఐటీ ఉద్యోగులు, విద్యార్థులు
 

Advertisement
Advertisement