కార్బైడ్ నిషేధంపై ఇంత అలసత్వమా? | Sakshi
Sakshi News home page

కార్బైడ్ నిషేధంపై ఇంత అలసత్వమా?

Published Sat, Jan 23 2016 3:12 AM

కార్బైడ్ నిషేధంపై ఇంత అలసత్వమా?

తెలంగాణ, ఏపీ రాష్ట్రాల తీరుపై ఉమ్మడి హైకోర్టు అసహనం
సాక్షి, హైదరాబాద్: కాయల్ని పక్వానికి తీసుకొచ్చేందుకు కార్బైడ్ వాడకుండా నిషేధించే విషయంలో, కార్బైడ్ వాడటం వల్ల కలిగే దుష్పరిణామాలపై ప్రజల్లో అవగాహన కల్పించడంలో తెలంగాణ, ఏపీ రాష్ట్రాల వ్యవహార శైలిపై హైకోర్టు అసంతృప్తి, అసహనాన్ని వ్యక్తం చేసింది. ఇది సమాజంలోని ప్రతి వ్యక్తిపై ప్రభావం చూపే వ్యవహారమని, ఇలాంటి వాటిలోనూ అలసత్వమేమిటని ఇరు ప్రభుత్వాలను ప్రశ్నించింది.
 
కార్బైడ్ వాడే పండ్లను తినడం వల్ల కలిగే ప్రమాదాలపై విస్తృత ప్రచారం నిర్వహించాలని తాము ఇప్పటికే స్పష్టమైన ఆదేశాలు జారీ చేశామని, వాటిని అమలు చేస్తున్న దాఖలాలు ఎక్కడా కనిపిం చడం లేదంది. ఈ మొత్తం వ్యవహారంలో ఉభయ ప్రభుత్వాలకు చిత్తశుద్ధి ఉన్నట్లు కని పించడం లేదని ఘాటుగా వ్యాఖ్యానించింది. రెండు రాష్ట్రాల వ్యవసాయ శాఖల ముఖ్య కార్యదర్శులు వ్యక్తిగతంగా కోర్టు ముందు హాజరుకావాలని ఆదేశించింది.
 
తదుపరి విచారణను ఫిబ్రవరి 1కి వాయిదా వేసింది. ఈమేరకు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ దిలీప్ బి.బొసాలే, న్యాయమూర్తి జస్టిస్ ఎస్.వి.భట్‌లతో కూడిన ధర్మాసనం శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది. పండ్ల వ్యాపారులు కార్బైడ్ ద్వారా కాయల్ని మగ్గబెడుతూ ప్రజల ఆరోగ్యంతో చెలగాటమాడుతున్నారం టూ పత్రికల్లో వచ్చిన కథనాలను హైకోర్టు, పిల్‌గా స్వీకరించిన విషయం తెలిసిందే.  
 

Advertisement
Advertisement