ఫస్టియర్ విద్యార్థులూ జాగ్రత్త! | Sakshi
Sakshi News home page

ఫస్టియర్ విద్యార్థులూ జాగ్రత్త!

Published Sat, Apr 23 2016 2:00 AM

ఫస్టియర్ విద్యార్థులూ జాగ్రత్త!

ఇప్పటికే పాసైన సబ్జెక్ట్‌ను ఇంప్రూవ్‌మెంట్‌లో ఫెయిలైతే ఫెయిలే
సాక్షి, హైదరాబాద్: ఫస్టియర్‌లో కొన్ని సబ్జెక్టుల్లో ఫెయిలై, కొన్ని సబ్జెక్టుల్లో పాసయ్యారా? ఫెయిలైన సబ్జెక్టులతోపాటు పాసైన సబ్జెక్టుల్లో మార్కులు పెంచుకునేందుకు అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్షలు రాయాలనుకుంటున్నారా? అయితే జాగ్రత్త! ప్రస్తుతం పాసైన సబ్జెక్టుల్లో.. అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్షలో ఫెయిల్ అయ్యారో ఫెయిల్ కిందే లెక్క! అంతకుముందుకు ఆ సబ్జెక్టులో పాస్ అయినా చివరి ఫలితాలనే పరిగణనలోకి తీసుకుంటారు. ఈ మేరకు ఇంటర్ బోర్డు అధికారులు వెల్లడించారు. ఇక ప్రథమ సంవత్సర విద్యార్థులు అన్ని సబ్జెక్టుల్లో ఉతీర్ణులైన వారు ఇంప్రూవ్‌మెంట్ రాసుకోవచ్చు. వీరికి మాత్రం ఎందులో ఎక్కువ మార్కులు వస్తే దాన్నే పరిగణనలోకి తీసుకుంటారు. వీరు సాధారణ ఫీజుతోపాటు ప్రతి పేపరుకు రూ.100 చొప్పున చెల్లించాలి.

 రీకౌంటింగ్, రీవెరిఫికేషన్ కమ్ ఫొటోకాపీకి అవకాశం
రీకౌంటింగ్, రీవెరిఫికేషన్ కమ్ ఫొటో కాపీ కోసం విద్యార్థులు ఈ నెల 30లోగా ఆన్‌లైన్‌లో ఫీజు చెల్లించాలి. రీకౌంటింగ్ కోసం ఒక్కో పేపరుకు రూ.100 చెల్లించాలి. రీ వెరిఫికేషన్, మూల్యాకనం చేసిన జవాబు పత్రాల జిరాక్స్ కాపీ (ఫొటో కాపీ) పొందేందుకు ఒక్కో సబ్జెక్టుకు రూ.600 చొప్పున మీసేవా, ఏపీ ఆన్‌లైన్ కేంద్రాల్లో ఫీజు చెల్లించాలి. ఇంప్రూవ్‌మెంట్ రాయాలనుకునే వారు, రీకౌంటింగ్, రీవెరిఫికేషన్ కోసం దరఖాస్తు చేసుకోవాలనుకునే వారు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని ఇంటర్ బోర్డు అధికారులు సూచించారు.

 జేఈఈ మెయిన్‌లో వార్షిక పరీక్షలే లెక్క
ఎన్‌ఐటీ, ట్రిపుల్‌ఐటీల్లో ప్రవేశాల కోసం నిర్వహించిన జేఈఈ మెయిన్ తుది ర్యాం కుల ఖరారులో (జేఈఈ స్కోర్‌కు 60%, ఇంటర్ మార్కులకు 40%) ఇంటర్ వార్షిక పరీక్ష ఫలితాలనే పరిగణనలోకి తీసుకుంటారు. జేఈఈ అడ్వాన్స్‌డ్‌లో టాప్ ర్యాంకు విద్యార్థులు ఐఐటీల్లో ప్రవేశాలకోసం రాష్ట్ర బోర్డు నుంచి పరీక్షకు హాజరైన విద్యార్థుల్లో టాప్-20 పర్సంటైల్‌లో ఉండాలి. లేదా బోర్డు పరీక్షలో 75% మార్కులు సాధించి ఉండాలి.

 ఎంసెట్‌లో ఇలా..
ఇంటర్ వార్షిక పరీక్షల్లో ఉత్తీర్ణులైన విద్యార్థుల మార్కులకు 25% వెయిటేజీ ఇచ్చి ఎంసెట్ తుది ర్యాంకును ఖరారు చేస్తారు. ఎవరైనా విద్యార్థి వార్షిక పరీక్షల్లో ఫెయిల్ అయి, అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీలో పాస్ అయితే ఆ మార్కులను పరిగణలోకి తీసుకుంటారు. వాటి ఆధారంగానే ఆ విద్యార్థికి ఎంసెట్ తుది ర్యాంకును ఖరారు చేస్తారు.

Advertisement

తప్పక చదవండి

Advertisement