శ్రీవారి భక్తులపై కేసులా..? | Sakshi
Sakshi News home page

శ్రీవారి భక్తులపై కేసులా..?

Published Fri, Jan 17 2014 1:43 AM

case on the sr ivari devotees

ఎన్నో వ్యయప్రయాలసకోర్చి తిరుమల శ్రీనివాసుడిని దర్శించుకునేందుకు వచ్చిన భక్తులకు దర్శనం కల్పించలేని తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు..ఆందోళన చేశారని భక్తులపై కేసులు నమోదు చేయడంపై తీవ్ర ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయి. ముక్కో టి ఏకాదశి సందర్భంగా ఈనెల 11న టీటీడీ ఇష్టానుసారం వీఐపీ పాసులు జారీచేయడంతో దర్శనం ఆలస్యమవుతుందని భక్తులు కొందరు చైర్మన్ కార్యాలయం ఎదుట ఆందోళన చేసిన విషయం తెలిసిందే.

 దీనికి స్పందించిన భద్రతా అధికారులు భక్తులపై కేసులు నమోదు చేశారు. దీనిపై హిందూ సంఘాల ప్రతినిధులు, భక్తులు మండిపడుతున్నారు. దేవుడి దర్శనం కల్పించడంలో విఫలమైన టీటీడీ చైర్మన్,ఈవోలపైనే కేసులు నమోదు చేయాలని వారు డిమాండ్ చేశారు.

 ఎవరెమన్నారంటే..
  ప్రపంచ ఆరాద్యదైవమైన శ్రీవెంకటేశ్వరస్వామి దర్శించుకునేందుకు వచ్చిన భక్తులపై కేసులు నమోదు చేయడం అత్యంత హేయమని ప్రముఖ సినీహీరో శివాజీ అన్నారు. గురువారం లిబర్టీ శ్రీవేంకటేశ్వరస్వామి ఆలయం వద్ద శివాజీ నిరసన వ్యక్తం చేశారు. అనంతరం విలేకరులతో మాట్లాడుతూ టీటీడీ పాలకమండలి తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.

 తిరుమలలో సామాన్య భక్తుడు కూడా వీఐపీ అని..అది స్వామివారికి కూడా ప్రీతిపాత్రమని చెప్పారు. ఒక్క టీటీడీ చైర్మన్ పేరుతోనే 1000 పాసులిచ్చారని..ఇదేనా మీ బాధ్యతా అని మండిపడ్డారు. తక్షణమే కేసులు ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు.  

  భక్తులపై కేసులు నమోదు చేయడం అన్యాయమని, దీనిపై సంబంధిత అధికారులపై, బోర్డుపై చర్యలు తీసుకోవాలని కోరుతూ రాంగోపాల్‌పేటకు చెందిన సతీష్, కవాడిగూడకు చెందిన శ్యామ్ మానవహక్కుల కమిషన్ సభ్యులు పెద పేరిరెడ్డికి ఫిర్యాదు చేశారు. భక్తులకు దర్శనం,ఇతర సౌకర్యాలు కల్పించలేని టీటీడీ..కేసులు నమోదు చేయడం అత్యంత దుర్మార్గమని ఫిర్యాదులో పేర్కొన్నారు.

  తిరుమలను వీఐపీలకు పరిమితం చేస్తూ సామాన్య భక్తులను దేవస్థానం గాలికొదిలేస్తోందని ఆరోపిస్తూ చిక్కడపల్లికి చెందిన సామాజికకార్యకర్త విశ్వనాథం హెచ్‌ఆర్సీకి ఫిర్యాదు చేశారు. టీటీడీ చైర్మన్,ఈవోలు వీఐపీలకే ప్రాధాన్యమిస్తూ సామాన్యుల పట్ల చిన్నచూపు చూస్తున్నారని, మొత్తం దీనిపై సమగ్ర విచారణ చేపట్టాలని ఫిర్యాదులో కోరారు.

 టీటీడీ చర్య హిందువుల మనోభావాలు, హక్కులకు తీవ్ర విఘాతం కలిగిస్తోందని, ఈ విషయమై టీటీడీ నిఘా అధికారులు, చైర్మన్, ఈవోలపై చర్యలు తీసుకోవాలని వనస్థలిపురం డివిజన్ బీజేపీ అధ్యక్షుడు పి.గిరిధర్, భాగ్యనగర్ గణేష్ ఉత్సవ సమితికార్యదర్శి శశిధర్, బీజేపీ లీగల్‌సెల్ నగర నాయకుడు పి.ప్రదీప్‌కుమార్ తదితరులతో కూడిన బృందం హెచ్‌ఆర్సీకి ఫిర్యాదు చేసింది. దీనికి స్పందించిన కమిషన్ ఈనెల 30లోపు సమగ్ర నివేదిక సమర్పించాలని దేవాదాయశాఖ ముఖ్యకార్యదర్శిని ఆదేశించినట్లు వారు తెలిపారు.

  భక్తులపై టీటీడీ కేసులు నమోదు చేయడాన్ని వ్యతిరేకిస్తూ హిందూ సంస్థలు వనస్థలిపురం పనామా చౌరస్తాలో వేంకటేశ్వరస్వామి స్వాగతద్వారం వద్ద మౌనదీక్షను చేపట్టాయి. అనంతరం జాతీయరహదారిపై నిరసన వ్యక్తం చేశాయి.

Advertisement
Advertisement