‘కామన్‌’ ఇంటర్‌కు సీబీఎస్‌ఈ ఓకే | Sakshi
Sakshi News home page

‘కామన్‌’ ఇంటర్‌కు సీబీఎస్‌ఈ ఓకే

Published Wed, Apr 26 2017 12:39 AM

‘కామన్‌’ ఇంటర్‌కు సీబీఎస్‌ఈ ఓకే

- ఇంటర్‌లో ఒకే సిలబస్‌కు సూత్రప్రాయ ఆమోదం
- సైన్స్‌ గ్రూపుల సబ్జెక్టుల్లో 100, ఇతర గ్రూపుల్లో 70 శాతం
- వచ్చే రెండేళ్లలో అన్ని రాష్ట్రాల్లో అమల్లోకి
- కామన్‌ ప్రశ్నపత్రంపై త్వరలో నిర్ణయం!


సాక్షి, హైదరాబాద్‌: దేశవ్యాప్తంగా ఇంటర్మీడియెట్‌లో కామన్‌ సిలబస్‌ అమలుకు కేంద్రం సూత్రప్రాయంగా అంగీకరించింది. తెలంగాణ ఇంటర్మీడియెట్‌ బోర్డు కార్యదర్శి అశోక్‌ నేతృ త్వంలో సెంట్రల్‌ బోర్డ్‌ ఆఫ్‌ సెకండరీ ఎడ్యు కేషన్‌ (సీబీఎస్‌ఈ) ఏర్పాటు చేసిన జాతీయ స్థాయి కమిటీ సూచించిన కామన్‌ సిలబస్‌ విధానానికి ఓకే చెప్పింది. ఇటీవల ఢిల్లీలో జరిగిన వివిధ రాష్ట్రాల విద్యాశాఖ అధికారుల సమావేశంలో కామన్‌ సిలబస్‌ విధానానికి సీబీఎస్‌ఈ అంగీకరించింది. జాతీయ విద్యా పరిశో ధన, శిక్షణ మండలి (ఎన్‌సీఈఆర్‌టీ) సిలబస్‌కు అనుగుణంగా ఇప్పటికే సిలబస్‌ను మార్పు చేసుకున్న రాష్ట్రాలు అధికారిక ఉత్తర్వులు వెలు వడిన వెంటనే ఆ విధానాన్ని అమల్లోకి తీసుకు రావాలని, వచ్చే రెండేళ్లలో అన్ని రాష్ట్రాలు కచ్చితంగా అమలు చేయాలంది. కమిటీ రూపొందించిన కామన్‌ సిలబస్‌ను అన్ని రాష్ట్రాల ఇంటర్‌ బోర్డుల కార్యదర్శులకు అందజేసింది. కామన్‌ ప్రశ్నపత్రాల విధానంపై త్వరలో జరిగే సమా వేశంలో నిర్ణయం తీసుకునే అవకాశముంది.

మ్యాథ్స్, సైన్స్‌లలో 100 శాతం కామన్‌
ఇంటర్‌ విద్యకు సంబంధించి సీబీఎస్‌ఈ విద్యా సంస్థల్లో 10+2 విధానంలోనూ కామన్‌ కోర్‌ సిలబస్‌ ఉండాలని నివేదికలో కమిటీ సూచించి నట్లు తెలిసింది. సైన్స్‌ గ్రూపుల సబ్జెక్టుల్లో (మ్యాథ్స్, బయాలజీ, ఫిజిక్స్, కెమిస్ట్రీ) 100% కామన్‌ కోర్‌ సిలబస్‌ (అన్ని రాష్ట్రాల్లో ఒకేలా) ఉండాలని.. ఇందులో 50% పాఠ్యాంశాలు రాత పరీక్షల మేరకు, మరో 50% ప్రాక్టికల్స్‌ చేసేలా ఉండాలని పేర్కొంది. ఇతర గ్రూపులు, ఆయా సబ్జెక్టుల్లోనూ 70% సిలబస్‌ అన్ని రాష్ట్రాల్లో ఒకే లా ఉండాలని, మిగతా 30% సిలబస్‌ను ఆయా రాష్ట్రాల అవసరాలకు అనుగుణంగా మార్పులు చేసుకునేలా వీలు కల్పించాలంది.

గతేడాది  నగరంలో జరిగిన సమావేశంలో వివిధ రాష్ట్రా ల్లో ఇంటర్‌ సిలబస్‌ను సమీక్షించి, కామన్‌ కోర్‌ సిలబస్‌ను కమిటీ రూపొందించింది. దానికి అనుగుణంగా ప్రస్తుతం వివిధ రాష్ట్రాలు సిల బస్‌లో మార్పులు చేసుకోవాల్సి ఉంటుంది. ప్రస్తుత సిలబస్‌ను రాష్ట్రాలు సమీక్షించుకుని అఖిల భారత స్థాయిలో అన్ని పోటీ, ప్రవేశ పరీక్షలకనుగుణంగా మార్పులు చేసుకోవాలి. సైన్స్‌ గ్రూపులు మినహా మిగతా గ్రూపుల సబ్జెక్టుల్లో 30% వరకు సిలబస్‌ చేర్చడం, చేర్చక పోవడం ఆయా రాష్ట్రాల ఇష్టమే. అదనంగా చేర్చుకోవడం ఇష్టం లేకపోతే 70% కామన్‌ కోర్‌ సిలబస్‌తోనే ఇంటర్‌ను కొనసాగించవచ్చు.

ప్రతి పేపరులో ప్రాక్టికల్‌ విధానం..
ప్రశ్నపత్రాల నమూనాపై మేఘాలయ ఎడ్యు కేషన్‌ కమిషనర్‌ అండ్‌ సెక్రటరీ ఈపీ కర్భీహ్‌ కమిటీ గతంలోనే నివేదిక అందించింది. ఇంటర్‌ లో 100 మార్కులకు నిర్వహించే ప్రతీ పరీక్షలో ప్రశ్నల సరళి 2:4:8 పద్ధతిలో ఉండాలంది. పరీక్షించే విధానం డిస్క్రిప్టివ్‌లో ఉండాలని, అందులో 2 వ్యాసరూప సమాధానాల ప్రశ్నలు, 4 మధ్యస్థాయి, 8 లఘు ప్రశ్నలుండాలని సిఫార్సు చేసింది. అలాగే విద్యార్థి ప్రతి ప్రశ్నకు జవాబు రాసేలా ప్రశ్నపత్రం ఉండాలని, ఆప్షన్‌ విధానం ఉండొద్దని పేర్కొంది.

ప్రతి పేపరులో ప్రాక్టికల్‌ విధానం ఉండాలని.. రాత పరీక్ష 70, ప్రాక్టికల్స్‌ 30 మార్కులకు ఉండాలని సూచించింది. విద్యార్థులు ప్రశ్నపత్రం చదివేందుకు 15 నిమిషాలు అదనపు సమయం ఇవ్వాలని పేర్కొంది. ప్రశ్నల స్థాయి 3 కేటగిరీలుగా ఉండా లని.. సులభతరమైనవి 35%, యావరేజ్‌ ప్రశ్నలు 40%, కఠిన ప్రశ్నలు 25% ఉండేలా చర్యలు చేపట్టాలని కోరింది. పరీక్షల్లో గణితం, సైన్స్‌ పేపర్లకు 3 గంటల సమయం ఇవ్వాలని సూచించింది.

Advertisement
Advertisement