శభాష్‌ తెలంగాణ | Sakshi
Sakshi News home page

శభాష్‌ తెలంగాణ

Published Sat, Apr 8 2017 1:53 AM

Central government praises the state Ministry of Culture

రాష్ట్ర సాంస్కృతిక శాఖకు కేంద్రం కితాబు

సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖకు అరుదైన గుర్తింపు దక్కింది. కేంద్ర ప్రభుత్వ సాంస్కృతిక శాఖ మన్ననలు పొందింది. ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలోని కేంద్రం ‘ మన సంస్కృతే మనకు గుర్తింపు’ అనే పేరుతో సరికొత్త సాంస్కృతిక ప్రాజెక్టుకు శ్రీకారం చుట్టింది. అందులో భాగంగా అన్ని రాష్ట్రాల భాషా సాంస్కృతిక శాఖ కార్యదర్శులు, డైరెక్టర్‌లతో శుక్రవారం ఢిల్లీలో విస్తృత స్థాయి సమావేశం నిర్వహించారు. కేంద్ర సాంస్కృతిక కార్యదర్శి ఎన్‌.కె. సిన్హా మాట్లాడుతూ కల్చరల్‌ మ్యాపింగ్‌ కోసం ఈ సమావేశం ఏర్పాటు చేశామని తెలిపారు.

గ్రామస్థాయిలో ఉండే కళారూపాలు, కళాకారులు, వారి చరిత్ర, విశేషాలు తదితర వివరాలు సేకరించటమే ఈ ప్రాజెక్టు ఉద్దేశమని చెప్పారు. అనంతరం రాష్ట్ర భాషా సాంస్కృతిక శాఖ డైరెక్టర్‌ మామిడి హరికృష్ణ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైనప్పటి నుంచే తాము ఈ ప్రాజెక్టును ప్రారంభించామన్నారు. 700 మంది కవుల డేటాను పూర్తి వివరాలతో ఇప్పటికిప్పుడే అందజేస్తానని అనగానే సభలోని అధికారులు చప్పట్లతో ఆయనకు అభినందనలు తెలిపారు. జూన్‌లో జరిగే రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం తర్వాత నుంచి కళాకారులు నేరుగా వెబ్‌సైట్‌లోకి లాగిన్‌ అయి వారికి వారే గుర్తింపు కార్డులు డౌన్‌లోడ్‌ చేసుకొనే ఓ సరికొత్త సాఫ్ట్‌వేర్‌తో వెబ్‌సైట్‌ రూపొందిస్తున్నట్లు చెప్పగానే కేంద్ర సాంస్కృతిక శాఖ కార్యదర్శి సిన్హా ‘శభాష్‌ తెలంగాణ’ అంటూ ప్రశంసల వర్షం కురిపించటం విశేషం.

Advertisement
Advertisement