ఆరోగ్య శాఖకు రూ.1105 కోట్ల కేటాయింపు | Sakshi
Sakshi News home page

ఆరోగ్య శాఖకు రూ.1105 కోట్ల కేటాయింపు

Published Sat, Aug 29 2015 8:07 PM

central sanctioned the Rs.1105 crores of health department

తల్లీబిడ్డల ఆరోగ్యం కోసం రూ. 278 కోట్లు
కొత్తగా 53 పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు
39 రక్త నిధి కేంద్రాల బలోపేతం

హైదరాబాద్: జాతీయ ఆరోగ్య మిషన్ కింద రాష్ట్రంలో ఆరోగ్య కార్యక్రమాలను అమలు చేసేందుకు కేంద్ర ప్రభుత్వం 2015-16 సంవత్సరానికి రూ. 1105.18 కోట్లు కేటాయించింది. ఈ మేరకు రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ పంపిన ప్రతిపాదనలను అంగీకరించింది. ఈ విషయాన్ని ఆరోగ్య కుటుంబ సంక్షేమ కమిషనర్ జ్యోతిబుద్ధప్రకాశ్ శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఆయన వెల్లడించిన వివరాల ప్రకారం.. గత ఏడాది కేంద్రం రూ.792 కోట్లు కేటాయించగా.. ఈసారి రూ. 313.16 కోట్లు (28.3%) అదనంగా కేటాయించింది. కేటాయించిన నిధుల్లో తల్లీబిడ్డల ఆరోగ్య కార్యక్రమాలకు రూ. 278.50 కోట్లు, ఆర్‌బీఎస్కే, 108, 104, ఆసుపత్రుల అభివృద్ధి నిధులు వంటి వాటికోసం రూ. 431.18 కోట్లు కేటాయించింది. ఇమ్యునైజేషన్‌కు రూ. 28.34 కోట్లు, జాతీయ పట్టణ ఆరోగ్య మిషన్‌కు రూ. 169.54 కోట్లు, వ్యాధి నియంత్రణ కార్యక్రమాలకు రూ. 76.41 కోట్లు, మౌలిక సదుపాయాలు, నిర్వహణకు రూ. 107.01 కోట్లు కేటాయించింది.

నూతనంగా 53 పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలకు కేటాయించిన నిధులతో రాష్ట్రంలో అనేక కొత్త కార్యక్రమాలను చేపట్టాలని కేంద్రం నిర్ణయించింది. ఆ ప్రకారం నూతనంగా 53 పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు ఏర్పాటు చేస్తారు. 32 కొత్త మొబైల్ మెడికల్ యూనిట్లు ఏర్పాటు చేస్తారు. 39 రక్తనిధి కేంద్రాలు బలోపేతం చేస్తారు. సేకరించిన రక్తం సరఫరాకు 12 వాహనాలను సమకూర్చుతారు. పీహెచ్‌సీల నుంచి జిల్లా ఆసుపత్రుల వరకు అన్నిచోట్లా ఉచిత మందులు, పరీక్షలు నిర్వహిస్తారు. శిశుమరణాల రేటు తగ్గించేందుకు 10 కొత్త తల్లి సంరక్షణ కేంద్రాలను ఏర్పాటు చేస్తారు. 14 ఏరియా, సామాజిక ఆరోగ్య కేంద్రాల్లో అల్ట్రాసౌండ్ స్కానర్లను ఏర్పాటు చేస్తారు. ఐదు జిల్లాల్లో ఫ్లోరోసిస్ నియంత్రణ సెల్‌లను ఏర్పాటు చేస్తారు. ఆరు జిల్లాల్లో జాతీయ పొగాకు నియంత్రణ కార్యక్రమాలను అమలుచేస్తారు. కాయకల్ప కార్యక్రమాలు, ఆసుపత్రుల్లో నాణ్యమైన వైద్యం కోసం కార్యక్రమాలు అమలుచేస్తారు.

Advertisement

తప్పక చదవండి

Advertisement