టీఆర్‌ఎస్ వైఫల్యాలను ఎండగట్టండి | Sakshi
Sakshi News home page

టీఆర్‌ఎస్ వైఫల్యాలను ఎండగట్టండి

Published Tue, Oct 4 2016 2:45 AM

టీఆర్‌ఎస్ వైఫల్యాలను ఎండగట్టండి - Sakshi

తెలంగాణ టీడీపీ నేతలకు చంద్రబాబు దిశానిర్దేశం

 సాక్షి, హైదరాబాద్: టీఆర్‌ఎస్ రెండున్నరేళ్ల పాలనలోని వైఫల్యాలను ఎండగట్టాలని తెలంగాణ టీడీపీ నేతలకు ఆ పార్టీ అధ్యక్షుడు, ఏపీ సీఎం చంద్రబాబునాయుడు దిశానిర్దేశం చేశారు. ఎన్నికలకు ముందు, అధికారంలోకి వచ్చాక టీఆర్‌ఎస్ ఇచ్చిన హామీల అమలుకు వివిధ రూపాల్లో ఆందోళన లకు సిద్ధం కావాలని సూచించారు. ప్రస్తుతం రాష్ట్రంలో మారిన రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో జిల్లాల్లో పార్టీ నాయకులంతా సరైన పద్ధతిలో స్పందించాలని... ప్రభుత్వ వ్యతిరేకతను టీడీపీకి అనుకూలంగా మలిచేలా కార్యక్రమాలను రూపొందించాలని ఆదేశించారు. రాష్ర్టంలో కొత్త జిల్లాలు ఏర్పాటవుతున్న నేపథ్యంలో పార్టీ కమిటీలను పునర్‌వ్యవస్థీకరించాలన్నారు.

జిల్లా స్థాయిలో పార్టీ పటిష్టతకు చర్యలు తీసుకోవాలని, వచ్చేనెల 1 నుంచి రాష్ట్రంలో పెద్ద ఎత్తున సభ్యత్వ నమోదును చేపట్టాలని ఆదేశించారు. సోమవారం హైదరాబాద్‌లోని లేక్‌వ్యూ అతిథిగృహంలో పార్టీ నేతలు ఎల్.రమణ, రేవంత్‌రెడ్డి, మోత్కుపల్లి నర్సింహులు, రావుల చంద్రశేఖర్‌రెడ్డి, నామా నాగేశ్వరరావు, అరవింద్‌కుమార్‌గౌడ్, ఉమా మాధవరెడ్డి, అన్నపూర్ణమ్మ, అమర్‌నాథ్‌బాబులతో చంద్రబాబు సమావేశమయ్యారు. రాష్ట్రంలో భారీ వర్షాలు, వరదల కారణంగా వాటిల్లిన నష్టం, సహాయ చర్యల్లో ప్రభుత్వ వైఫల్యం తదితర అంశాలు ఈ సందర్భంగా చర్చకు వచ్చాయి.

రైతాంగానికి వాటిల్లిన నష్టంపై ప్రభుత్వాన్ని నిలదీసి, తగిన పరిహారం వచ్చేలా పార్టీ కార్యక్రమాలను నిర్వహించాలని నేతలకు చంద్రబాబు సూచించారు. టీడీపీ హయాంలో చేపట్టిన అభివృద్ధి, హైదరాబాద్‌లో చేపట్టిన సహాయ కార్యక్రమాలు తదితర అంశాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని పేర్కొన్నట్లు తెలిసింది. దసరా తర్వాత నియోజకవర్గానికి 50 మంది చొప్పున రాష్ట్రవ్యాప్తంగా పార్టీ మండల సమన్వయ కమిటీ సభ్యులకు శిక్షణా తరగతులు నిర్వహించే అంశం చర్చకు వచ్చింది. ఎన్నిరోజుల పాటు ఈ తరగతులు నిర్వహించాలి, ఏయే అంశాలను చేర్చాలి, వేటిపై శిక్షణ ఇవ్వాలన్న దానిపై మంగళవారం సమావేశమై ఒక బ్లూప్రింట్ సిద్ధం చేసుకుంటామని చంద్రబాబుకు నేతలు తెలిపారు.

Advertisement
Advertisement