ప్రభుత్వ వైద్యులపై నిఘా | Sakshi
Sakshi News home page

ప్రభుత్వ వైద్యులపై నిఘా

Published Mon, Jun 1 2015 1:55 AM

ప్రభుత్వ వైద్యులపై నిఘా - Sakshi

బోధనాస్పత్రుల్లో సీసీ కెమెరాలతో పర్యవేక్షణ
తొలి విడతగా సికింద్రాబాద్ గాంధీలో ఏర్పాటు
రూ.30 లక్షలతో 200 సీసీ కెమెరాలు

 
 సాక్షి, సిటీబ్యూరో : తెలంగాణ బోధనాస్పత్రుల్లో పని చేస్తున్న ప్రభుత్వ వైద్యులపై నిరంతర నిఘా పెట్టాలని సర్కార్ నిర్ణయించింది. వైద్య సేవల్లో మరింత పారదర్శకతను పెంపొందించేందుకు ఆస్పత్రులలోని అన్ని విభాగాలనూ ఆన్‌లైన్‌లో అనుసంధానానికి సన్నాహాలు చేస్తోంది. ఇప్పటికే వైద్యుల హాజరును ఆధార్‌తో అనుసంధానించే ప్రక్రియను ప్రారంభించిన వైద్య ఆరోగ్య శాఖ తాజాగా గాంధీ జనరల్ ఆస్పత్రిలో వైద్యసేవలపై నిరంతర నిఘా ఉంచాలని యోచిస్తోంది.

దీనిలో భాగంగా అత్యవసర విభాగం, మార్చురీ, పరిపాలనా భవనం, అవుట్ పేషెంట్, ఇన్‌పేషంట్ వార్డులు, ఆపరేషన్ థియేటర్స్, రేడియాలజీ, పాథాలజీ విభాగాల వద్ద రూ.30 లక్షలు వెచ్చించి 200 సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని నిర్ణయిచింది. వైద్య ఆరోగ్యశాఖ ముఖ్య కార్యదర్శి, డీఎంఈల కంప్యూటర్లకు ఈ కెమెరాలను అనుసంధానించనున్నారు. దీంతో ఉన్నతాధికారులు కార్యాలయాల నుంచేఆస్పత్రిలోని వైద్యుల పనితీరును పర్యవేక్షించే అవకాశం ఉంది.

 నిత్యం కిటకిట
 సుమారు 1050 పడకల సామర్థ్యం ఉన్న గాంధీ ఆస్పత్రి అవుట్ పేషెంట్ విభాగానికి నిత్యం 2500-3000 మంది రోగులు వస్తుంటారు. ఇన్‌పేషెంట్ విభాగంలో నిత్యం 1500 మంది చికిత్స పొందుతుంటారు. చిన్నాపెద్ద అన్ని కలిపి రోజుకు సగటున 80-100 శస్త్రచికిత్సలు జరుగుతుంటాయి. ఆస్పత్రిలో మొత్తం 3000 మందికిపైగా పని చేస్తున్నారు.

వీరిలో 350 మంది వైద్యులు ఉన్నారు. పారిశుద్ధ్య విభాగంలో ఔట్‌సోర్సింగ్, కాంట్రాక్ట్ ప్రతిపాదికన 400 మందికిపైగా పని చేస్తున్నారు. వీరి కోసం ఇప్పటికే బయోమెట్రిక్ విధానం అమలు చేస్తున్నారు. మిగిలిన వారంతా పాత పద్ధతిలోనే రిజిస్టర్‌లో సంతకం చేస్తున్నారు. బోధనాస్పత్రుల్లో ఉదయం 9 నుంచి సాయంత్రం 4 గంటల వరకు వైద్యులు ఉండాలనే నిబంధన ఉన్నప్పటికీ ఎవరూ పట్టించుకోవడం లేదు.

 అక్రమాలకు చెక్
 కొంతమంది సీనియర్ వైద్యులు ఆస్పత్రికి వచ్చి రిజిస్టర్‌లో సంతకం చేసి తిరిగి ఇంటికి వెళ్తుండగా.. మరికొంత మంది అసలు ఆస్పత్రికి రాకుండానే సంతకం చేస్తున్నారు. ఇక్కడ పని చేస్తున్న దంపతుల్లో ఒకరు గైర్హాజరైతే వారికి బదులు మరొకరు రిజిస్టర్‌లో సంతకం చేస్తున్నారు. చాలా మంది వైద్యులు తమ గదులకే పరిమితమవుతున్నారు. రోగులు చికిత్స పొందుతున్న వార్డులకు వెళ్లడం లేదు.

 దీంతో సకాలంలో చికిత్సలు అందక బాధితులు మృత్యువాత పడుతున్నారు. రోగులు వెంట తెచ్చుకున్న సెల్‌ఫోన్‌లు, బంగారు వస్తువులు, పర్సులు చోరీకి గురవుతున్నాయి. రాత్రిపూట కొంతమంది ఉద్యోగులు రోగి బంధువులు పట్ల దురుసుగా వ్యవహరిస్తున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. ఆస్పత్రిలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి ఇలాంటి సంఘటనలకు చెక్ పెట్టవచ్చని భావిస్తున్నారు.

Advertisement
Advertisement