సివిల్స్ కోచింగ్.. కేరాఫ్ అశోక్‌నగర్ | Sakshi
Sakshi News home page

సివిల్స్ కోచింగ్.. కేరాఫ్ అశోక్‌నగర్

Published Tue, Jul 1 2014 12:30 AM

సివిల్స్ కోచింగ్.. కేరాఫ్ అశోక్‌నగర్ - Sakshi

సివిల్ సర్వీసెస్ ఎగ్జామినేషన్... ఐఏఎస్, ఐపీఎస్, ఐఎఫ్‌ఎస్‌తోపాటు.. 20కి పైగా కేంద్ర సర్వీసుల్లో చేరేందుకు మార్గం. సమున్నత హోదాతోపాటు సమాజానికి సేవ చేసే అవకాశం. అలాంటి కలల కెరీర్‌ను సొంతం చేసుకోవాలంటే.. ప్రిలిమ్స్, మెయిన్స్, ఇంటర్వ్యూ దశలతో వైకుంఠపాళిని పోలిన పరీక్షల్లో సత్తా చాటాల్సిందే. వందల్లో ఖాళీలకు దేశవ్యాప్తంగా లక్షల మంది పోటీ..!  దాంతో నాణ్యమైన శిక్షణకూ ప్రాధాన్యత పెరిగింది.అందుకే ప్రతిఏటా సివిల్స్ కోచింగ్ కోసం హైదరాబాద్‌కు పయనమయ్యే విద్యార్థుల సంఖ్య వేలల్లోనే.   సివిల్స్  కోచింగ్  సెంటర్లకు సిటీలోని అశోక్‌నగర్ వేదికగా మారింది. ముఖ్యంగా కొత్త బ్యాచ్ కోచింగ్ ప్రారంభమయ్యే జూన్-జులై నెలల్లో విద్యార్థులతో ఈ  ప్రాంతంలో ఒకటే సందడి. ఒక్క మాటలో చెప్పాలంటే.. సివిల్స్ ఆశావహులకు అడ్డా.. అశోక్‌నగర్!!
 
 అశోక్‌నగర్.. అన్ని రకాల పోటీపరీక్షల అభ్యర్థులతో కిక్కిరిసిన ప్రాంతం. కెరీర్ గమనంలో ‘క్రాస్‌రోడ్స్’లో నిలిచిన అభ్యర్థికి దారిచూపే నేస్తం. అక్కడ సివిల్స్ లక్ష్యంగా వేల మంది విద్యార్థులు పుస్తకాలతో అక్షరయజ్ఞం చేస్తుంటారు. ఇప్పుడే చదువు పూర్తి చేసుకుని సివిల్స్ లక్ష్యంగా శిక్షణ కోసం వచ్చినవారు కొందరైతే.. ఇప్పటికే  కోచింగ్ ముగించుకొని సొంతంగా ప్రిపేర్ అవుతున్నవారు మరికొందరు.  ప్రిలిమ్స్, మెయిన్స్, ఇంటర్వ్యూల్లో ఏదో దశలో వెనుదిరిగిన అభ్యర్థులు మరింత కసిగా చదువుతుంటారు. సుదీర్ఘకాలం సాగే సివిల్స్ ప్రయాణంలో నిరాశా నిస్పృహలు ఆవహించకుండా  జాగ్రత్త పడుతుంటారు. గత తప్పిదాలను సరిచేసుకుంటూ ప్రిపరేషన్‌కు పదును పెడుతుంటారు. ‘బీటెక్ పూర్తయ్యాక సివిల్స్ కోచింగ్ తీసుకోవాలని నిర్ణయించుకున్నాను. అశోక్‌నగర్‌లోని ఓ కోచింగ్ సెంటర్‌లో చేరాను. దగ్గర్లోనే హాస్టల్ చూసుకున్నాను. ఎందుకంటే.. మన ఆలోచనలపై చుట్టూ ఉన్న వారి ప్రభావం ఉంటుంది. ఇక్కడే ఉంటే నేర్చుకోవడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది. సివిల్స్ 2012, 2013 రెండుసార్లు ప్రిలిమ్స్ గట్టెక్కాను. కానీ మెయిన్స్‌లో అర్హత సాధించలేకపోయా. జనరల్ స్టడీస్‌పై ఇంకొంచెం దృష్టిపెట్టి, తెలుగులో స్కోరు చేస్తే తప్పకుండా విజయం వరించేది’ అని తన అనుభవాలను పంచుకున్నాడు చిత్తూరు జిల్లాకు చెందిన కె.వి.మహేశ్. ఈసారి గతంలో చేసిన తప్పులు పునరావృతం కాకుండా జాగ్రత్త పడుతున్నానని చెప్పాడు. అధ్యాపకులు, సివిల్ సర్వీసెస్‌లో ఎంపికైన వారి సలహాలు తీసుకుని ఆత్మవిశ్వాసంతో ప్రిపరేషన్ సాగిస్తున్నట్లు వివరించాడు.
 
శిక్షణ- తరగతులు:

అశోక్ నగర్‌లో పేరొందిన కోచింగ్ సెంటర్లు చాలా ఉన్నాయి. ప్రిలిమ్స్, మెయిన్స్, ఆప్షనల్ సబ్జెక్టుల్లో శిక్షణ ఇస్తారు. ఒక్కో సబ్జెక్టుగా లేదా అన్ని సబ్జెక్టులు కలిపి కోచింగ్ తీసుకునే అవకాశం ఉంటుంది. 8నెలల నుంచి ఏడాది కాలపరిమితితో కోచింగ్ ఇస్తారు. సాధారణంగా జూన్-జూలై నెలల్లో కోచింగ్ తరగతులు ప్రారంభమవుతాయి. అధ్యాపకులు కూడా శిక్షణ కేంద్రాలతో సంబంధం లేకుండా సబ్జెక్టుల వారీగా విడిగా క్లాస్‌లు నిర్వహిస్తున్నారు. ‘సివిల్ సర్వీసెస్ పరీక్షపై యువతలో రోజురోజుకూ ఆదరణ పెరుగుతోంది. గత మూడేళ్లలో ఈ పరీక్షకు హాజరయ్యే అభ్యర్థుల సంఖ్య గణనీయంగా పెరిగింది.  గ్రాడ్యుయేషన్ పూర్తి కాగానే సివిల్స్ పరీక్షలపై దృష్టిపెడుతున్నారు. ఈ ఏడాది అటెంప్ట్స్ సంఖ్య పెరగడం, వయోపరిమితి సడలించడం ద్వారా.. సివిల్స్ కోచింగ్‌కు విపరీతమైన డిమాండ్ ఏర్పడింది.  విద్యార్థుల్లో నైపుణ్యాలు పెంచేందుకు శిక్షణ సంస్థలు కొత్త ట్రెండ్స్‌ను పరిచయం చేస్తున్నాయి. ఢిల్లీ ఫ్యాకల్టీతోనూ ఇక్కడ తరగతులు నిర్వహిస్తున్నాయి.’ అని వివరించారు అనలాగ్ ఐఏఎస్ ఇన్‌స్టిట్యూట్ డెరైక్టర్ విన్నకోట శ్రీకాంత్.
 
ముఖ్యమైన కోచింగ్ కేంద్రాలు:

ఆర్‌సీరెడ్డి స్టడీ సర్కిల్, బ్రెయిన్‌ట్రీ, శ్రీచైతన్య నారాయణ ఐఏఎస్ అకాడెమీ, అనలాగ్ ఐఏఎస్ ఇన్‌స్టిట్యూట్, ట్వంటీఫస్ట్ సెంచరీ ఐఏఎస్ అకాడెమీ, హైదరాబాద్ స్టడీ సర్కిల్, లా ఎక్సలెన్స్, క్లాస్1 స్టడీ సర్కిల్, వెంకటేశ్వర్‌రెడ్డి స్టడీ సర్కిల్.
 
ఫీజులు- ఖర్చులు:


శిక్షణ కేంద్రాలను బట్టి ఫీజులు మారుతుంటాయి. సివిల్ సర్వీసెస్ పరీక్షలోని ప్రిలిమ్స్, మెయిన్స్‌లో జనరల్ స్టడీస్ కోచింగ్‌కు సుమారుగా రూ.70,000 చెల్లించాల్సి ఉంటుంది. ఆప్షనల్ సబ్జెక్టుకు రూ. 20వేలుపైనే ఉంటుంది. సివిల్స్ సర్వీసెస్ ఆప్టిట్యూడ్ టెస్ట్‌కు దాదాపు రూ.15వేలు వసూలు చేస్తారు. హైదరాబాద్‌లోని ప్రధాన ప్రాంతాలతో పోల్చితే అశోక్‌నగర్‌లో జీవన వ్యయం కొంచెం తక్కువగానే ఉంటుంది. ఏసీ, నాన్‌ఏసీ హాస్టల్స్, నివాస గదులు అందుబాటులో ఉన్నాయి. నాన్‌ఏసీ గదులకు సుమారు 4 నుంచి 5 వేల రూపాయలు వెచ్చించాల్సి ఉంటుంది. గత విద్యార్థుల ఫీడ్‌బ్యాక్ ఆధారంగా హాస్టల్ ఎంపికలో కోచింగ్ సెంటర్లు కూడా సలహాలను అందిస్తాయి.
 
సదుపాయాలు:

అశోక్ నగర్‌లో సివిల్స్‌తో పాటు ఇతర పోటీ పరీక్షలకు ప్రిపేరయ్యే అభ్యర్థుల సంఖ్య వేలల్లో ఉంటుంది. పోటీ పరీక్షలకు సిద్ధమయ్యే అభ్యర్థుల కోసం ఇక్కడ బుక్ షాప్‌లూ, జిరాక్స్ సెంటర్‌లూ, టిఫిన్ సెంటర్లు, టీ స్టాల్స్, కర్రీపాయింట్లు వెలిశాయి. ప్రముఖ అధ్యాపకులు, కోచింగ్ సంస్థల మెటీరియల్ జిరాక్స్ కేంద్రాల్లో అందుబాటులో ఉంటుంది. సివిల్స్‌తోపాటు గ్రూప్-1, గ్రూప్-2 తదితర అన్నిరకాల పోటీ పరీక్షల పుస్తకాలు ఇక్కడ లభిస్తాయి. విద్యార్థులకు స్టడీ హాల్స్ సౌకర్యాన్ని అందిస్తున్న శిక్షణ సంస్థల సంఖ్య చాలా తక్కువ. దాంతో హాస్టల్స్ లేదా గదుల్లో చదువుకోవడానికి వీలుపడని వారు స్టడీ రూమ్స్‌ను ఆశ్రయిస్తారు.   
 
సమయపాలన:

 సివిల్ సర్వీసెస్ పరీక్షలకు ప్రిపేరయ్యే అభ్యర్థులు నిర్దిష్ట టైం టేబుల్ రూపొందించుకుంటారు. ఉదయం బ్రేక్‌ఫాస్ట్ నుంచి సాయంత్రం డిన్నర్ వరకూ.. ప్రతి పనిని పక్కా ప్రణాళికతో పూర్తి చేస్తారు. సబ్జెక్టుల విషయంలోనూ అంతే కచ్చితంగా వ్యవహరిస్తారు. ‘ఒక్కో సబ్జెక్టుకు నిర్దిష్ట సమయాన్ని కేటాయించి చదువుతున్నాను. ప్రతి సబ్జెక్టుకు ప్రాధాన్యమిస్తూ ప్రిపేరవుతున్నాను’ అని మహేశ్ తెలిపాడు. అప్పుడే సివిల్ సర్వీసెస్ పరీక్షల్లో తక్కువ ప్రయత్నాల్లోనే విజయం సాధించడానికి అవకాశం ఉంటుంది.
 
లైఫ్ స్టైల్:

 సివిల్స్ అభ్యర్థులకు ఉదయాన్నే క్రమం తప్పకుండా పత్రికా పఠనం అలవడుతుంది. సమకాలీన అంశాలపై ఎప్పటికప్పుడు అప్‌డేట్‌గా ఉంటూ కొత్త విషయాలను పాతవాటికి అన్వయించి చదవడం ద్వారా విస్తృత విషయ పరిజ్ఞానాన్ని సొంతం చేసుకోవచ్చని వారి అభిప్రాయం. ‘ప్రతిరోజూ గంటన్నర నుంచి 2 గంటల్లో హిందూ తదితర ప్రధాన పత్రికలను మొదటి పేజీ నుంచి చివరి పేజీ వరకూ డేగ కళ్లతో పరిశీలిస్తూ, వేగంగా చదువుతాం. పత్రికలను కేవలం పరీక్ష కోణంలోనే చదువుతాం’ అని అంటున్నాడు గుంటూరుకు చెందిన సివిల్స్ అభ్యర్థి సనకా సుభాష్. ‘ఇక్కడికి వచ్చే వారిలో ఎలాంటి ఆడంబరాలు కనిపించవు. పుస్తకాలే ప్రపంచంగా జీవిస్తారు. స్టడీరూంలు, దగ్గర్లోని సెంట్రల్ లైబ్రరీలకు వెళ్లి చదువుకుంటాం. సాయంత్రం సమయాల్లో దగ్గర్లోని పార్కులకు వెళ్లి వాకింగ్ చేస్తుంటాం. ఆ సమయంలోనూ పుస్తకాలు చేతిలో ఉండాల్సిందే’ అని చెప్పాడు నెల్లూరు జిల్లా కావలికి చెందిన రాఘవేంద్ర.
 
బెస్ట్ ఇన్‌స్టిట్యూట్స్, ఫ్యాకల్టీ ఉన్నారు

 
విధాన రూపకల్పనలో భాగస్వామి కావడం ద్వారానే వ్యవస్థలోని లోపాలను సరిదిద్దగలుగుతామనే ఉద్దేశంతో సివిల్స్ ఎంచుకున్నాను. రాష్ట్రంలో అన్ని ప్రాంతాల వారు కోచింగ్ తీసుకోవడానికి అశోక్‌నగర్‌కు వస్తుంటారు. ఇక్కడ బెస్ట్ ఇన్‌స్టిట్యూట్స్, ఫ్యాకల్టీ, మెటీరియల్ అందుబాటులో ఉన్నాయి.  ఇక్కడి ఫ్యాకల్టీ ఢిల్లీకి వెళ్లి కూడా తరగతులు చెప్తారు. కాబట్టి ఢిల్లీ కంటే ఇక్కడే మెరుగైన కోచింగ్ లభిస్తుందని భావిస్తున్నా.     - సత్య శిరీష, సివిల్స్ అభ్యర్థిని
 
కాంపిటీటివ్ వాతావరణం ఉంటుంది

అశోక్‌నగర్‌లో కాంపిటీటివ్ వాతావరణం బాగుంది. ఇక్కడ శిక్షణ పొందే వారిలో నేర్చుకోవాలనే తపన పెరుగుతుంది. అశోక్‌నగర్‌లోనే ప్రిలిమ్స్, మెయిన్స్ కోచింగ్ తీసుకున్నాను. సివిల్స్ అభ్యర్థుల్లో సంకల్పం పెరగాలి. సీరియస్‌నెస్, అంకితభావంతో చదవాలి. సివిల్స్ లేకపోతే గ్రూప్స్ అనే ధోరణి నుంచి బయటపడాలి. తప్పకుండా విజయం సాధిస్తారు.        
     - ఎండీ ముషారఫ్ అలీ ఫరూకి  ఆలిండియా 80వ ర్యాంకు, సివిల్స్ - 2013
 
 

Advertisement

తప్పక చదవండి

Advertisement