అంకెల ఆట.. మాటల గారడీ | Sakshi
Sakshi News home page

అంకెల ఆట.. మాటల గారడీ

Published Thu, Mar 17 2016 2:42 AM

అంకెల ఆట.. మాటల గారడీ

- వాస్తవ దూరంగా బడ్జెట్: జానారెడ్డి ఫైర్

సాక్షి, హైదరాబాద్: వాస్తవాలకు దూరంగా, ఆశల పల్లకిలో ఊరేగించినట్లుగా రాష్ట్ర బడ్జెట్ ఉందని ప్రతిపక్ష నేత కె.జానారెడ్డి విమర్శిం చారు. అంకెలతో ఆటలాడి, మాటలతో గారడీ చేస్తూ ప్రజలను భ్రమింపజేసేందుకు ఆర్థిక మంత్రి ఈటల రాజేందర్ కష్టపడ్డారన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్‌పై బుధవారం అసెంబ్లీలో జానారెడ్డి తన శైలికి భిన్నం గా చలోక్తులు విసురుతూ ప్రసగించారు. తెలంగాణ సిద్ధిస్తే నూతన సంస్కృతి, సంప్రదాయాలు, కొత్త ఒరవడితో సాగుతూ రాష్ట్రం అగ్రగామిగా నిలుస్తుందని ఆశించినా.. అందుకు భిన్నంగా పాలన సాగుతోందన్నారు. రాష్ట్రాభివృద్ధి, సంక్షేమానికి కాంగ్రెస్ పాలనే కారణమన్న సంగతిని విస్మరించవద్దన్నారు.

గోదావరి నుంచి 12 నియోజకవర్గాలకు నీరిస్తున్న ప్రధాన పైపులైన్ తీసుకొచ్చింది తామేనన్నారు. ‘‘మేం తీసుకొచ్చిన పారిశ్రామిక విధానమే గొప్పనుకున్నాం. ఇప్పుడు మీరు మార్చారు కాబట్టి మేం చేసింది తప్పు అనడం సరికాదు. రేపు మీరు పోతే మీరు తెచ్చిన పాలసీ కూడా వేస్టేనా..?’’ అని ప్రశ్నించారు. సమైక్య పాలన లో తెలంగాణ ప్రాంత అభివృద్ధి, అవసరాలపై పోరాడామని చెప్పారు.

గుజరాత్ కన్నా మిన్నగా...
కాంగ్రెస్ అధికారంలో ఉన్న 2004-2014 వరకు జీఎస్‌డీపీ .. గుజరాత్ కన్నా తెలంగాణలోనే ఎక్కువ ఉందని జానా తెలిపారు. గుజరాత్‌లో జీఎస్‌డీపీ 9.76శాతం ఉంటే.. తెలంగాణలో 10.16శాతం ఉందన్నారు. తలసరి ఆదా యం కూడా కాంగ్రెస్ హయాంలోనే పెరిగింద న్నారు. 2004కు ముందు పేదరికం 24.6 శాతం ఉంటే 2014 నాటికి 20 శాతానికి తగ్గిం దన్నారు. 50:100గా ఉన్న అప్పులు, ఆస్తుల నిష్పత్తి కూడా కాంగ్రెస్ హయాంలోనే 100:101కి చేరిందన్నారు. ఆహార ధాన్యాల ఉత్పత్తి 1956-57లో 14.54లక్షల టన్నులు ఉంటే విడిపోయే నాటికి తెలంగాణలో 106 లక్షల టన్నులకు చేరిందన్నారు. పారిశ్రామిక, వ్యవసాయ, సేవ తదితర రంగాల్లో కాంగ్రెస్ ప్రభుత్వాలు చేసిన కృషి వల్లే ఇదంతా సాధ్యమైందని తెలిపారు. దేశంలో స్వాతంత్రం వచ్చేనాటికి 2,500మెగావాట్ల విద్యుదుత్పత్తి ఉంటే 2014 నాటికి 3,85,000 మెగావాట్లకు పెంచిన ఘనత కాంగ్రెస్‌ది కాదా అని ప్రశ్నించారు. కాంగ్రెస్ హయాంలోనే హైదరాబాద్‌కు కేంద్ర ప్రభుత్వ సంస్థలన్నీ వచ్చాయని, తద్వారా అభివృద్ధి జరిగిందని చెప్పారు.

పేరుకే 51 శాతం ప్రణాళికా వ్యయం..
బడ్జెట్‌లో రూ. 1.30 లక్షల కోట్ల అంకెలు చూపి ప్రజలను మరోసారి మోసం చేశారని జానారెడ్డి విమర్శించారు. గత 2015-16 బడ్జెట్‌లో రూ.1.15 లక్షల కోట్ల బడ్జెట్ ప్రవేశపెట్టి సవరించిన బడ్జెట్‌లో రూ.15 వేల కోట్లను తొలగించిన ప్రభుత్వం 2016-17 బడ్జెట్‌లో 30 శాతం ఎందుకు పెంచిందని ప్రశ్నించారు. 51 శాతం ప్రణాళిక వ్యయం పెట్టినట్లు చెబుతున్నా.. అందులో 31 శాతమే ఖర్చవుతుందన్నారు. ‘‘సమైక్య పాలనలో ప్రణాళిక వ్యయంలో రూ.10 వేల కోట్లు కూడా ఖర్చు చేయలేదని తీసేసినట్లు మాట్లాడారు. దీనిపై ఎవరు లెక్కలు తీశారు? రూ.1.30 లక్షల కోట్ల బడ్జెట్‌లో రూ.97 వేల కోట్ల నుంచి లక్ష కోట్ల రూపాయల కన్నా ఎక్కువగా రాబడి, ఖర్చులు చూపిస్తే నేను మళ్లీ ఇక్కడికి(అసెంబ్లీకి) రాను’’ అంటూ సవాల్ విసిరారు. ప్రణాళిక బడ్జెట్‌లో రూ.34 వేల కోట్ల నుంచి రూ.37 కోట్లు మాత్రమే ఖర్చవుతుందని పేర్కొన్నారు. ఇందులో రూ. 25 వేల కోట్లు నీటిపారుదల రంగానికి వెళితే మిగతా రూ.10 వేల కోట్లు దేనికి వెచ్చిస్తారని ప్రశ్నించారు. రాబడి లేని వాటికి కేటాయింపులు చేసిన ఆర్థిక మంత్రి... కేటాయింపులు చేసిన వాటికి మంజూరు ఇవ్వడం లేదన్నారు.
 
ఈ ఖర్చుల్ని బడ్జెట్‌లో ఎందుకు చూపలేదు?
2015-16 బడ్జెట్‌లో ఇప్పటి వరకు 60 శాతమే ఖర్చు చేశారని, మైనారిటీ సంక్షేమానికి రూ. 1,100 కోట్లు కేటాయించి రూ.300 కోట్లే ఖర్చు పెట్టారని జానారెడ్డి పేర్కొన్నారు. మార్చి 31లోగా ఖర్చు చేయాల్సినవి చాలా ఉన్నాయని, ఫిట్‌మెంట్ బకాయిలు రూ. 6 వేల కోట్లు, ఫీజు రీయింబర్స్‌మెంట్‌కు రూ.3,500 కోట్లు చెల్లించాల్సి ఉందన్నారు. రైతుల అవసరాలకు త గ్గట్టు కరెంటు కొనుగోలు చేయాల్సి ఉంటుందని, అందుకు మరో రూ.4 వేల కోట్ల వరకు వెచ్చించాలన్నారు. అయితే ఇవేవీ బడ్జెట్‌లో చూపించలేదన్నారు. కాగా ప్రతిపక్ష నేత ప్రసంగం సాగుతుండగానే.. రాష్ట్రపతి కార్యక్రమంలో పాల్గొనేందుకు వెళ్లాల్సి ఉందని, జానారెడ్డికి గురువారం సమయం ఇవ్వాలని సీఎం స్పీకర్‌కు సూచించారు. దీంతో జానారెడ్డి తన ప్రసంగాన్ని ముగించారు.

 

Advertisement

తప్పక చదవండి

Advertisement