ఆ మూడు భవన్‌ల నిర్మాణానికి తొలగిన అడ్డంకులు | Sakshi
Sakshi News home page

ఆ మూడు భవన్‌ల నిర్మాణానికి తొలగిన అడ్డంకులు

Published Thu, Feb 9 2017 4:05 AM

ఆ మూడు భవన్‌ల నిర్మాణానికి తొలగిన అడ్డంకులు - Sakshi

  • ‘స్టేటస్‌ కో’ ను ఎత్తేసిన హైకోర్టు
  •  వెంటనే నిర్మాణాలు చేపట్టాలని అధికారులకు సీఎం ఆదేశం
  • సాక్షి, హైదరాబాద్‌: హైదరాబాద్‌లోని బంజారాహిల్స్, రోడ్‌ నంబర్‌ 10లో ప్రభుత్వం నిర్మించతలపెట్టిన ఆదివాసీ భవన్, బంజారా భవన్, బాబూ జగ్జీవన్‌ రామ్‌ భవన్‌ల నిర్మాణానికి అడ్డంకులు తొలగిపోయాయి. ఈ మూడు భవనాలు నిర్మించతలపెట్టిన భూమికి సంబంధించిన యాజమాన్య హక్కులపై వివాదం ఏర్పడిన నేపథ్యంలో గతంలో ఇచ్చిన యథాతథస్థితి (స్టేటస్‌ కో) ఉత్తర్వులను ఉమ్మడి హైకోర్టు బుధవారం తొలగించింది. ఆ భూముల్లో చేపట్టే నిర్మాణాలు, ఇతర కేటాయింపులు ఏవైనా కూడా ఈ వ్యాజ్యంలో తాము వెలువరించే తుది తీర్పునకు లోబడి ఉంటాయని హైకోర్టు స్పష్టం చేసింది.

    ఈ మేరకు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి (ఏసీజే) జస్టిస్‌ రమేశ్‌ రంగనాథన్, న్యాయమూర్తి జస్టిస్‌ షమీమ్‌ అక్తర్‌లతో కూడిన ధర్మాసనం మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. రోడ్‌ నంబర్‌ 10, ప్లాట్‌ నంబర్‌ 24లోని భూమిలో  ఆదివాసీ భవన్, బంజారా భవన్, బాబు జగ్జీవన్‌ రామ్‌ భవన్‌ల నిర్మాణం నిమిత్తం రాష్ట్ర ప్రభుత్వం 2014 డిసెంబర్‌ 5న  19, 20, 21 జీవోలు జారీ చేసింది. ఈ భూమి కాందిశీకులకు కేటాయించారని, దానిపై తమకు యాజమాన్య హక్కులు ఉన్నాయంటూ రమేశ్‌ పరశురాం మలానీ అనే వ్యక్తి హైకోర్టును ఆశ్రయించారు. దీంతో అప్పటి ఏసీజే నేతృత్వంలోని ధర్మాసనం ఈ భూమి విషయంలో యథాతథస్థితిని కొనసాగించాలంటూ 2014, డిసెంబర్‌ 31న మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. ఈ స్టేటస్‌ కో ఉత్తర్వులను ఎత్తివేయాలని కోరుతూ ప్రభుత్వం అనుబంధ పిటిషన్‌ దాఖలు చేసింది.  

    ‘భవన్‌’ల నిర్మాణం చేపట్టాలని సీఎం ఆదేశాలు
    ఎస్సీలు, బంజారాలు, ఆదివాసీల కోసం హైదరాబాద్‌ బంజారాహిల్స్‌లో తలపెట్టిన భవన్‌ల నిర్మాణాలను త్వరితగతిన పూర్తి చేయాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు అధికారులను ఆదేశించారు. బాబూ జగ్జీవన్‌రామ్‌ భవన్, కుమ్రం భీమ్‌ (ఆదివాసీ) భవన్, బంజారా భవన్‌లకు ఒక్కో దానికి ఎకరం చొప్పున  ప్రభుత్వం కేటాయించింది. అయితే నిర్మాణాలు ప్రారంభించేలోపు కొందరు కోర్టులో పిటిషన్‌ వేశారు. ఈ కేసును విచారించిన హైకోర్టు బుధవారం నిర్మాణాలకు అనుమతినిచ్చింది.  

Advertisement
Advertisement