సింగపూర్ సంస్థలతో చర్చలకు యనమల అధ్యక్షతన కమిటీ | Sakshi
Sakshi News home page

సింగపూర్ సంస్థలతో చర్చలకు యనమల అధ్యక్షతన కమిటీ

Published Sat, May 7 2016 1:22 AM

సింగపూర్ సంస్థలతో చర్చలకు యనమల అధ్యక్షతన కమిటీ - Sakshi

మాస్టర్ డెవలపర్ ఎంపికకు జిమ్మిక్కులు
 
 సాక్షి, హైదరాబాద్: రాజధాని అమరావతి మాస్టర్ డెవలపర్ ఎంపికలో ప్రభుత్వ కుట్రలు ఒకటొకటిగా బహిర్గతమవుతున్నాయి. మాస్టర్ డెవలపర్ ఎంపికకు ఇప్పటికే స్విస్ ఛాలెంజ్ విధానంలో సింగపూర్ ప్రైవేటు సంస్థల కన్సార్టియం ప్రతిపాదనలు పంపింది. వాటిని ఛాలెంజ్ చేస్తూ(కౌంటర్) ప్రతిపాదనలు ఆహ్వానించడానికి టెండర్ నోటిఫికేషన్ జారీ చేయాల్సిన సర్కారు సరికొత్త సాంప్రదాయానికి తెర తీసింది. కౌంటర్ ప్రతిపాదనలను ఆహ్వానించేలోగా సింగపూర్ ప్రైవేటు సంస్థల కన్సార్టియంతో బేరసారాలు, సంప్రదింపులు జరిపేందుకు ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు నేతృత్వంలో ఉన్నత స్థాయి కమిటీని నియమిస్తూ శుక్రవారం ఉత్తర్వులు జారీ చేయడం గమనార్హం.

సీఆర్‌డీఏ (రాజధాని ప్రాంత అభివృద్ధి సంస్థ) కమిషనర్ ఎన్.శ్రీకాంత్ సభ్య కార్యదర్శిగా వ్యవహరించే ఈ కమిటీలో.. పురపాలక శాఖ మంత్రి పి.నారాయణ, ఆ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ అజయ్ జైన్, ఆర్థిక శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ పీవీ రమేశ్, ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షులు కుటుంబరావు, సీసీడీఎంసీ  చైర్మన్, ఎండీ డి.లక్ష్మీ పార్థసారథి, పురపాలక శాఖకు చెందిన ప్రకాష్ గౌర్, చార్టెట్ అకౌంటెంట్లు బీఎస్ చక్రవర్తి, శరత్‌కుమార్‌లను సభ్యులుగా నియమించారు. సింగపూర్ కన్సార్టియంతో సంప్రదింపులు జరిపి.. వాటి ప్రతిపాదనలు రాష్ట్ర అవసరాలను తీర్చేలా ఉన్నాయా లేదా..  ఇబ్బందులు  ఉన్నాయా? అన్నది పరిశీలించి 15 రోజుల్లోగా నివేదిక ఇవ్వాలని ప్రభుత్వం ఆ కమిటీని ఆదేశించింది. తద్వారా  కన్సార్టియం ప్రతిపాదనలను ఛాలెంజ్ చేస్తూ ఇతర సంస్థలు షెడ్యూలు దాఖలు చేసినా.. ఆ కన్సార్టియంనే మాస్టర్ డెవలపర్‌గా ఎంపిక చేసేందుకు ఎత్తులు వేస్తోంది.

Advertisement
Advertisement