భూమి లేకున్నా పరిహారం | Sakshi
Sakshi News home page

భూమి లేకున్నా పరిహారం

Published Thu, Feb 16 2017 1:52 AM

భూమి లేకున్నా పరిహారం - Sakshi

వ్యవసాయ కూలీలు, కౌలుదారులు, వృత్తుల వారికీ పునరావాస ప్యాకేజీ
కూలీ కుటుంబాలకు 20 ఏళ్లపాటు నెలకు రూ.2 వేలు
ఎస్సీ, ఎస్టీలకు నెలవారీ డబ్బులకు అదనంగా రూ.50 వేలు
123 జీవోకు అనుబంధంగా జీవో 38 జారీ చేసిన ప్రభుత్వం


సాక్షి, హైదరాబాద్‌: భూయజమానులు కాకుండా భూసేకరణతో ప్రభావితమై, జీవనోపాధిని కోల్పోయే కుటుంబాలకు రాష్ట్ర ప్రభుత్వం సహాయ పునరావాస ప్యాకేజీని ప్రకటించింది. రాష్ట్రంలో ప్రభుత్వం చేపట్టే ప్రాజెక్టులు, పరిశ్రమలకు భూసేకరణకు ప్రభుత్వం గతంలోనే 123 జీవో జారీ చేసింది. భూసేకరణతో ప్రభావితమయ్యే కుటుం బాలకు ప్రయోజనాలు కల్పిస్తూ గతేడాది ఆగస్టులో జీవో 190, జీవో 191 జారీ చేసింది. వీటిని సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్‌లపై హైకోర్టు గత నెలలో మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చింది. కేంద్ర భూసేకరణ చట్టం ప్రకారం.. పునరావాస, పునర్నిర్మాణ ప్రయోజనాలు కల్పించకుండా ఒప్పందం చేసుకోవడానికి వీల్లేదంది.

ఈ నేపథ్యంలో భూయజమానులు కాకుండా ప్రభావితులైన ఇతరులకు పునరావాస, పునర్నిర్మాణ చర్యలు చేపట్టేందుకు రెవెన్యూ శాఖ తరఫున ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఎస్‌కే జోషి జీవో 38 జారీ చేశారు. దీని ప్రకారం.. భూమి లేని కుటుంబాలు, ఆ కుటుంబంలోని సభ్యుడు, సభ్యులు, వ్యవసాయ కూలీలు, కౌలుదారు లు, అనుభవదారు, సహసాగుదారు లేదా ప్రభావిత ప్రాంతంపై ఆధారపడిన వృత్తి పనివారు, కళాకారులు, ఇతర పనివాళ్లు  ప్యాకేజీ పరిధిలోకి వస్తారు. ఆ కుటుంబాలు భూసేకరణకు ముందు కనీసం మూడేళ్లయినా ఈ ప్రాంతంలో పని చేస్తూ ఉండాలి.

అభ్యంతరాలకు తగిన గడువు
జీవో 123 కింద భూమిని సేకరించిన ప్రాంతాల్లో కలెక్టర్‌/జాయింట్‌ కలెక్టర్‌ సర్వే నిర్వహించి ప్రభావిత కుటుంబాలు గుర్తిస్తారు.ఆ జాబితాను సంబంధిత గ్రామ, నగర పంచాయతీలు, మున్సిపల్‌ కార్పొరేషన్‌ కార్యాలయాల్లో ప్రకటిస్తారు. అభ్యంతరాలుంటే 15 రోజుల్లోగా జేసీకి వినతి పత్రం ఇస్తే, అవసరమైతే విచారణ జరిపి  సవరణలు చేస్తారు. జేసీ ఉత్తర్వులతో ఇబ్బంది పడ్డవారుంటే 30 రోజుల్లో ఆర్‌అండ్‌ఆర్‌ కమిషనర్‌కు అప్పీలు చేసుకునే వీలుంటుంది. 30 రోజుల్లో ఈ అప్పీలును పరిష్కరిస్తారు. ప్రభావిత కుటుంబాలను ఖాళీ చేయించక ముందే ఈ ప్రక్రియను పూర్తి చేయాలి. ప్రాజెక్టు నిర్మాణంతో ముంపు ఏర్పడితే దీనికి ముందు 6 వారాల్లో పునరావాస ప్రక్రియ పూర్తి కావాలి.

ఇల్లు.. ఉపాధి..: భూమి లేని వారు.. గ్రామీణ ప్రాంతాల్లో ఇంటిని కోల్పోతే ఇందిరా ఆవాస్‌ యోజనలో ఇంటిని నిర్మించి ఇవ్వాలి. పట్టణ ప్రాంతంలో ఇంటిని కోల్పోతే 50 చదరపు మీటర్ల నివాస స్థలం ఉండే ఇల్లు కట్టివ్వాలి. నివాస స్థలం లేకున్నా మూడేళ్లు అదే ప్రాంతంలో ఉంటే వారికి సైతం ఇంటిని కేటాయిస్తారు. ఇంటి నిర్మాణానికి అంగీకరిం చకుంటే రూ.1.50 లక్షలకు తగ్గకుండా పరిహారం ఇవ్వాలి. ఒకవేళ ఆ భవనం పైఅంతస్తులతో ఉంటే ఆ విలువ కూడా కట్టి పరిహారం చెల్లించాలి. ప్రాజెక్టు నిర్మాణ ప్రాంతంలో నష్టపోయిన కుటుంబంలో ఒకరికి ఉపాధి కల్పించాలి. లేనిపక్షంలో రూ.5 లక్షలు చెల్లించాలి.

వ్యవసాయ కూలీలకు చెందిన కుటుంబాలకైతే 20 ఏళ్ల పాటు నెలకు రూ.2 వేల చొప్పున చెల్లించాలి. నిర్వాసితులైన కుటుంబాలకు నెలకు రూ.3 వేలు ఏడాది పాటు చెల్లించాలి. ఎస్సీ, ఎస్టీలయితే నెలవారీ  డబ్బులకు అదనంగా రూ.50 వేలు చెల్లించా లి. ఆ కుటుంబాలు వేరేచోటుకు వెళ్లేం దుకు రవాణా ఖర్చులకు రూ.50 వేలు చెల్లిం చాలి. పశువుల శాల నిర్మాణానికి రూ.25 వేలు ఇవ్వాలి. చిన్న దుకాణం కోల్పోతే రూ.25 వేలు ఇవ్వాలి. చేతివృత్తులు, చిరు వ్యాపారాలున్న వారికి కనీసం రూ.25 వేలకు తగ్గకుండా పరిహారం. అర్హులకు రిజర్వాయ ర్లలో చేపలు పట్టుకునే వెసులుబాటు కల్పించాలి. పునరావాస భృతి కింద ప్రతి కుటుంబానికి రూ.50 వేలు చెల్లించాలి. నిర్వాసితులకు భూమి, ఇంటి రిజిస్ట్రేషన్‌ రుసుముల్ని భూసేకరణ సంస్థ చెల్లించాలి.

అన్ని వసతులు...
పునరావాస కాలనీకి అనుసంధాన రోడ్లు ఉండాలి. ఇళ్ల నిర్మాణానికి ముందే కాలనీలో డ్రైనేజీలు,  ప్రతి ఇంటికి విద్యుత్తు, తాగునీరు, వ్యక్తిగత మరుగుదొడ్లు, పశువులకూ తాగునీటి ఏర్పాట్లు, వ్యవసాయానికీ నీటి వసతి కల్పించాలి. కాలనీలో రేషన్‌ షాపులు, పోస్టాఫీసులు, విత్తన ఎరువుల దుకాణాలుండాలి. సమీప పట్టణాలకు ప్రజా రవాణా సదుపాయం కల్పించాలి. శ్మశానవాటికలు నిర్మించాలి. ప్రాథమిక ఆరోగ్య కేంద్రం, పాఠశాలతోపాటు అంగన్‌వాడీ కేంద్రం ఏర్పాటు చేయాలి. క్రీడా మైదానం ఉండాలి. ప్రతి వంద కుటుంబాలకో కమ్యూనిటీ హాల్, ప్రతి 50 కుటుంబాలకో మీటింగ్‌ హాల్‌ ఏర్పాటు చేయాలి. సంప్రదాయ గిరిజన కేంద్రానికి స్థలం కేటాయించాలి. కాలనీకి తగిన భద్రత ఏర్పాట్లు ఉండాలి.

Advertisement

తప్పక చదవండి

Advertisement