ఆ ఇద్దరు ఎవరు? | Sakshi
Sakshi News home page

ఆ ఇద్దరు ఎవరు?

Published Fri, May 13 2016 2:03 AM

ఆ ఇద్దరు ఎవరు? - Sakshi

* రాజ్యసభ అవకాశంపై టీఆర్‌ఎస్‌లో మొదలైన అలజడి
* రాష్ట్రం నుంచి ఖాళీ అవుతున్న గుండు సుధారాణి, వీహెచ్‌ల స్థానాలు
* ఈ రెండు స్థానాలు గెలుచుకునే అవకాశం టీఆర్‌ఎస్‌కే!
* ప్రయత్నాల్లో గులాబీ సీనియర్లు

సాక్షి, హైదరాబాద్‌: రాజ్యసభకు ఎన్నికల నగారా మోగడంతో అధికార తెలంగాణ రాష్ట్ర సమితిలో అలజడి మొదలైంది. తెలంగాణ నుంచి రాజ్యసభకు ప్రాతినిధ్యం వహిస్తున్న వి. హనుమంతరావు (వీహెచ్‌), గుండు సుధారాణిల పదవీకాలం జూన్‌ 21తో ముగుస్తోంది. రాష్ట్రానికి వచ్చే ఈ రెండు రాజ్యసభ స్థానాలను అధికార పార్టీ హోదాలో తమకున్న ఎమ్మెల్యేల సంఖ్యాబలం ఆధారంగా టీఆర్‌ఎస్‌ తేలిగ్గా గెలుచుకునే అవకాశం ఉందనే అంచనాలున్నాయి. దీంతో ఆ రెండు స్థానాలు దక్కేదెవరికన్న చర్చ కూడా మొదలైంది. ఇప్పటికే గత రెండు మూడు నెలలుగా పలువురు నేతలు పార్టీ అధినేత, ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావును కలసి రాజ్యసభ కోసం విజ్ఞప్తులు చేసుకున్నారు. ఉన్న స్థానాలు రెండే అయినా పార్టీలోని పలువురు ప్రముఖులు పోటీ పడుతున్నారు. వివిధ రాజకీయ సమీకరణలు, భవిష్యత్‌ అవసరాలను పరిగణనలోకి తీసుకుని కేసీఆర్‌ ఇప్పటికే ఓ నిర్ణయానికి వచ్చారన్నది పార్టీ వర్గాల సమాచారం. తొలి నుంచీ పార్టీలో కొనసాగిన వారు, కష్టకాలంలో ఆదుకున్న వారు, పార్టీ కార్యకలాపాలకు వెన్నుదన్నుగా నిలిచిన వారు, అనివార్య పరిస్థితుల వల్ల అవకాశాలు దక్కని వారు.. ఇలా పలు కోణాల్లో ఆలోచించి ఎంపిక చేశారని తెలుస్తోంది. ఇక వారి పేర్లను ప్రకటించడమే మిగిలి ఉందని పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి.

తెరపైకి పలువురి పేర్లు!
పార్టీ వర్గాల్లో జరుగుతున్న ప్రచారం మేరకు రాజ్యసభ రేసులో టీఆర్‌ఎస్‌లో సుదీర్ఘకాలంగా పనిచేస్తున్న వారితోపాటు ఇతర పార్టీల నుంచి చేరిన నేతల పేర్లు కూడా వినిపిస్తున్నాయి. వరంగల్‌ ఉప ఎన్నిక సమయంలో టీడీపీ నుంచి టీఆర్‌ఎస్‌కు వలస వచ్చిన గుండు సుధారాణి తనకు తిరిగి అవకాశం ఇవ్వాలని సీఎం కేసీఆర్‌ను కోరినట్లు సమాచారం. అయితే ఆమె తరఫున అధినేతపై ఒత్తిడి తేగల నాయకులెవరూ లేరని అంటున్నారు. ఉమ్మడి ఏపీలో పీసీసీ చీఫ్‌గా పనిచేసి టీఆర్‌ఎస్‌లో చేరిన సీనియర్‌ నేత ధర్మపురి శ్రీనివాస్‌ (డీఎస్‌) పేరు కూడా తెరపైకి వచ్చింది. ఆయన ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక సలహాదారుగా ఉన్నారు.

పార్టీ మారే సమయంలోనే రాజ్యసభ సీటు ఇచ్చే హామీతో వచ్చారన్న ప్రచారం జరిగింది. ఇక హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డిని మంత్రివర్గం నుంచి తప్పించి ఆయనకు గౌరవం ఇచ్చేలా రాజ్యసభకు పంపిస్తారని ఇటీవల ప్రచారం జరిగింది. అధినేత ఎక్కడికి పంపితే అక్కడ పనిచేస్తానని నాయిని ఓ సందర్భంలో పేర్కొన్నారు కూడా. ఇక కేసీఆర్‌కు సన్నిహితులుగా పేరున్న కరీంనగర్‌కు చెందిన మాజీ మంత్రి కెప్టెన్‌ లక్ష్మీకాంతరావు, డి.దామోదర్‌రావుల పేర్లు కూడా బలంగా వినిపిస్తున్నాయి. దామోదర్‌రావుకు పక్కాగా రాజ్యసభ అవకాశం ఇస్తారన్న అభిప్రాయం వినిపిస్తోంది. వీరే కాకుండా ఢిల్లీలో రాష్ట్ర ప్రభుత్వ ప్రతినిధిగా ఉన్న రామచంద్రుడు కూడా ప్రయత్నాల్లో ఉన్నట్లు పార్టీ వర్గాలు తెలిపాయి.  మరోవైపు ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి పేరు కూడా ప్రచారంలో ఉండడం గమనార్హం.

Advertisement

తప్పక చదవండి

Advertisement