‘అంగన్‌వాడీ’ల తరలింపుపై అయోమయం | Sakshi
Sakshi News home page

‘అంగన్‌వాడీ’ల తరలింపుపై అయోమయం

Published Thu, May 18 2017 2:42 AM

‘అంగన్‌వాడీ’ల తరలింపుపై అయోమయం - Sakshi

- ప్రాథమిక పాఠశాలల ఆవరణలోకి అంగన్‌వాడీ కేంద్రాలు తరలించాలని నిర్ణయం
- అంగన్‌వాడీ కేంద్రాలున్నా ప్రాథమిక పాఠశాలలు లేని గ్రామాలు 991
- మరో 2,720 పాఠశాలల పరిధిలో అంగన్‌వాడీ కేంద్రాలు లేవు
- సాధ్యాసాధ్యాలపై అధికారుల మల్లాగుల్లాలు  


సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రంలోని ప్రాథమిక పాఠశాలల పరిధిలోకి అంగన్‌వాడీ కేంద్రాలను తరలించడంపై అధికారులు మల్లగుల్లాలు పడుతున్నారు. అనేక పాఠశాలల పరిధిలో అంగన్‌వాడీ కేంద్రాలున్నా... 5 వేల వరకు పాఠశాలల్లో సరిపడ తరగతి గదులు లేక వాటిల్లోకి అంగన్‌వాడీ కేంద్రాలను తరలించలేని పరిస్థితి నెలకొంది. మరోవైపు 991 గ్రామాల్లో ప్రాథమిక పాఠశాలలే లేని పరిస్థితులతో అంగన్‌వాడీ కేంద్రాలను తరలించడానికి వీల్లేని పరిస్థితి ఏర్పడింది. మరో 2,720 పాఠశాలల పరిధిలో అంగన్‌వాడీ కేంద్రాలే లేవు. అంగన్‌వాడీ కేంద్రాలు, ప్రాథమిక పాఠశాలలు ఉన్న ప్రాంతాల్లోని 1,797 పాఠశాలల పరిధిలోకి అంగన్‌వాడీ కేంద్రాలు ఇదివరకే వచ్చాయి. మరో 672 కేంద్రాలను తరలించారు. ఇక మిగిలిన స్కూళ్ల పరిధిలోకి జూన్‌ 12న స్కూళ్లు తెరిచేనాటికి వీలైనన్ని అంగన్‌ వాడీ కేంద్రాలను తరలించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అయితే ఎన్నింటిని పాఠశాలల పరిధిలోకి తరలిస్తారన్నది ప్రశ్నార్థకంగా మారింది.

6.54 లక్షల మంది విద్యార్థులు
ప్రస్తుతం రాష్ట్రంలో 35,750 అంగన్‌వాడీ కేంద్రాలు ఉన్నాయి. వాటిల్లో మెయిన్‌ అంగన్‌వాడీ కేంద్రాలు 31,711 ఉండగా, మినీ కేంద్రాలు 3,989 ఉన్నాయి. వాటిన్నింటిలో మూడు నుంచి 6 ఏళ్లలోపు పిల్లలు 6.54 లక్షల మంది ఉన్నాయి. అలాగే రాష్ట్రవ్యాప్తంగా 18,162 ప్రాథమిక పాఠశాలలు ఉండగా, వాటిల్లో ఒకటి నుంచి ఐదో తరగతి వరకు చదివే పిల్లలు 9,742,464 మంది విద్యార్థులు ఉన్నారు. ఆయా పాఠశాలల్లోకి తరలించేందుకు వీలుగా 5 కంటే ఎక్కువ గదులు ఉన్న పాఠశాలలను గుర్తించే పనిలో విద్యాశాఖ పడింది. కొన్నింటిలో ఐదు తరగతి గదులు లేకపోయినా విద్యార్థుల సంఖ్య తక్కువగా ఉన్నందున.. అక్కడికి అంగన్‌వాడీ కేంద్రాలను తరలించవచ్చని విద్యాశాఖ భావిస్తోంది.

Advertisement
Advertisement