మా గొంతు నొక్కుతున్నారు | Sakshi
Sakshi News home page

మా గొంతు నొక్కుతున్నారు

Published Mon, Mar 14 2016 2:07 AM

మా గొంతు నొక్కుతున్నారు - Sakshi

♦ స్పీకర్‌పై కాంగ్రెస్, బీజేపీ, టీడీపీ సభ్యుల ఆగ్రహం
♦ టీఆర్‌ఎస్ కనుసన్నల్లో వ్యవహరిస్తున్నారు
♦ వివరణ ఇవ్వకుండా సభ వాయిదా వేస్తారా?
♦ స్పీకర్ చాంబర్ వద్ద సభ్యుల బైఠాయింపు
 
 సాక్షి, హైదరాబాద్: శాసనసభలో స్పీకర్ అధికారపక్షానికి అనుకూలంగా వ్యవహరిస్తూ విపక్ష సభ్యుల గొంతు నొక్కుతున్నారని కాంగ్రెస్, బీజేపీ, టీడీపీ ఎమ్మెల్యేలు ఆరోపించారు. గవర్నరు ప్రసంగానికి ధన్యవాద తీర్మానంపై ఆదివారం ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు ప్రసంగం అనంతరం వివరణల కోసం తమకు అవకాశమివ్వకుండా సభను వాయిదా వేయడం అప్రజాస్వామికమంటూ మండిపడ్డారు. సుమారు రెండున్నర గంటల సీఎం ప్రసంగంలోని అంశాలపై తమ అభ్యంతరాలను, సందేహాలను, వ్యక్తిగతంగా సభ్యులనుద్దేశించి వాడిన పదజాలంపై ఆయన వివరణ ఇవ్వాలంటూ సభలో వారు పట్టుబట్టారు.

అందుకు అవకాశమివ్వకుండా సభను స్పీకర్ మధుసూదనాచారి వాయిదా వేయడంతో నేరుగా స్పీకర్‌ను కలిసేందుకు ఆయన చాంబర్‌కు వెళ్లారు. కాంగ్రెస్ సభ్యులు ఎన్.ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, మల్లు భట్టివిక్ర మార్క, జె.గీతారెడ్డి, జి.చిన్నారెడ్డి, టి.జీవన్ రెడ్డి, టి.రామ్మోహన్‌రెడ్డి, వంశీచంద్‌రెడ్డి, బీజేపీ ఎమ్మెల్యేలు కె.లక్ష్మణ్, చింతల రామచంద్రారెడ్డి, టీడీపీ ఎమ్మెల్యే రేవంత్‌రెడ్డి తదితరులు వీరిలో ఉన్నారు. అప్పటికే స్పీకర్ వెళ్లిపోవడంతో సభ్యులంతా ఆయన చాంబర్ ఎదుట బైఠాయించి నిరసన తెలిపారు. ‘‘కేసీఆర్ ప్రసంగంలో మమ్మల్నునుద్దేశించి పలుమార్లు మాట్లాడారు. మాకున్న సందేహాలను అడిగే అవకాశమివ్వాలంటూ విపక్ష సభ్యులం అడిగినా పట్టించుకోకుండా స్పీకర్ మధుసూదనాచారి సభను సోమవారానికి వాయిదా వేశారు’’ అంటూ కాంగ్రెస్ సభ్యులు మండిపడ్డారు. స్పీకర్ చాంబర్లో కాసేపు నిరసన వ్యక్తం చేసి బయటికొచ్చారు.

 టీఆర్‌ఎస్‌ది నియంతృత్వ ధోరణి...
 సభలో మెజారిటీ ఉందనే అహంకారంతో అధికార టీఆర్‌ఎస్ ఏకపక్షంగా, నియంతృత్వ ధోరణితో వ్యవహరిస్తున్నదని ఈ సందర్భంగా సభ్యులు విమర్శించారు. స్పీకర్ సభను నిష్పాక్షికంగా నడిపించలేదని ఉత్తమ్ ఆరోపించారు. విపక్షాల గొంతు నొక్కుతూ అధికార పక్షం కనుసన్నల్లో స్పీకర్ పని చేస్తున్నారని ఆరోపించారు. బడ్జెట్‌పై జరిగే చర్చలోనైనా తమకు సరైన అవకాశమివ్వాలని డిమాండ్ చేశారు. అధికార పార్టీ కనుసన్నల్లో సభ జరగడం మంచిది కాదని, ప్రజా సమస్యల పరిష్కారానికి అన్ని పార్టీలకూ అవకాశం కల్పించాలని కె.లక్ష్మణ్ కోరారు. కేసీఆర్ ఏకపాత్రాభినయం చేస్తూ అవాస్తవాలు చెబుతున్నారని రేవంత్ విమర్శించారు.

Advertisement

తప్పక చదవండి

Advertisement