'ఆ పెళ్లికి మోదీ, దావుద్ వెళ్లారు' | Sakshi
Sakshi News home page

'ఆ పెళ్లికి మోదీ, దావుద్ వెళ్లారు'

Published Wed, Jan 13 2016 2:46 PM

'ఆ పెళ్లికి మోదీ, దావుద్ వెళ్లారు' - Sakshi

హైదరాబాద్: కేంద్రంలో మోదీ, తెలంగాణలో కేసీఆర్ ప్రభుత్వాలపై ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి, తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇన్చార్జ్ దిగ్విజయ్ సింగ్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. తెలంగాణ పీసీసీ సమన్వయ కమిటీ సమావేశం బుధవారం గాంధీభవన్‌లో  జరిగింది.


ఈ సందర్భంగా దిగ్విజయ్ మాట్లాడుతూ.... పాకిస్థాన్ ప్రధాని నవాజ్ షరీఫ్ మనువరాలి పెళ్లికి అండర్ వరల్డ్ డాన్ దావుద్ ఇబ్రహీం హాజరయినట్లు తమకు సమాచారం ఉందని... అదే వివాహానికి మోదీ హాజరు కావడం పలు అనుమానాలకు తావిస్తుందన్నారు. పాక్ పర్యటనకు వెళ్లి రాగానే పఠాన్కోట్పై దాడి జరగడం దారుణామని ఆయన అన్నారు. పంజాబ్ ప్రభుత్వం ఈ దాడిపై ఎన్‌ఐఏ దర్యాప్తును వ్యతిరేకించడం పలు అనుమానాలు కలిగిస్తున్నాయని దిగ్విజయ్ అన్నారు.


స్మగ్లర్లకు సల్వీందర్సింగ్ సహకరిస్తున్నారని ఆయన ఆరోపించారు. ఈ మొత్తం వ్యవహారంపై సమగ్ర దర్యాప్తుకు ఆదేశించాలని కేంద్రప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. కేంద్రమంత్రి నితిన్గడ్కరీ అవినీతి వ్యవహారాన్ని మోదీ పట్టించుకోవడంలేదన్నారు. టెండర్లు లేకుండా రూ.10 వేల కోట్ల కాంట్రాక్టులు ఏవిధంగా ఖరారు చేస్తారని దిగ్విజయ్ ప్రశ్నించారు.

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్పై కూడా దిగ్విజయ్ సింగ్ మండిపడ్డారు. తెలంగాణను ఇస్తే టీఆర్ఎస్ను కాంగ్రెస్లో విలీనం చేస్తానంటూ సోనియా, రాహుల్ను కలిసిన కేసీఆర్..తెలంగాణ ఇచ్చిన తరువాత మాటమార్చారని అన్నారు. ఓటుకు నోటు కేసులో పరస్పరం దూషించుకున్న సీఎంలు ఇప్పుడు పరస్పరం పొగుడుకోవడం విడ్డూరంగా ఉందని ఆయన అన్నారు. టీఆర్ఎస్ పార్టీ ఎన్ని ప్రలోభాలు పెట్టినా కాంగ్రెస్ నేతలు లొంగకుండా పార్టీ పట్ల నిబద్ధతతో ఉంటున్నారని మెచ్చుకున్నారు. హైదరాబాద్లో ఉన్న వారు హైదరాబాదీలేనని అన్నారు. అధికారం చేపట్టి 20 నెలల కావస్తున్న ఎన్నికలలో ఇచ్చిన హామీలను ప్రధాని మోదీ, సీఎం కేసీఆర్ విస్మరిస్తూ.. మాట మార్చుతూ పబ్బం గడుపుతున్నారని దిగ్విజయ్ విమర్శించారు.

Advertisement

తప్పక చదవండి

Advertisement