చలో మల్లన్నసాగర్ భగ్నం | Sakshi
Sakshi News home page

చలో మల్లన్నసాగర్ భగ్నం

Published Wed, Jul 27 2016 4:42 AM

చలో మల్లన్నసాగర్ భగ్నం - Sakshi

రాష్ట్రవ్యాప్తంగా ఎక్కడికక్కడ కాంగ్రెస్ నేతల అరెస్ట్
 
 సాక్షి, హైదరాబాద్ : మల్లన్నసాగర్ భూనిర్వాసితులపై పోలీసుల లాఠీచార్జిలో గాయపడిన వారిని పరామర్శించేందుకు మంగళవారం కాంగ్రెస్ నేతలు చేపట్టిన ‘చలో మల్లన్నసాగర్’ను పోలీసులు భగ్నం చేశారు. హైదరాబాద్ నుంచి మల్లన్నసాగర్ ప్రాంతానికి బయలుదేరిన కాంగ్రెస్ నేతలను గాంధీభవన్ దగ్గరే అడ్డుకోగా.. రాష్ట్రవ్యాప్తంగా ఎక్కడికక్కడ నేతలను అరెస్టు చేశారు. ఎవరూ ముంపు గ్రామాలకు చేరుకోకుండా కట్టడి చేశారు. ఇక పోలీసులు రెండో రోజు కూడా రాజీవ్ రహదారిని తమ అధీనంలోకి తీసుకున్నారు. చెక్‌పోస్టులు ఏర్పాటు చేసి ప్రతి వాహనాన్ని తనిఖీ చేసి పంపించారు. రంగారెడ్డి జిల్లా శామీర్‌పేట, మెదక్ జిల్లా వంటిమామిడి శివారు ప్రాంతాల్లో చెక్‌పోస్టుల వద్ద భారీగా పోలీసులను మోహరించారు.

 గాంధీభవన్ నుంచి బయలుదేరగానే..
 మల్లన్నసాగర్ ప్రాంతానికి వెళ్లేందుకు టీపీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు మల్లు భట్టివిక్రమార్క, ప్రతిపక్షనేత కె.జానారెడ్డి, సీనియర్ నేతలు ఎస్.జైపాల్‌రెడ్డి, షబ్బీర్ అలీ, అంజన్‌కుమార్ యాదవ్, పెద్ద సంఖ్యలో నేతలు, కార్యకర్తలు మంగళవారం ఉదయం గాంధీభవన్‌కు చేరుకున్నారు. అప్పటికే ఈ కార్యక్రమాన్ని అడ్డుకునేందుకు పోలీసులు పెద్ద సంఖ్యలో మోహరించారు. కాంగ్రెస్ నేతలు ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ పెద్ద ఎత్తున నినాదాలు చేస్తూ.. గాంధీభవన్ నుంచి ర్యాలీగా బయలుదేరారు.

ఆ ర్యాలీ నాంపల్లి చౌరస్తా దాటకముందేపోలీసులు అడ్డుకున్నారు. అది సరికాదంటూ జానారెడ్డి, షబ్బీర్ అలీ, భట్టి విక్రమార్క తదితరులు పోలీసులతో వాగ్వాదానికి దిగారు. పోలీసులు వెళ్లనివ్వకపోవడంతో.. ఇరువర్గాల మధ్య తోపులాట జరిగింది. దీంతో కొందరు నేతలు, కార్యకర్తలు రోడ్డుపైనే బైఠాయించి కేసీఆర్‌కు, పోలీసులకు వ్యతిరేకంగా నినాదాలు చేయడంతో ఉద్రిక్తత నెలకొంది. చివరికి పోలీసులు కాంగ్రెస్ నేతలను అరెస్టు చేసి సమీపంలోని గోషామహల్, నాంపల్లి, నారాయణగూడ పోలీస్‌స్టేషన్లకు తరలించారు. పోలీస్‌స్టేషన్లలోనూ కాంగ్రెస్ నేతలు తమ ఆందోళన కొనసాగించారు.

 రాష్ట్రవ్యాప్తంగా కాంగ్రెస్ నేతల అరెస్టులు
 మల్లన్న సాగర్ భూనిర్వాసితులను పరామర్శించడానికి బయలుదేరిన కాంగ్రెస్ నేతలందరినీ రాష్ట్రవ్యాప్తంగా పోలీసులు ఎక్కడికక్కడ అదుపులోకి తీసుకున్నారు. పీసీసీ మాజీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్యను కొండపాక మండలం లింగాపూర్ వద్ద అరెస్టు చేశారు. మాజీ ఉప ముఖ్యమంత్రి దామోదర రాజనర్సింహ, ఎమ్మెల్యే డీకే అరుణను మెదక్ జిల్లా చేగుంటలో అరెస్టు చేశారు. కేసీఆర్ రైతులను మోసం చేస్తున్నారని, టీఆర్‌ఎస్ ప్రభుత్వ ప్రజాకంటక చర్యల్ని దేశమంతా గమనిస్తోందని వారు ఈ సందర్భంగా ఆరోపించారు. కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం అల్గునూర్ వద్ద కాంగ్రెస్ నేతలు టి.జీవన్‌రెడ్డి, శ్రీధర్‌బాబు, పొన్నం ప్రభాకర్ తదితరులను అరెస్టు చేసి, మానకొండూర్ పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. హుస్నాబాద్ మాజీ ఎమ్మెల్యే ప్రవీణ్‌రెడ్డి, ఎస్సీ కార్పొరేషన్ మాజీ చైర్మన్ అడ్లూరి లక్ష్మణ్‌కుమార్‌లను బెజ్జంకి చెక్‌పోస్టు వద్ద అరెస్టు చేశారు.

 ఎమర్జెన్సీ కన్నా ఘోరం: జైపాల్‌రెడ్డి
 పోలీసుల దాడిలో గాయపడిన భూనిర్వాసితులను పరామర్శించే అవకాశం కూడా లేకుండా అరెస్టు చేయడం ఎమర్జెన్సీ పరిస్థితుల కన్నా ఘోరమని కాంగ్రెస్ సీనియర్ నేత ఎస్.జైపాల్‌రెడ్డి విమర్శించారు. ప్రజాస్వామ్యానికి లోబడి శాంతియుతంగా నిరసన తెలుపుతున్న భూనిర్వాసితులపై పోలీసులు అమానుషంగా వ్యవహరించడం దారుణమని పేర్కొన్నారు. వారిని పరామర్శించడానికి వెళ్తున్న నేతలను అరెస్టు చేయడం దుర్మార్గమన్నారు.

 ఎన్ని నిర్బంధాలు విధించినా పోరాడుతాం..
 అరెస్టులు చేసినా, నిర్బంధాలు విధించినా రైతులకు న్యాయం జరిగేదాకా పోరాడుతామని... అరెస్టులకు అదరం, బెదరబోమని కాంగ్రెస్ సీనియర్ నేతలు కె.జానారెడ్డి, షబ్బీర్ అలీ, భట్టి విక్రమార్క స్పష్టం చేశారు. రాష్ట్రాన్ని పోలీసు రాజ్యం చేస్తారా అని ఆగ్రహం వ్యక్తం చేశారు. అరెస్టు చేసిన సందర్భంగా వివిధ పోలీస్‌స్టేషన్లలో ఆందోళన కొనసాగించిన కాంగ్రెస్ నేతలు.. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడారు. న్యాయం కావాలని ఆందోళన చేసేందుకు ప్రయత్నించిన మల్లన్న సాగర్ రైతులపై పోలీసులు దాడి చేయడం దారుణమని పేర్కొన్నారు. రైతులను పరామర్శించడానికి వెళ్తుంటే అరెస్టులు చేయడం అప్రజాస్వామికమని.. తప్పులు ఎత్తిచూపే ప్రతిపక్షాలను పోలీసులతో అడ్డుకోవడం రాజ్యాంగ విరుద్ధమని విమర్శించారు.

ఈ పరిస్థితి ఎమర్జెన్సీని తలపిస్తోందని.. తెలంగాణకు ఇది చీకటి రోజు అని వ్యాఖ్యానించారు. కేసీఆర్ సర్కారు తీరుపై  కేంద్ర ప్రభుత్వానికి, మానవ హక్కుల సంఘానికి ఫిర్యాదు చేస్తామని పేర్కొన్నారు. కాంగ్రెస్ అధికారంలో ఉన్న పదేళ్లలో ఏనాడైనా తెలంగాణ ఉద్యమాన్ని అడ్డుకున్నామా అని ప్రశ్నించారు. పార్లమెంట్‌లో కేవలం ఇద్దరు ఎంపీలున్న టీఆర్‌ఎస్‌తో తెలంగాణ రాలేదని.. కాంగ్రెస్ పార్టీతోనే తెలంగాణ వచ్చిందని గుర్తుంచుకోవాలని పేర్కొన్నారు.  రైతుల హక్కుల పరిరక్షణ కోసం కాంగ్రెస్ ఎంతదాకా అయినా తెగించి పోరాటం చేస్తుందని స్పష్టం చేశారు. ఈ పోరాటం ఆరంభమేనని.. దీనిని భవిష్యత్తులో మరింత తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు. ప్రస్తుతం కాంగ్రెస్‌ను చూస్తే కేసీఆర్ వెన్నులో వణుకు పుడుతోందని.. అందుకే అడ్డుకోవడానికి ప్రయత్నిస్తున్నారని విమర్శించారు. పోలీసు హింసతో రాష్ట్రాన్ని చేతుల్లో పెట్టుకోవాలని చూడడం శోచనీయమని పేర్కొన్నారు.
 
 ప్రాజెక్టుకు అనుకూలంగా ర్యాలీలు
 మల్లన్నసాగర్ ప్రాజెక్టు నిర్మించాలంటూ మెదక్ జిల్లాలోని మెదక్, జహీరాబాద్, జోగిపేట, నర్సాపూర్ తదితర ప్రాంతాల్లో రైతులు ర్యాలీలు నిర్వహించారు. ప్రాజెక్టును వ్యతిరేకిస్తున్న ప్రతిపక్షాల దిష్టిబొమ్మలను దహనం చేశారు. ఆయా మండల కేంద్రాల్లో తహసీల్దార్లకు వినతిపత్రాలు అందజేశారు.
 
 గజ్వేల్ దాకా వెళ్లగలిగినా..
 కాంగ్రెస్ నేతలు దామోదర రాజనర్సింహ, డీకే అరుణ, సబితాఇంద్రారెడ్డి, మాజీ ఎమ్మెల్యే ప్రతాప్‌రెడ్డి, నాయకులు అద్దంకి దయాకర్, వేణుగోపాల్‌రావు తదితరులు హైదరాబాద్ నుంచి పోలీసులకు చిక్కకుండా ‘రింగ్’ రోడ్డు మీదుగా, పోలీసు చెక్‌పోస్టుల్లేని గ్రామాల ద్వారా గజ్వేల్‌కు చేరుకున్నారు. పిడిచెడ్ రోడ్డు మార్గం ద్వారా ముంపు గ్రామాలైన వేములగాట్, ఎర్రవల్లికి వెళ్లేందుకు ప్రయత్నించగా.. పోలీసులు గుర్తించి అడ్డుకున్నారు.

 పోలీసు వలయంలోనే ముంపు గ్రామాలు
 మల్లన్నసాగర్ 9 ముంపు గ్రామాలు ఇంకా పోలీసుల గుప్పిట్లోనే ఉన్నాయి. గ్రామస్తులు బయటికి వెళ్లకుండా, బయటి వ్యక్తులు గ్రామాల్లోకి రాకుండా పోలీసులు అడ్డుకుంటున్నారు. బయటి వ్యక్తులు గ్రామాల్లోకి రావడం వల్లే శాంతిభద్రతలకు విఘాతం కలుగుతోందని పోలీసులు చె బుతున్నారు.

Advertisement

తప్పక చదవండి

Advertisement