సీఎం క్యాంప్ ఆఫీస్ వద్ద కానిస్టేబుల్ ఆత్మహత్యాయత్నం | Sakshi
Sakshi News home page

సీఎం క్యాంప్ ఆఫీస్ వద్ద కానిస్టేబుల్ ఆత్మహత్యాయత్నం

Published Mon, Sep 12 2016 4:55 AM

సీఎం క్యాంప్ ఆఫీస్ వద్ద కానిస్టేబుల్ ఆత్మహత్యాయత్నం - Sakshi

- వ్యక్తిగత కారణాలతోనే..: నార్త్‌జోన్ డీసీపీ సుమతి

- వేధింపులే కారణం..: హన్మంతరెడ్డి బావ వెంకట్‌రెడ్డి

 సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్ పోలీసు కమిషనరేట్‌లో పని చేస్తున్న హన్మంతరెడ్డి అనే కానిస్టేబుల్ ఆదివారం బేగంపేటలోని సీఎం క్యాంపు కార్యాలయం వద్ద ఆత్మహత్యాయత్నం చేశాడు. 2010 బ్యాచ్‌కు చెందిన హన్మంతరెడ్డి గతంలో కార్ఖానా ఠాణాలో విధులు నిర్వర్తించాడు. గుర్తు తెలియని ప్రాంతంలో కిరోసిన్ తాగిన ఆయన ఆదివారం క్యాంపు కార్యాలయం వద్దకు వచ్చి కుప్పకూలాడు. అక్కడున్న పోలీసు లు అతన్ని హుటాహుటిన సికింద్రాబాద్‌లోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. హన్మంతరెడ్డి వ్యక్తిగత కారణాలతోనే ఆత్మహత్యాయత్నం చేసినట్లు నార్త్‌జోన్ డీసీపీ బి.సుమతి చెప్పారు. ఆయన ప్రస్తుతం డీసీపీ కార్యాలయంలోని ఐటీ వింగ్‌లో పని చేస్తున్నాడని తెలిపారు. సుదీర్ఘకాలంగా అనారోగ్య సెలవులో ఉండటంతో జీతం, ఇంక్రిమెంట్లు కట్ అయ్యాయని, దీంతో ఆర్థిక ఇబ్బం దులు ఎదురైనట్లు హన్మంతరెడ్డి తెలిపాడని వివరించారు. ప్రస్తుతం ఆయన పరిస్థితి నిలకడగా ఉందని, వైద్యుల సలహా మేరకు అబ్జర్వేషన్‌లో ఉంచామని  వెల్లడించారు.

 మెసేజ్ చేశారనే వేధింపులు: పోలీసుల వేధింపులే హన్మంతరెడ్డి ఆత్మహత్యాయత్నానికి కారణమని ఆయన బావ వెంకట్‌రెడ్డి పేర్కొన్నారు. ఇటీవల భవానీనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఎస్‌ఐ కాలర్‌ను ఓ ఆటో డ్రైవర్ పట్టుకున్నట్లు వాట్సప్, ట్వీటర్‌లో వచ్చిందని.. ఆ మెసేజ్‌ను హన్మంతరెడ్డి ఇతర గ్రూపుల్లో పోస్టింగ్ చేయడంతోనే వేధింపులు మొదలయ్యాయని ఆరోపించారు. ఇదే విషయంపై రెండు రోజుల క్రితం టాస్క్‌ఫోర్స్ ఎస్సై విచారణ కోసం హన్మంతరెడ్డిని తీసుకుని వెళ్లారని తెలిపారు. దీంతో పాటు 2012-13లో విద్యార్థులపై లాఠీచార్జీ చేయాలని కొంత మంది పోలీసులు చెప్పగా.. హన్మంతరెడ్డి చేయలేదని దీంతో అప్పుడు రెండు ఇంక్రిమెంట్లు రాకుండా అడ్డుకున్నారని ఆయన తెలిపారు. నాటి నుంచి తీవ్ర మనస్తాపంతో ఉన్న హన్మంతరెడ్డి.. ఇటీవల టాస్క్‌ఫోర్స్ పోలీసులు తీసుకుని పోవడంతో మానసికంగా మరింత కుంగిపోయాడని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.

Advertisement

తప్పక చదవండి

Advertisement