ఈ బాషాకు నాలుగు పేర్లు | Sakshi
Sakshi News home page

ఈ బాషాకు నాలుగు పేర్లు

Published Fri, Jul 8 2016 8:05 PM

Consultancy manager arrested

సులువుగా ఉద్యోగాలు ఇప్పిస్తానంటూ నిరుద్యోగులను వేర్వేరు పేర్లతో మోసం చేసిన కేసులో చైతన్యపురి పోలీసులు నిందితుడిని అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. శుక్రవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సీఐ గురురాఘవేంద్ర, ఎస్‌ఐ. సత్యనారాయణ తెలిపిన వివరాలివీ.. కర్నూలు జిల్లా నంద్యాలకు చెందిన షేక్ మహబూబ్ బాషా (53) 30 ఏళ్ల క్రితం నగరానికి వచ్చాడు. కొంత కాలం ట్రావెల్స్ నిర్వహించి, పాస్‌పోర్ట్ బ్రోకర్‌గా పనిచేశాడు.

 

మహబూబ్ బాషా తన పేరును ప్రతాపరెడ్డిగా మార్చుకుని ఏడాదిన్నర క్రితం మోహన్‌నగర్‌లో రాయల్ ప్లేస్‌మెంట్స్ సర్వీసెస్ పేరిట కార్యాలయాన్ని తెరిచాడు. ధనికుడిగా కనబడేందుకు గొలుసులు, ఉంగరాలు ధరించేవాడు. మెట్రో, రెవెన్యూ, కోర్టు, రైల్వే విభాగాల్లో సులువుగా ఉద్యోగాలు ఇప్పిస్తానని తెలిసిన వారిని, ఏజెంట్లను మధ్యవర్తులుగా పెట్టి నిరుద్యోగులకు ఎర వేశాడు.నమ్మబలికి ఒక్కొక్కరి నుంచి రూ.20 వేల నుంచి రూ.12 లక్షల వరకు వసూలు చేశాడు. వాట్సప్‌లు, మెయిల్స్ ద్వారా ఉద్యోగ ప్రకటనలు ఇచ్చి నిరుద్యోగులకు వల వేశాడు.

 

కొంతమందికి అపాయింట్‌మెంట్ లెటర్లు కూడా అందజేశాడు. వరుణ్ అనే వ్యక్తితో ఫేక్ అపాయింట్‌మెంట్ లెటర్‌లు, నకిలీ స్టాంపులు తయారుచేయించి నిరుద్యోగులకు ఆర్డర్ కాపీలు ఇచ్చేవాడు. అవి ఫేక్ అని తెలుసుకుని గతనెలలో మోసపోయిన బాధితులు కన్సల్టెన్సీ కార్యాలయానికి వెళ్లగా అప్పటికే నిర్వాహకులు బోర్డు తిప్పేసి పరారయ్యారు. దీంతో గతనెల 8న నవీన్‌తో పాటు సుమారు 28మంది బాదితులు చైతన్యపురి పోలీసులను ఆశ్రయించారు. బాధితుల్లో ఎక్కువ మంది నల్లగొండ, ఖమ్మం జిల్లాల వారు ఉన్నారు. కేసు నమోదు చేసిన పోలీసులు తప్పించుకు తిరుగుతున్న బాషాను గురువారం సాయంత్రం అల్వాల్‌లోని నివాసంలో అరెస్ట్ చేశారు.

 

నిందితుడి నుంచి రు.5లక్షలు నగదు, నాలుగు సెల్‌ఫోన్‌లు స్వాధీనం చేసుకుని శుక్రవారం రిమాండ్‌కు తరలించారు. కన్సల్టెన్సీ నిర్వాహకుడు బాషాకు ప్రతాప్‌రెడ్డితో పాటు అశోక్‌రెడ్డి, కృష్ణారెడ్డి పేర్లతో కూడా చలామణి అయినట్లు విచారణలో తెలిసిందని పేర్కొన్నారు. బ్రోకర్‌గా పనిచేసిన జంగయ్య, కన్సల్టెన్సీ కార్యాలయంలో పనిచేసే వెంకటేశ్వరరావులను గతంలోనే అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించామని, వరుణ్, మరో అయిదుగురు నిందితులు పరారీలో ఉన్నట్లు తెలిపారు.
 

Advertisement

తప్పక చదవండి

Advertisement