జైలుకెళ్లొచ్చినా మళ్లీ అదే బాట | Sakshi
Sakshi News home page

జైలుకెళ్లొచ్చినా మళ్లీ అదే బాట

Published Sun, Apr 24 2016 4:41 PM

స్వాధీనం చేసుకున్న కార్లు , రాంబాబు

హైదరాబాద్: తాళం వేసిన ఇళ్లనే టార్గెట్ చేస్తూ దొంగతనాలకు పాల్పడుతూ.. కార్లనూ దొంగిలిస్తున్న ఓ పాత నేరస్థుడిని వెస్ట్‌జోన్ టాస్క్‌ఫోర్స్ పోలీసులు అరెస్టు చేశారు. డీసీపీ లింబారెడ్డి తెలిపిన వివరాల ప్రకారం కృష్ణా జిల్లాకు చెందిన గాలంకి రాంబాబు కొన్నేళ్ల క్రితం నగరానికి వచ్చి కారు డ్రైవర్‌గా పనిచేస్తూ రాయిగర్ హరిజనబస్తీలో నివాసం ఉంటున్నారు. విలాసాలకు అలవాటు పడిన రాంబాబుకు దొంగతనాలను వృత్తిగా ఎంచుకున్నాడు. గతంలో జూబ్లీహిల్స్ పోలీస్‌స్టేషన్ పరిధిలో దొంగతనాలకు పాల్పడి జైలుకు వెళ్లి వచ్చాడు. తిరిగి పాత జీవితాన్నే ప్రారంభించాడు. బంజారాహిల్స్, కూకట్‌పల్లి, హయత్‌నగర్, జూబ్లీహిల్స్ పోలీస్‌స్టేషన్ల పరిధిలో ఇళ్లలో దొంగతనాలతో పాటు ఇంటి ముందు నిలిపి ఉంచిన కార్లను దొంగతనం చేశారు. 5 కేసుల్లో నిందితుడిగా ఉన్న అతడిని శనివారం వెస్ట్‌జోన్ టాస్క్‌ఫోర్స్ ఇన్‌స్పెక్టర్ రాజా వెంకటరెడ్డి, జూబ్లీహిల్స్ అదనపు ఇన్‌స్పెక్టర్ ముత్తులు అదుపులోకి తీసుకుని అతని వద్ద 7.2తులాల బంగారు ఆబరణాలను రెండు కార్లను స్వాధీనం చేసుకున్నారు.
 
 పార్క్ చేసిన ద్విచక్రవాహనాలే...
 
 అమీర్‌పేట: బతుకు దెరువుకోసం నగరానికి వచ్చి ద్విచక్ర వాహనాలను దొంగిలిస్తున్న పాత నేరస్తుడితోపాటు దొంగిలించిన వాహనాలకు తక్కువ ధరకు కొనుగోలు చేస్తున్న ప్రభుత్వ ఉద్యోగిని పోలీసులు అరెస్టు చేశారు. పంజగుట్ట ఏసీపీ వెంకటేశ్వర్లు శనివారం ఎస్‌ఆర్‌నగర్ పోలీస్‌స్టేషన్‌లో విలేకరుల సమావేశంలో వివరాలను వెల్లడించారు. గుంటూరు జిల్లా తెనాలిలోని గంగానంపేటకు చెందిన దుప్పటి కృష్ణ బల్కంపేట బీకేగూడ శ్రీరాంనగర్‌లో నివాసం ఉంటున్నాడు. పార్క్ చేసి ఉన్న ద్విచక్ర వాహనాలను దొంగిలించడం ప్రారంభించాడు. ఆ వాహనాలను నీలోఫర్ ఆస్పత్రిలో అంటెండర్‌గా పనిచేస్తున్న సనత్‌నగర్ నివాసి పశుల రాజేష్ తక్కువ ధరకు విక్రయిస్తున్నాడు. గతంలో ఎస్‌ఆర్‌నగర్ స్టేషన్ పరిధిలో ఓ వాహనం దొంగిలించి పోలీసులకు చిక్కాడు. జైలుకు వెళ్లి వచ్చి తిరిగి దొంగతనాలకు పాల్పడుతున్నాడు. తాజాగా బీకేగూడలోని విజేత బాయ్స్ హాస్టల్‌లో ల్యాప్‌టాప్‌ను దొంగిలించగా అది సీసీ కెమెరాలో రికార్డు అయ్యింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు సీసీ కెమెరా ఫుటేజీలను పరిశీలించి పాత నేరస్తుడు కృష్ణగా గుర్తించారు. శుక్రవారం సాయంత్రం కృష్ణను, ద్విచక్రవాహనాలు విక్రయించిన రాజేష్‌ను అదుపులోకి తీసుకొని రిమాండ్‌కు తరలించామని తెలిపారు. సమావేశంలో ఇన్‌స్పెక్టర్ వాహిదుద్దీన్, డీఐ సతీష్, ఎస్సై సునీల్‌రెడ్డి, క్రైం సిబ్బంది పాల్గొన్నారు.
 

Advertisement
Advertisement