'ఆమె రాజకీయ పరిపక్వత సాధించాలని మా కోరిక' | Sakshi
Sakshi News home page

'ఆమె రాజకీయ పరిపక్వత సాధించాలని మా కోరిక'

Published Mon, May 2 2016 8:11 PM

CPI Leader Chada Venkat reddy reaction over MP Kavita comments

హైదరాబాద్ : ఎంపీ కవిత మరింత రాజకీయ పరిపక్వతను సాధించాలని ఆకాంక్షిస్తున్నామని సీపీఐ కార్యదర్శి చాడ వెంకటరెడ్డి పేర్కొన్నారు. రాష్ట్రంలో కమ్యూనిస్టుల అవసరం లేదని కవిత వ్యాఖ్యానించినట్లుగా వచ్చిన కథనంపై ఆయన సోమవారం స్పందించారు. కమ్యూనిస్టులు విప్లవం రావాలని, సమసమాజం కావాలని కోరుకుంటున్నారని.. అయితే తమ తండ్రి కేసీఆర్ ఇప్పటికే ఆ పని పూర్తిచేశారని ఆమె పేర్కొనడాన్ని తప్పుపట్టారు.

మాటల గారడీతో అస్తవ్యస్త పాలన సాగిస్తూ ప్రజల సంక్షేమాన్ని టీఆర్‌ఎస్ ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తోందని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం విమర్శించారు. కేసీఆర్ అతిపెద్ద కమ్యూనిస్టు అయితే నిరుద్యోగులందరికీ ఉద్యోగాలు ఎందుకు ఇవ్వడం లేదని, సమాన పనికి సమాన వేతనం, ఈఎస్‌ఐ, పీఎఫ్, పెన్షన్లను కార్మికులందరికీ ఎందుకు వర్తింపచేయడం లేదని ప్రశ్నించారు.

మేడే ఉత్సవాల సందర్భంగా ఎంపీ కవిత చేసిన వ్యాఖ్యలను న్యూడెమోక్రసీ (చంద్రన్న) రాష్ట్రకార్యదర్శి సాధినేని వెంకటేశ్వరరావు ఖండించారు. అసందర్భ, అనుచిత వ్యాఖ్యలను కవిత ఉపసంహరించుకోవాలని ఒక ప్రకటనలో డిమాండ్‌ చేశారు. దోపిడీ, పీడనలు ఉన్నంత కాలం కమ్యూనిస్టులు ఉండి తీరుతారన్న వాస్తవాన్ని కవిత గ్రహించాలన్నారు.

Advertisement
Advertisement