సీపీఎంవి హత్యా రాజకీయాలు: లక్ష్మణ్ | Sakshi
Sakshi News home page

సీపీఎంవి హత్యా రాజకీయాలు: లక్ష్మణ్

Published Fri, Mar 3 2017 1:48 PM

సీపీఎంవి హత్యా రాజకీయాలు: లక్ష్మణ్ - Sakshi

కేరళలో సీపీఎం హత్యా రాజకీయాలు చేస్తోందని బీజేపీ తెలంగాణ శాఖ అధ్యక్షుడు, ఎమ్మెల్యే డాక్టర్ కె. లక్ష్మణ్ మండిపడ్డారు. కేరళలో వరుసగా జరుగుతున్న ఘటనలను నిరసిస్తూ ఇందిరాపార్కు వద్ద ధర్నా చౌక్‌లో మహాధర్నా నిర్వహించారు. కేరళ ప్రభుత్వానికి కనువిప్పు కావాలని ఈ రోజు దేశవ్యాప్తంగా నిరసనలు జరుగుతున్నాయని, బాబా సాహెబ్ అంబేద్కర్ చూపిన బాటలో అహింసామార్గంలో నడవాలని ఈ కార్యక్రమంలో పాల్గొన్న లక్ష్మణ్ అన్నారు. సీపీఎం ప్రభుత్వం హత్యా రాజకీయాలను ప్రోత్సహిస్తోందని, నేరచరిత్ర ఉన్న సీఎం ఈరోజు కేరళలో ప్రభుత్వం నడుపుతున్నారని మండిపడ్డారు. సీపీఎం చేస్తున్న అరాచకాలను ప్రశ్నించిన దళితులను కిరాతకంగా హతమార్చారని, బీజేపీ, ఆర్ఎస్ఎస్ కార్యాలయాలపై బాంబు దాడులకు దిగుతున్నారని ఆయన అన్నారు. 
 
కమ్యూనిస్టులది పూర్తిగా నేర చరిత్ర అని, ఇంతకుముందు పశ్చిమ బెంగాల్‌లో ఇలాగే నేరాలకు పాల్పడితే అక్కడి ప్రజలు ఆ పార్టీని బంగాళాఖాతంలో కలిపేశారని ఎద్దేవా చేశారు. ఇప్పుడు మళ్లీ వాళ్లు యూనివర్సిటీలలో అల్లర్లు సృష్టిస్తున్నారని, వాళ్ల చేష్టలను దేశం మొత్తం గమనిస్తోందని అన్నారు. కమ్యూనిస్టులతో కాంగ్రెస్ పార్టీ లోపాయికానీ ఒప్పందం చేసుకుని, జాతీయవాదులపై దాడికి ఉసిగొల్పుతోందని ఆయన ఆరోపించారు. కార్యక్రమంలో బీజేపీతో పాటు జాగృత భారత్, ఎంఎంఆర్ఐ, ఆర్ఎస్ఎస్ తదితర సంస్థలు కూడా పాల్గొన్నాయి. మాజీ డీజీపీ దినేష్ రెడ్డి, ఎమ్మెల్యేలు ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్, రాజాసింగ్ ఠాకూర్ తదితరులు పాల్గొన్నారు. 

Advertisement
Advertisement