మార్చి జీతంలో పెరిగిన డీఏ | Sakshi
Sakshi News home page

మార్చి జీతంలో పెరిగిన డీఏ

Published Mon, Feb 29 2016 3:28 AM

మార్చి జీతంలో పెరిగిన డీఏ

♦ ఏప్రిల్ 1న అందుకోనున్న రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు
♦ జూలై నుంచి ఇవ్వాల్సిన బకాయిలు జీపీఎఫ్‌లో జమ
♦ వారం రోజుల్లో ఉత్తర్వులు జారీ చేయనున్న ఆర్థికశాఖ
 
 సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు మార్చి నెల జీతంతో పెరిగిన కరువు భత్యం (డీఏ) చెల్లించాలని ప్రభుత్వం నిర్ణయించింది. అంటే ఏప్రిల్ 1న ఇచ్చే జీతంతో ఈ పెరిగిన డీఏ ఉద్యోగుల చేతికి అందనుంది. ఉద్యోగులకు గతేడాది జూలై నుంచి పెరిగిన డీఏ చెల్లించాల్సి ఉంది. అప్పట్నుంచి ఇవ్వాల్సిన బకాయిలను ప్రభుత్వం ఉద్యోగుల జీపీఎఫ్ ఖాతాలో జమ చేయనుంది. పెరిగిన డీఏ చెల్లింపులకు సంబంధించిన ఫైలును ఈ నెల 7న  రాష్ట్ర కేబినెట్ ఆమోదించింది. 3.144 శాతం డీఏ పెంపునకు గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. కానీ నారాయణఖేడ్ ఉప ఎన్నిక కోడ్ అమల్లో ఉండటంతో ఫైలును పెండింగ్‌లో ఉంచింది.

ఇటీవలే ఆర్థిక శాఖకు చేరిన ఈ ఫైలు అధికారుల పరిశీలనలో ఉంది. మార్చి 1న ఇచ్చే జీతాలకు సంబంధించిన బిల్లులన్నీ ఈ నెల 20 వరకే సిద్ధమయ్యాయి. కానీ అప్పటికీ ఫైలుకు క్లియరెన్స్ రాకపోవటంతో ఉత్తర్వుల జారీ నిలిచిపోయింది. దీంతో ఉద్యోగులు నిరాశపడ్డారు. దీంతో వచ్చేనెల నుంచి పెరిగిన డీఏ వర్తింపజేసేందుకు వీలుగా మరో వారం పది రోజుల్లో ఉత్తర్వులు జారీ చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. పెరిగిన డీఏ చెల్లింపులకు ప్రతి నెలా రూ.80 కోట్లు అవసరమవుతాయని ఆర్థిక శాఖ అంచనా వేసింది. జూలై నుంచి ఇప్పటివరకు దాదాపు రూ.640 కోట్ల డీఏ బకాయిలు చెల్లించాల్సి ఉంది. ఉద్యోగులకు పెరిగిన డీఏ తరహాలోనే పెన్షనర్లకు కరువు భృతి(డీఆర్)ని చెల్లించాల్సి ఉంది. ఈ రెండు జీవోలను వేర్వేరుగా జారీ చేయనున్నారు. పెన్షనర్లకు, కొత్తగా చేరిన ఉద్యోగులకు జీపీఎఫ్ ఖాతాలు లేకపోవటంతో డీఏ బకాయిలను వీరికి నగదు రూపంలోనే చెల్లించనున్నారు.

Advertisement
Advertisement