పాల ప్రోత్సాహకం నిలుపుదల | Sakshi
Sakshi News home page

పాల ప్రోత్సాహకం నిలుపుదల

Published Sun, Apr 10 2016 3:49 AM

పాల ప్రోత్సాహకం నిలుపుదల

♦ రెండు నెలలుగా రైతులకు రూ.7 కోట్ల బకాయిలు
♦ నిధులు లేక తాత్కాలికంగా నిలిపేసిన విజయ డెయిరీ?
♦ ‘ప్రోత్సాహక’ నిధులపై స్పష్టతనివ్వని ప్రభుత్వం
♦ రాష్ట్ర బడ్జెట్లో ఆ ఊసే లేని పరిస్థితి
 
 సాక్షి, హైదరాబాద్: కరువులో రైతును అన్ని విధాలా ఆదుకుంటున్నామని... పాడి రైతుకు ప్రోత్సాహకం ఇస్తున్నామని ఇంటా బయట ఊదరగొడుతోన్న ప్రభుత్వం... ఆచరణలో అందుకు విరుద్ధంగా వ్యవహరిస్తోంది. తెలంగాణ విజయ డెయిరీకి పాలు పోసే రైతులకు లీటరుకు ఇస్తోన్న రూ. 4 ప్రోత్సాహకంపై నీళ్లు చల్లుతోంది. ఫిబ్రవరి 10 వరకు ప్రభుత్వం ప్రోత్సాహక బకాయిలు చెల్లించిందని... ఆ తర్వాత ఇప్పటివరకు రెండు నెలలపాటు రైతులకు చెల్లించాల్సిన రూ. 7 కోట్లు పెండింగ్‌లో ఉన్నాయని విజయ డెయిరీ అధికారులు చెబుతున్నారు. దీంతో ప్రోత్సాహక పథకాన్ని విజయ డెయిరీ తాత్కాలికంగా నిలిపివేసినట్లు తెలిసింది. దీంతో కరువులో పాడిపై ఆధారపడిన రైతులు రోడ్డున పడే పరిస్థితి నెలకొంది.

 సర్కారు మద్దతేదీ?
 విజయ డెయిరీకి పాలు పోసే రైతులకు లీటరుకు రూ. 4 నగదు ప్రోత్సాహం కల్పిస్తూ ప్రభుత్వం 2014 అక్టోబర్ 29న ఉత్తర్వులు జారీచేసింది. వర్షాలు లేకపోవడం, తీవ్ర కరువు నేపథ్యంలో రైతులు పాడిని ప్రత్యామ్నాయ జీవనంగా మలుచుకుంటున్నందున ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్లు సర్కారు పేర్కొంది. ఆ ప్రకారం 2014 నవంబర్ నుంచి విజయ డెయిరీకి పాలు పోసే రైతులందరికీ రూ. 4 లీటరుకు అదనంగా ఇస్తున్నారు. ఒక్కో లీటరుకు రూ. 28 చెల్లిస్తోంది.

ప్రోత్సాహకపు ఉత్తర్వు అమలుకాకముందు విజయ డెయిరీ 1.18 లక్షల లీటర్ల పాలను రైతుల నుంచి సేకరించగా.. ఉత్తర్వు తరువాత పాల సేకరణ అమాంతం 5.27 లక్షల లీటర్లకు పెరిగింది. అయితే గత ఏడాది అక్టోబర్ వరకు రైతులకు ప్రోత్సాహకపు సొమ్మును సక్రమంగానే చెల్లించిన ప్రభుత్వం ఆ తర్వాత నుంచి రైతుల బిల్లులను పెండింగ్‌లో పెట్టడం ప్రారంభించింది. అలా ఫిబ్రవరి 10 వరకు ఇచ్చి చేతులు దులుపుకుంది. దీంతో విజయ డెయిరీ తన వద్ద ఉన్న కోట్ల రూపాయల డిపాజిట్లను రైతులకు చెల్లిస్తూ వస్తోంది. ఆ తర్వాత ఇవ్వని పరిస్థితిలోకి డెయిరీ వెళ్లిపోయింది. ఏంచేయాలో అర్థంకాక బకాయిలు వచ్చే వరకు ప్రోత్సాహకాన్ని ఇవ్వలేమని రైతులకు చెబుతున్నట్లు తెలిసింది.
 
 బడ్జెట్లో నిధులపై అస్పష్టత...
 2015-16 బడ్జెట్లో పాల ప్రోత్సాహకానికి రూ. 12 కోట్లు కేటాయించిన ప్రభుత్వం... 2016-17 బడ్జెట్లో మాత్రం ప్రత్యేకంగా కేటాయించినట్లు ఎక్కడా పేర్కొనలేదు. అయితే ఇతర పద్దుల్లో కేటాయించామని చెబుతున్నా అది కూడా రూ. 16 కోట్లకు మించి లేదని అంటున్నారు. దీనిపై ఇంకా అస్పష్టత కొనసాగుతూనే ఉంది.

విజయ డెయిరీకి పాలు పోసే రైతులకే కాకుండా కరీంనగర్  డెయిరీ, మదర్ డెయిరీ సహా పలు ప్రైవేటు డెయిరీలకు పాలు పోసే రైతులకు కూడా ప్రోత్సాహకం ఇవ్వాలన్న డిమాండ్ ముందుకు వచ్చింది. దీనిపై చర్చించేందుకు ప్రభుత్వం ఒక మంత్రివర్గ ఉపసంఘాన్ని ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. కానీ ఇప్పటికీ దీనిపై ఉప సంఘం ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. ఒకవేళ విజయ డెయిరీతోపాటు పైన పేర్కొన్న ప్రైవేటు డెయిరీలకు ప్రోత్సాహకం ఇచ్చేట్లయితే రూ. 110 కోట్ల మేరకు నిధులు కేటాయించాల్సి ఉంటుందని అధికారులు తేల్చారు. ప్రస్తుతం కొద్దిపాటి నిధులే ఇవ్వని సర్కారు ఇంత పెద్ద మొత్తం నిధులు కేటాయిస్తుందా.. అన్న అనుమానాలు వస్తున్నాయి. కరువులో పాడి రైతును ఆదుకోవాల్సిన ప్రభుత్వం ఉపసంఘం పేరుతో ప్రోత్సాహకపు సొమ్ము విడుదల చేయకపోవడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

Advertisement

తప్పక చదవండి

Advertisement