టెలీకాలర్లే పెళ్లి కూతుళ్లు | Sakshi
Sakshi News home page

టెలీకాలర్లే పెళ్లి కూతుళ్లు

Published Wed, Feb 1 2017 12:47 AM

టెలీకాలర్లే పెళ్లి కూతుళ్లు - Sakshi

బోగస్‌ మ్యారేజ్‌ బ్యూరో దందా
ఇరువురిని అరెస్టు చేసిన సీసీఎస్‌


సిటీబ్యూరో: ప్రత్యేకంగా టెలికాలర్లను ఏర్పాటు చేసుకుని, వారినే పెళ్లికూతుళ్లుగా ‘మార్చి’ అవివాహితుల్ని మోసం చేస్తున్న బోగస్‌ మ్యారేజ్‌ బ్యూరో గుట్టును సీసీఎస్‌ ఆధీనంలోని మార్కెటింగ్‌ ఇంటెలిజెన్స్‌ టీమ్‌ అధికారులు రట్టు చేశారు. నిందితులు ఇద్దరిని అరెస్టు చేసి వారి నుంచి సెల్‌ఫోన్లు తదితరాలు స్వాధీనం చేసుకున్నట్లు డీసీపీ అవినాష్‌ మహంతి పేర్కొన్నారు. నగరానికి చెందిన ఎస్‌.వాసవి, వి.లక్ష్మీదేవి చిక్కడపల్లి ప్రాంతంలో ‘న్యూ లైఫ్‌’ మ్యారేజ్‌బ్యూరో పేరుతో సంస్థను నిర్వహిస్తున్నారు. వీరు గత ఏడాది నవంబర్‌లో ఓ పత్రికలో ప్రకటన ఇచ్చారు. ‘30 ఏళ్ల మహిళకు వరుడు కావాలని, ఆమెకు ఏడాది రూ.14 లక్షల జీతం వస్తుందని, సొంత అపార్ట్‌మెంట్‌తో పాటు 10 ఎకరాల పొలం, 10 ఎకరాల కొబ్బరితోట, రూ.ఆరు కోట్ల ఆస్తి’ ఉన్నట్లు అందులో పేర్కొన్నారు. మధ్య తరగతి కుటుంబానికి చెందిన వరుడు కావాలని ఆ ప్రకటనలో సూచించారు.

దీని పట్ల ఆకర్షితుడైన వనస్థలిపురం ప్రాంతానికి చెందిన ఎం.సునీల్‌ సదరు ప్రకటనలో ఉన్న ఫోన్‌ నెంబర్‌కు కాల్‌ చేయగా, నిర్వాహకులు చిక్కడపల్లిలోని తమ కార్యాలయానికి రమ్మని చెప్పి ఆ ప్రకటనకు సంబంధించి బోగస్‌ ప్రొఫైల్స్‌ చూపించారు. రిజిస్ట్రేషన్‌ పేరుతో రూ.3 వేలు కట్టించుకుని, ఆపై తమ వద్ద టెలీకాలర్‌గా పని చేస్తున్న ఉద్యోగినినే పెళ్ళికూతురంటూ సునీల్‌కు ఫోన్‌ చేయించారు. అతడితో పెళ్ళికూతురు మాదిరిగా మాట్లాడిన టెలీకాలర్‌ వచ్చే వారం కలుద్దామంటూ చెప్పింది. ఆ తరువాత ఎన్నిసార్లు ఫోన్లు చేసినా స్పందన లేకపోవడంతో మోసపోయానని గుర్తిచిన సునీల్‌ సైబర్‌ క్రైమ్‌ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఏసీపీ కేసీఎస్‌ రఘువీర్‌ ఆదేశాల మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేసిన ఇన్‌స్పెక్టర్‌ జి.శంకర్‌రావు మంగళవారం వాసవి, లక్ష్మీదేవిలను అరెస్టు చేశారు. వీరు ఇదే తరహాలో పత్రికల్లో ప్రకటలు ఇస్తూ పలువురిని మోసం చేశారన్నారు.  

Advertisement
Advertisement