ఇంకా 515 టీఎంసీల లోటు

28 Aug, 2017 03:09 IST|Sakshi
ఇంకా 515 టీఎంసీల లోటు
ఎన్ని వానలు కురుస్తున్నా నిండని ప్రాజెక్టులు  
- ఎగువ ప్రాజెక్టులనుంచి రాని నీరు  
ఇక ఈశాన్య రుతుపవనాలపైనే ఆశలు 
 
సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రంలో ప్రధాన ప్రాజెక్టులు ఆశించిన స్థాయిలో నీరులేక వెలవెలబోతున్నాయి. ఈ ఏడాది రాష్ట్రంలో నైరుతి రుతుపవనాల ప్రభావంతో అడపా దడపా భారీ వర్షాలు కురుస్తున్నా..వాటితో భారీ సాగునీటి ప్రాజెక్టులు నిండే పరిస్థితి కనిపించడంలేదు. గత పదిహేను రోజులుగా రాష్ట్రంలో చెప్పుకోదగ్గ స్థాయిలో వర్షాలు కురిసినా ప్రాజెక్టుల్లోకి ఆశించిన మేర ప్రవాహాలు రావడం లేదు. దానికితోడు ఎగువ రాష్ట్రాల ప్రాజెక్టుల నుంచి ఆశించినమేర నీరు రావడంలేదు. ప్రస్తుతం గోదావరి బేసిన్‌లోని ఒకట్రెండు ప్రాజెక్టులు మినహా ఎక్కడా పెద్దగా ప్రవాహాలు వచ్చి చేరలేదు. దీంతో ప్రాజెక్టులన్నీ వట్టిపోయే కనిపిస్తున్నాయి. వర్షాకాలం మొదలై మూడు నెలలు కావస్తున్నా ఇంకా కృష్ణా, గోదావరి బేసిన్‌ల పరిధిలో 515 టీఎంసీల మేర నీటి లోటు కనిపిస్తోంది. 
 
ఈశాన్య రుతుపవనాలే దిక్కు.. 
రాష్ట్రంలో ఏటా జూన్‌ నుంచి సెప్టెంబర్‌ వరకు నైరుతి రుతుపవనాల ప్రభావం ఎక్కువగా ఉంటుంది. ఈ సమయంలోనే ప్రాజెక్టుల్లోకి ఆశించిన స్థాయిలో నీరు వచ్చి చేరుతుంది. అయితే ఈ ఏడాది సరైన వర్షాలు కరువైన నేపథ్యంలో ఆ పరిస్థితి లేదు. జూన్‌ మొదట్లో, అలాగే ఈ నెలలో కురిసిన వర్షాలతో కొద్దిమేర గోదావరి బేసిన్‌లో నీరొచ్చింది. నీటి ప్రవాహాలు సైతం ఒకట్రెండు ప్రాజెక్టులకే పరిమితమయ్యాయి. రాష్ట్రంలో ఈ సీజన్‌లో గోదావరి బేసిన్‌లోకి మొత్తంగా 35 టీఎంసీల నీరు వచ్చి చేరగా, అందులో 18 టీఎంసీల మేర ఎస్సారెస్పీలోకిరాగా, 6.5 టీఎంసీల మేర కడెం, మరో 6 టీఎంసీల మేర ఎల్లంపల్లి ప్రాజెక్టుకు వచ్చింది.

మిగతా నీరు చిన్నా, చితక జలాశయాల్లోకి చేరింది. ఇక కృష్ణా బేసిన్‌లో అయితే కేవలం 21 టీఎంసీలు మాత్రమే కొత్త నీరు వచ్చింది. ఇందులో ఒక్క జూరాలకే 16 టీఎంసీల మేర నీళ్లొచ్చాయి. అది మినహా ఎక్కడా పెద్దగా ప్రవాహాలు లేకపోవడంతో రెండు బేసిన్‌ల పరిధిలో ఇంకా 515 టీఎంసీల నీటి లోటు ఉంది. గత మూడు, నాలుగు రోజులుగా రాష్ట్రంలో వర్షాలు కురుస్తున్నా, స్థానికంగా ఉన్న చెరువులు, కుంటలు నిండేందుకే సరిపోతోంది. ఇక ఎల్లంపల్లి ప్రాజెక్టుకు 14,134 క్యూసెక్కుల మేర గరిష్ట ప్రవాహాలు వస్తుండగా, సింగూరుకు 8,380, కడెం ప్రాజెక్టుకు 4,227 క్యూసెక్కుల మేర ప్రవాహం వస్తోంది.

ఇది మినహా ఎక్కడా చెప్పుకోదగ్గ ప్రవాహాలు లేకపోవడంతో ప్రాజెక్టులు ఇప్పట్లో నిండేలా లేవు. నైరుతి రుతుపవనాల ప్రభావం పూర్తిగా సన్నగిల్లుతున్న నేపథ్యంలో తర్వాతి ఆశలన్నీ ఈశాన్య రుతుపవనాలపై ఉన్నాయి. కానీ వీటి ప్రభావం ఏపీలోని నెల్లూరు, అనంతపురం, తెలంగాణలో ఖమ్మం, మెదక్‌ జిల్లాలో మాత్రమే అధికంగా ఉంటుంది. 2009లో ఈశాన్య రుతుపవనాల కారణంగానే విస్తృతంగా వర్షాలు కురవడంతో వేదవతి, తుంగభద్రలకు విపరీతమైన వరద రావడం, అక్కడినుంచి దిగువకు నీరు చేరడంతో శ్రీశైలం నిండి వరద ఉధృత రూపం దాల్చింది. ఆ సమయంలో ఈశాన్య రుతుపవనాల ప్రభావం సెప్టెంబర్‌ చివరి నుంచి అక్టోబర్‌ మొదటి వారం వరకు కొనసాగడంతో భారీ వరదలు వచ్చాయి. ఇప్పుడు కూడా సెప్టెంబర్‌లో ప్రవేశించే ఈశాన్య రుతుపవనాలపై భారం వేయాల్సి వస్తోంది.
Read latest Hyderabad News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా