Sakshi News home page

ప్రజల దృష్టిని మళ్లించేందుకు కుయుక్తులు : ధర్మాన ప్రసాదరావు

Published Fri, Aug 26 2016 1:35 AM

ప్రజల దృష్టిని మళ్లించేందుకు కుయుక్తులు : ధర్మాన ప్రసాదరావు

వైఎస్సార్‌సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ధర్మాన ప్రసాదరావు స్పష్టీకరణ
సాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం: రెండున్నరేళ్ల పాలనలో టీడీపీ ప్రభుత్వం చేసిందేమీ లేదన్న వాస్తవాన్ని ప్రజలు గ్రహించారని వైఎస్సార్‌సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ధర్మాన ప్రసాదరావు చెప్పారు. అందుకే ప్రజల దృష్టి మళ్లించేందుకు అధికార పక్షం కుయుక్తులకు పాల్పడుతోందని ధ్వజమెత్తారు. బుధవారం జరిగిన శ్రీకాకుళం జిల్లా వైఎస్సార్‌సీపీ విస్తృతస్థాయి సమావేశంలో తాను మాట్లాడిన మాటలను కొన్ని పత్రికలు వక్రీకరించాయని మండిపడ్డారు. నియోజకవర్గాల వారీగా అక్కడున్న పరిస్థితులకు తగినట్లుగా పార్టీని ఎలా బలోపేతం చేసుకోవాలో పార్టీ కార్యకర్తలకు వివరించానన్నారు.

తన వ్యాఖ్యలను అర్థం చేసుకోకుండా, వాటిని మరో అర్థం వచ్చేలా ఆపాదించి వార్తలు రాయడం సమంజసం కాదన్నారు. ధర్మాన గురువారం శ్రీకాకుళంలోని పార్టీ జిల్లా కార్యాలయంలో విలేకరుల సమావేశంలో మాట్లాడారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి కుటుంబంతో తనకు మూడు దశాబ్దాలుగా అనుబంధం ఉందని చెప్పారు. తనను వైఎస్ కుటుంబానికి దూరం చేసే కుట్ర జరుగుతోందని ఆరోపించారు. వైఎస్ కుటుంబంతో తనకున్న అనుబంధాన్ని కుయుక్తులతో తెంచేయాలనుకుంటే అది వృథా ప్రయాసే తప్ప మరొకటి కాదని అన్నారు. తనపై ఇలాంటి కుట్రలకు పాల్పడడం కొత్తేమీ కాదని పేర్కొన్నారు. తమ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిని ముఖ్యమంత్రి చేసేంత వరకూ ప్రజా పోరాటాలు కొనసాగిస్తామని స్పష్టం చేశారు. జగన్ ముఖ్యమంత్రి అయితే ఈ రెండున్నరేళ్లలో శ్రీకాకుళం జిల్లాకు ఎంతో మేలు జరిగేదని పేర్కొన్నారు. అర్థంపర్థం లేని అపోహలు సృష్టించి ప్రతిపక్షాన్ని బలహీన పర్చాలనుకుంటే దానివల్ల ప్రయోజనం లేదన్నారు.
 
జగన్‌లో వైఎస్సార్‌ను చూసుకుంటున్నాం..:
అభివృద్ధిలో అట్టడుగున ఉన్న శ్రీకాకుళం జిల్లాను ప్రగతి పథంలో నడిపించేందుకు కృషి చేసిన దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డిని ఇప్పుడు తమ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌లో చూసుకుంటున్నామని ధర్మాన పునరుద్ఘాటించారు.

Advertisement

తప్పక చదవండి

Advertisement