నీతి ఆయోగ్‌తో స్థానిక సంస్థల నిర్వీర్యం | Sakshi
Sakshi News home page

నీతి ఆయోగ్‌తో స్థానిక సంస్థల నిర్వీర్యం

Published Tue, Sep 20 2016 1:24 AM

నీతి ఆయోగ్‌తో స్థానిక సంస్థల నిర్వీర్యం - Sakshi

ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి దిగ్విజయ్ ఆరోపణ
- నిధులు, అధికారాలను హరిస్తోందని ధ్వజం
- కార్పొరేట్ శక్తులకే పాలన పరిమితం చేస్తోందని మండిపాటు
- రాష్ట్రంలో భవిష్యత్తు కాంగ్రెస్‌దే: జానా, షబ్బీర్
- కాంగ్రెస్ స్థానిక సంస్థల ప్రతినిధులకు శిక్షణ ప్రారంభం
 
 సాక్షి, హైదరాబాద్: నీతి ఆయోగ్ ఏర్పాటు ద్వారా దేశంలోని అన్ని స్థానిక సంస్థలను కేంద్ర ప్రభుత్వం నిర్వీర్యం చేసిందని ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి, రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి దిగ్విజయ్‌సింగ్ ఆరోపించారు. స్థానిక సంస్థల నిధులు, అధికారాలను హరిస్తోందని దుయ్యబట్టారు. ప్రజల కోసం కాంగ్రెస్ పాలన అందిస్తే బీజేపీ కార్పొరేట్ శక్తులకు పాలనను పరిమితం చేసిందని మండిపడ్డారు. ఉపాధి హామీ పథకంలో అధికారులకే పూర్తి అధికారాలను ఇచ్చి ప్రజాప్రతినిధుల హక్కులకు గండికొడుతోందని విమర్శించారు. రాష్ట్రంలోని జెడ్పీటీసీలు, ఎంపీటీసీలు, మార్కెట్ కమిటీల మాజీ చైర్మన్లు, పీఏసీఎస్ చైర్మన్లకు టీపీసీసీ ఆధ్వర్యంలో ఇక్కడ ఏర్పాటు చేసిన శిక్షణా శిబిరాన్ని జ్యోతి వెలిగించి సోమవారం ఆయన ప్రారంభించారు.

ఈ సందర్భంగా దిగ్విజయ్ మాట్లాడుతూ స్థానిక సంస్థల అధికారాల కోసం తమ పార్టీ పోరాటం చేస్తుంద న్నారు. మార్కెట్ యార్డుల్లో ధరల నిర్ణయాధికారం రైతులకే ఉండాలని దిగ్విజయ్‌సింగ్ కోరారు. గ్రామీణ ప్రజా ప్రతినిధుల అధికారాలు, హక్కులు, నిధులు వంటివాటిపై టీపీసీసీ ప్రత్యేకంగా ఒక బుక్‌లెట్‌ను విడుదల చేస్తుందని చెప్పారు. ప్రధాని మోదీ హైదరాబాద్‌కు వచ్చి సీఎం కేసీఆర్‌ను పొగిడితే, బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా వచ్చి కేసీఆర్‌ను తిట్టి వెళ్లారని ఎద్దేవా చేశారు. దేశాన్ని విచ్ఛిన్నం చేసేందుకు బీజేపీ కుట్రలకు పాల్పడుతోందని దిగ్విజయ్ దుయ్యబట్టారు. రాష్ట్రానికి కేంద్రం రూ. 90 వేల కోట్లు ఇచ్చినట్లు అమిత్ షా చెప్పారని, ఆ నిధులు ఎక్కడికి పోయాయని ప్రశ్నించారు.

 ప్రధాని హామీలు అమలు కావట్లేదు: పుదుచ్చేరి సీఎం నారాయణస్వామి
 నీతీ ఆయోగ్ ద్వారా స్థానిక సంస్థలకు కేంద్ర ప్రభుత్వం నిధుల్లేకుండా చేసిందని పుదుచ్చేరి ముఖ్యమంత్రి నారాయణస్వామి విమర్శించా రు. స్థానిక సంస్థలకు నేరుగా నిధులు ఇస్తామని కేంద్రం చెబుతున్నా ఆచరణలో అమలు కావడంలేదన్నారు. రాష్ట్రాల్లో పర్యటనల సందర్భంగా ప్రధాని ఇస్తున్న వాగ్దానాలూ అమలు కావడం లేదన్నారు
 
 కేంద్ర నిధులతో ఎమ్మెల్యేలను కొంటున్నారా?: ఉత్తమ్
 రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన రూ. 90 వేల కోట్లతోనే ప్రతిపక్ష పార్టీల ఎమ్మెల్యేలను టీఆర్‌ఎస్ కొంటున్నట్టున్నదని టీపీసీసీ అధ్యక్షుడు ఎన్.ఉత్తమ్‌కుమార్‌రెడ్డి పేర్కొన్నారు. ప్రతిపక్ష ఎమ్మెల్యేలను కొంటూ ప్రజాస్వామ్యాన్ని టీఆర్‌ఎస్ భ్రష్టు పట్టిస్తోందని దుయ్యబట్టారు. 2019లో తమ పార్టీ అధికారంలోకి తప్పకుండా వస్తుందని, మిత్తీ(వడ్డీ)తో సహా బదులు తీర్చుకుంటామని ఉత్తమ్ హెచ్చరించారు. రాష్ట్రంలో కేసీఆర్ కుటుంబం తప్ప మిగిలిన ఏ ఒక్కరూ సంతోషంగా లేరని చెప్పారు. స్థానిక సంస్థల విధులు, నిధుల గురించి అవగాహన పెంచుకోవాలని, కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేయాలని ప్రతిపక్ష నేత జానారెడ్డి కోరారు. రాష్ట్రంలోని స్థానిక సంస్థలకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుంచి ఒక్క పైసా రాలేదని శాసనమండలిలో ప్రతిపక్ష నేత షబ్బీర్ అలీ విమర్శించారు. వినాశకాలే విపరీత బుద్ధి అన్నట్టుగా పోయేకాలం వచ్చినందుకే ఇలాంటి వాటికి పాల్పడుతున్నాడని విమర్శించారు. టీపీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు మల్లు భట్టివిక్రమార్క మాట్లాడుతూ లక్ష్యాలు, సిద్ధాంతాలను పక్కనబెట్టి అధికారం, పైరవీల కోసం కొందరు పార్టీలు మారుతున్నారని విమర్శించారు.

Advertisement
Advertisement