గ్రూప్-2 పోస్టులకు జిల్లాల చిక్కు! | Sakshi
Sakshi News home page

గ్రూప్-2 పోస్టులకు జిల్లాల చిక్కు!

Published Mon, Aug 22 2016 3:41 AM

గ్రూప్-2 పోస్టులకు జిల్లాల చిక్కు! - Sakshi

జోనల్ వ్యవస్థ రద్దు నిర్ణయంతో కొత్త సమస్యలు
 

 సాక్షి, హైదరాబాద్ : జోనల్ విధానం ఉన్న గ్రూప్-2 వంటి పోస్టుల భర్తీకి కొత్త చిక్కులు మొదలయ్యాయి. కొత్త జిల్లాల ఏర్పాటులో భాగంగా జోనల్ వ్యవస్థ రద్దు నిర్ణయం  భర్తీకి ఆటంకంగా మారనుంది. ఇప్పటికే పోస్టులు తక్కువగా ఉన్నాయన్న కారణంతో 439 గ్రూప్-2 కొలువులకు గత ఏప్రిల్ 24, 25 తేదీల్లో జరగాల్సిన రాత పరీక్షలను ప్రభుత్వం వాయిదా వేయించింది. గతనెల 23న మరో 593 గ్రూప్-2 పోస్టుల భర్తీకి ఆమోదం తెలుపుతూ ఉత్తర్వులిచ్చింది. దీంతో పోస్టుల సంఖ్య 1,032కి పెరిగింది. సప్లిమెంట్ నోటిఫికేషన్ వస్తుందని, త్వరలోనే రాత పరీక్షను టీఎస్‌పీఎస్సీ ప్రకటిస్తుందని నిరుద్యోగులంతా ఎదురుచూస్తున్నారు. అకస్మాత్తుగా సీఎం కేసీఆర్ జోనల్ వ్యవస్థ రద్దు నిర్ణయాన్ని ప్రకటించారు. దీంతో గ్రూప్-2 పోస్టుల భర్తీపై వారిలో మళ్లీ ఆందోళన మొదలైంది.

 పోస్టుల భర్తీలో జాప్యం తప్పదా?
 ప్రస్తుతం గ్రూప్-2 పోస్టులను ఇప్పటివరకు ఉన్న నిబంధనల ప్రకారం భర్తీ చేయాలా? లేదా కొత్త జిల్లాల ఏర్పాటు, జోనల్ వ్యవస్థ రద్దు తర్వాత చేయాలా? అన్నది తేలాల్సి ఉంది. కొత్త జిల్లాల ఏర్పాటు, జోనల్ వ్యవస్థ రద్దు, రాష్ట్ర కేడర్, జిల్లా కేడర్ పోస్టుల విభజన తర్వాతే ప్రభుత్వం పోస్టుల భర్తీకి ముందుకెళ్లే ఆలోచనల్లో ఉన్నట్లు తెలిసింది.జిల్లాల ఏర్పా టు, జోనల్ వ్యవస్థ రద్దుకు ఎంతలేదన్న మరో నాలుగైదు నెలల సమయం పట్టనుంది. ఆ తర్వాత పోస్టుల స్వభావాన్ని బట్టి జిల్లా, రాష్ట్ర స్థాయి పోస్టులుగా వర్గీకరించాలి. ఇందుకు ఇంకొంత సమయం పట్టే అవకాశం ఉంది. గ్రూప్-2కు మాత్రమే కాదు.. ఇప్పటికే నోటిఫికేషన్ జారీ చేసిన 251 వెటర్నరీ అసిస్టెంట్ సర్జన్ పోస్టుల భర్తీకి చిక్కులు తప్పేలా లేవు.

లెక్చరర్ పోస్టుల భర్తీలో కూడా..
జోనల్ వ్యవస్థ రద్దయితే జూనియర్ లెక్చరర్, డైట్ లెక్చరర్, డిగ్రీ కాలేజీ లెక్చరర్, పాలిటెక్నిక్ లెక్చరర్ సబ్ ఇన్‌స్పెక్టర్ వంటి పోస్టుల భర్తీలో అనేక సమస్యలు తలెత్తనున్నాయి. ప్రస్తుతం పని చేస్తున్న కాంట్రాక్టు లెక్చరర్ల సర్వీసులను రెగ్యులరైజ్ చేయగా మిగిలే దాదాపు 2 వేల జూనియర్, డిగ్రీ, పాలిటెక్నిక్ లెక్చరర్ పోస్టుల భర్తీలో తంటాలు తప్పవు. జూనియల్ లెక్చరర్ వంటి పోస్టులను జిల్లా కేడర్ పోస్టులుగా చేస్తే.. ఆ పోస్టులకు ఆ జిల్లాకు చెందిన వారే అర్హులు అవుతారు. దీంతో ఇతర జిల్లాలవారికి నష్టం తప్పదు. పైగా ప్రతి జిల్లాకు పదుల సంఖ్యకు మించి పోస్టులు రావు. అలాంటపుడు వచ్చే ఆ కొద్ది పోస్టులకు ఆయా జిల్లాలోని నిరుద్యోగులంతా పోటీ పడాల్సి వస్తుంది.
 
రాష్ట్ర స్థాయి పోస్టుల భర్తీ ఎలా?
ఉద్యోగ సంఘాలు పేర్కొంటున్నట్లు రాష్ట్రంలో జిల్లా, రాష్ట్ర కేడర్ పోస్టులే ఉండాలన్నది ప్రధాన నిర్ణయం. గ్రూప్-1తోపాటు గ్రూప్-2లోని కొన్ని కేటగిరీల పోస్టులను రాష్ట్ర కేడర్‌గా చేసే అవకాశం ఉంటుందని ఉద్యోగ సంఘాలు చెబుతున్నాయి. వాటిని పూర్తిగా రాష్ట్ర స్థాయిలో ఓపెన్ కేటగిరీ కింద భర్తీ చేస్తారా? అందులోనూ ఓపెన్ కేటగిరీ, లోకల్ కేటగిరీ పోస్టులుగా విభజించేలా నిబంధనను పొందుపరుస్తారా? అన్న విషయంలో స్పష్టత లేదు. కొందరు ఉద్యోగ సంఘాల నేతలు.. రాష్ట్ర స్థాయి పోస్టుల్లో 15 శాతం ఓపెన్ కేటగిరీ, కింద 85 శాతం పోస్టులు లోకల్ కేటగిరీ కింద భర్తీ చేస్తారని చెబుతున్నారు. మరికొందరు మాత్రం.. రాష్ట్రస్థాయి పోస్టులన్నింటినీ ఓపెన్ కేటగిరీలోనే భర్తీ చేస్తారంటున్నారు. అదే జరిగితే చాలా నష్టం వాటిల్లుతుంది. ఇతర రాష్ట్రాల వారికి 100 శాతం పోస్టుల్లో పోటీ పడే అవకాశం కల్పించినట్లవుతుంది. దీంతో రాష్ట్రంలోని  నిరుద్యోగులకు  అన్యాయం జరుగుతుంది.

Advertisement
Advertisement