స్కూళ్ల రేషనలైజేషన్‌ వద్దు: కొనగాల | Sakshi
Sakshi News home page

స్కూళ్ల రేషనలైజేషన్‌ వద్దు: కొనగాల

Published Thu, May 11 2017 2:16 AM

స్కూళ్ల రేషనలైజేషన్‌ వద్దు: కొనగాల

సాక్షి, హైదరాబాద్‌: టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం రేషనలైజేషన్‌ పేరిట 4,637 ప్రభుత్వ పాఠశాలలను మూసివేయాలని తీసుకున్న నిర్ణయాన్ని వెంటనే ఉపసంహరించుకోవాలని పీసీసీ అధికార ప్రతినిధి కొనగాల మహేశ్‌ డిమాండ్‌ చేశారు. 20 మంది విద్యార్థుల కంటే తక్కువ వున్న పాఠశాలలను మూసివేయాలని ప్రభుత్వం నిర్ణయించడం దుర్మార్గమన్నారు. క్రమక్రమంగా ప్రభుత్వ పాఠశాలలు మూసివేయలనే కుట్ర జరుగుతోందని, కార్పొరేట్‌ స్కూళ్లు ఇచ్చే కమీషన్ల కోసమే రేషనలైజేషన్‌ చేపడుతున్నారని బుధవారం ఆరోపించారు.

విద్యార్థుల సంఖ్యను పెంచేలా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాల్సింది పోయి స్కూళ్లను మూసివేయలనుకోవడం సరికాదని హితవుపలికారు. రేషనలైజేషన్‌ ప్రక్రియకు కాంగ్రెస్‌ వ్యతిరేకమని, గతంలోనే ఈ నిర్ణయాన్ని కాంగ్రెస్‌ అడ్డుకుందని తెలిపారు. అయినా కేసీఆర్‌ ప్రభుత్వానికి బుద్ధి రాలేదని ధ్వజమెత్తారు. స్కూళ్లను మూసేయాలని ప్రభుత్వం భావిస్తే దాన్ని అడ్డుకుంటామని చెప్పారు. ఈ పాఠశాలలను మూసేయడం వల్ల ఉపాధ్యాయ ఉద్యోగాలు తగ్గి, నిరుద్యోగుల సంఖ్య పెరుగుతుందన్నారు. ప్రభుత్వ పాఠశాలల స్థలాన్ని డబుల్‌ బెడ్రూం పథకానికి వాడుకునే కుట్ర జరుగుతోందని విమర్శించారు.

Advertisement
Advertisement