కలత వద్దు | Sakshi
Sakshi News home page

కలత వద్దు

Published Fri, Dec 5 2014 12:13 AM

కలత వద్దు

పాలక మండలి లేని లోటు కనిపించనివ్వం
ప్రజల్లో నమ్మకం కలిగిస్తాం
కింది స్థాయి అధికారులు బాధ్యతగా పనిచేయాలి
ఇక రోజూ సాయంత్రం 4 గంటల నుంచి ఫిర్యాదుల స్వీకరణ
జీహెచ్‌ఎంసీ ప్రత్యేకాధికారి సోమేశ్ కుమార్ వెల్లడి

 
సిటీబ్యూరో:‘పాలకమండలి లేదని కలత చెందవద్దు. ప్రజా సమస్యలు పరిష్కరిస్తా. అదే మా తొలి ప్రాధాన్యం. మాపై నమ్మకం కలిగేలా పనిచేస్తాం.కింది స్థాయి అధికారులు కూడా అదే విధంగా స్పందించాలి’ అని జీహెచ్‌ఎంసీ కమిషనర్, ప్రత్యేకాధికారి సోమేశ్‌కుమార్  అన్నారు. నిత్యం సాయంత్రం 4 గంటల నుంచి గంట సేపు ప్రజల నుంచి ఫిర్యాదులు స్వీకరిస్తామన్నారు. ప్రతి సోమవారం ప్రజావాణి కార్యక్రమాన్ని కొనసాగిస్తామన్నారు. రానున్న రోజుల్లో జీహెచ్‌ఎంసీ తరఫున చేపట్టే అభివృద్ధి కార్యక్రమాల వివరాలను ఆయన గురువారం విలేకరులకు వివరించారు. అవేంటంటే...
 
జవాబుదారీతనం..

 ప్రతి సోమవారం ‘ప్రజావాణి’లో అందే ఫిర్యాదులతో పాటు ప్రజలు ఏ రూపంలో తమ ఇబ్బందులు తెలియజేసినా పరిష్కరించేందుకు అధికారులు మరింత బాధ్యతాయుతంగా పనిచేయాలి. జవాబుదారీతనం ఉండాలి.ఫిర్యాదులు ఎస్‌ఎంఎస్ ద్వారా తెలియజేసినా... కాల్‌సెంటర్(040-21 11 11 11)కు తెలిపినా... నేరుగా వినతిపత్రం అందజేసినా సర్కిల్ స్థాయిలోనే పరిష్కారానికి చర్యలు చేపడతాం. ప్రతి ఫిర్యాదునూ నిర్ణీత వ్యవధిలోగా పరిష్కరిస్తాం.  

రహదారి భద్రత..

దెబ్బతిన్న రహదారులను వెంటనే మరమ్మతులు చేయడంతో పాటు ఆ మార్గాల్లో ఎక్స్‌ప్రెస్ కారిడార్లు, సీఆర్‌డీపీ, తదితర పథకాల్లో చేపట్టిన రోడ్ల నిర్మాణం పూర్తి చేస్తాం. రోడ్ల కారణంగా ఎవరికీ ప్రమాదం జరుగకుండా చర్యలు చేపడతాం.
 
నాలాల ఆధునికీకరణ
 

ఇప్పటికే మొదలైన నాలాల ఆధునీకరణ పనులను వీలైనన్ని ప్రాంతాల్లో త్వరితంగా పూర్తి చేస్తాం. నాలాల భూముల్లో ఆక్రమణల తొలగింపుతో పాటు పనులు త్వరితంగా జరిగేందుకు ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేస్తాం.
 
పారిశుద్ధ్యం


పారిశుద్ధ్యాన్ని మెరుగుపరుస్తాం. జీవవైవిధ్య విభాగం ఆధ్వర్యంలో సర్వే జరిపి.. అవకాశం ఉన్న ప్రాంతాల్లో మొక్కలు నాటుతాం. ప్రభుత్వ సంస్థల్లోనూ మొక్కలు నాటేలా చర్యలు చేపడతాం.
 
మరుగుదొడ్లు

 
ప్రధాన మార్గాల్లో పురుషుల కోసం వెయ్యి యూరినల్స్‌తో పాటు ఎంపిక చేసిన ప్రాంతాల్లో మహిళల కోసం వంద ‘షీ టాయ్‌లెట్స్’ నిర్మిస్తాం. వీటితో పాటు బాలికలు ఉన్న వంద ప్రభుత్వ, ఎయిడెడ్ పాఠశాలల్లో మరుగుదొడ్ల నిర్మాణం, నిర్వహణకు చర్యలు.
 
ఇంకా ఏంటంటే...

వెయ్యి ఎఫ్‌ఓబీలు, మరో 50 కేంద్రాల ద్వారా రూ. 5కే భోజనం, 36 శ్మశానవాటికల అభివృద్ధి, 36 చెరువుల సుందరీకరణను తొలిదశలో అమలు చేస్తామన్నారు. వారం రోజుల్లోగా ఆర్ అండ్ బీ రహదారులు  జీహెచ్‌ఎంసీ అజమాయిషీలోకి రానున్నాయని తెలిపారు. తమ పరిధిలోకి రాగానే ప్రధాన మార్గాల్లోని పనులు చేపడతామన్నారు. రద్దీ ఎక్కువగా ఉన్న మార్గాల్లో ఎక్స్‌ప్రెస్ వేలు ఏర్పాటు చేస్తామన్నారు. తక్కువ భూసేకరణ, ఉన్న సదుపాయాలకు ఆటంకాల్లేకుండా ఈ మార్గాలను అభివృద్ధిపరచేందుకు అనువైన విధానాల కోసం కన్సల్టెంట్ల అధ్యయన నివేదికలు ఆహ్వానిస్తామన్నారు.
 
నగరమంతా ఎల్‌ఈడీలు

నగరంలోని అన్ని మార్గాల్లో ఎల్‌ఈడీ వీధి దీపాలు ఏర్పాటు చేయనున్నారు. స్టాండింగ్ కమిటీ ఉన్నప్పుడు దీనిని వ్యతిరేకించిన విషయం తెలిసిందే. ప్రస్తుతం స్టాండింగ్ కమిటీ అధికారాలు కూడా రావడంతో స్పెషల్ ఆఫీసర్‌గా ఎల్‌ఈడీ వీధిదీపాల ఏర్పాటుకు సోమేశ్‌కుమార్ సిద్ధమయ్యారు. ఈ పనులు మొదలయ్యాయన్నారు.
 
బాధ్యతల వికేంద్రీకరణ

పనులు త్వరితగతినపూర్తి చేసేందుకు ఒక్కో అధికారికి ఐదారు అంశాలకు సంబంధించిన బాధ్యత లుఅప్పగించనున్నట్లు తెలిపారు. తన బాధ్యత మరింత పెరిగిందని, దీన్ని సమర్థంగా నిర్వహించడం పెద్ద సవాలేనని అన్నారు. ప్రజలు, ప్రజాప్రతినిధులు సహకారంతో అందరినీ కలుపుకొని సమర్థంగా విధులు నిర్వహిస్తానని సోమేశ్‌కుమార్ చెప్పారు.
 
 

Advertisement
Advertisement