జాడ లేని చిన్న నోటు | Sakshi
Sakshi News home page

జాడ లేని చిన్న నోటు

Published Sat, Dec 10 2016 3:01 AM

జాడ లేని చిన్న నోటు - Sakshi

- వచ్చిన కరెన్సీ రూ.15,902 కోట్లు...  అందులో 95.84 శాతం పెద్ద నోట్లే
- జనం జమ చేసింది రూ.55 వేల కోట్లు

సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణలో చిన్న నోట్ల కొరత రోజురోజుకు తీవ్రతరమవుతోంది. మార్కెట్లో నగదు కొరతకు తోడు కొత్తగా చలామణిలోకి వచ్చిన రూ.2,000 నోట్ల కారణంగా చిన్న నోట్లకు డిమాండ్‌ గణనీయంగా పెరగడం తెలిసిందే. రాష్ట్ర ప్రభుత్వం పదేపదే విజ్ఞప్తి చేసినా రిజర్వు బ్యాంక్‌ నుంచి సరిపడేంత నగదు రాలేదు. పైపెచ్చు వచ్చిన కొద్దిపాటి కరెన్సీలో చిన్న నోట్లు లేకపోవటం కొత్త సంక్షోభానికి దారితీస్తోంది. నవంబర్‌ 8న కేంద్రం పెద్ద నోట్లను రద్దు చేసిన నాటినుంచి మొదలుకుని శుక్రవారం వరకు తెలంగాణకు ఆర్‌బీఐ రూ.15,902 కోట్ల విలువైన కరెన్సీని పంపింది.

ఇందులో అత్యధికం, అంటే రూ.15,241 కోట్ల మేరకు రెండు వేల రూపాయల నోట్లే వచ్చాయి. రూ.240 కోట్ల విలువైన కొత్త 500 నోట్లు, రూ.376 కోట్ల విలువైన వంద నోట్లు, రూ.22 కోట్ల విలువైన 50 రూపాయల నోటు, రూ.20 కోట్ల విలువైన 20 రూపాయల నోటు, రూ.2.19 కోట్ల విలువైన పది రూపాయల నోట్లు వచ్చాయి. అంటే వచ్చిన కరెన్సీలో ఏకంగా 95.84 శాతం పెద్ద నోట్లేనన్నమాట! 4.16 శాతమే చిన్న నోట్లు వచ్చాయి. దీంతో చిరు వ్యాపారులు, కార్మి కులు, కూలీలు, రైతులు, నిరుపేదలందరికీ నిత్యావస రంగా మారిన చిన్న నోట్లకు రాష్ట్రంలో తీవ్ర కొరత నెలకొంది. తెలంగాణలోని బ్యాంకులన్నింటా ఇప్పటి వరకు దాదాపు రూ.55 వేల కోట్ల నగదు జమైనట్లు ఆర్‌బీఐ వర్గాలు చెబుతున్నాయి. అందులో కనీసం మూడో వంతు నగదును కూడా మార్పిడి చేయకపోవడంతో ప్రజల ఇబ్బందులు యథాతథంగా కొనసాగుతున్నాయి.

రెట్టింపైన డిజిటల్‌ లావాదేవీలు
నగదు కొరత నేపథ్యంలో తెలంగాణ నగదురహిత లావాదేవీల బాట పట్టింది. ఇంటర్‌నెట్, ఆన్‌లైన్‌ లావాదేవీలు గతంతో పోలిస్తే రెట్టింపైనట్టు ప్రభుత్వం అంచనా వేసింది. అయితే మొత్తం లావాదేవీల్లో ఇవి ఇప్పటికీ పది శాతమే! మొబైల్‌ అప్లికేషన్లు, మొబైల్‌ ఆధారంగా లావాదేవీలు నిర్వహించే పేటీఎం యాప్‌ వాడకం బాగా పెరిగింది. దాని వినియోగదారుల సంఖ్య 14 లక్షల నుంచి 40 లక్షలకు చేరిందని పేటీఎం ప్రతినిధులు ఇటీవలæ ప్రభుత్వానికి నివేదించారు. మొబైల్‌ బ్యాంకింగ్, కార్డు ఆధారిత చెల్లింపులు, చెక్కు లావాదేవీలను పెంచే దిశగా ప్రభుత్వం చర్యలను ముమ్మరం చేసింది.

స్వైపింగ్‌ మిషన్లకు గిరాకీ
రాష్ట్రంలో స్వైపింగ్‌ మిషన్ల వాడకం బాగా పెరి గింది. అక్టోబర్‌ 30 నాటికి రాష్ట్రంలో 34,677 స్వైపింగ్‌ మిషన్లుండగా ఇప్పుడు 50,951కి పెరిగినట్లు రాష్ట్ర స్థాయి బ్యాంకర్ల సమితి తాజాగా ప్రభుత్వానికి నివేదించింది. దాదాపు 15 లక్షలకుపైగా యం త్రాలకు డిమాండ్‌ ఉన్నా ఇప్పటికిప్పుడు అవసరమై నన్ని సమకూర్చే పరిస్థితి లేదని బ్యాంకర్లు తేల్చి చెప్పారు. దేశమంతటా కలిపి కూడా ఏడాదికి 4 లక్ష లకు మించి స్వైపింగ్‌ మిషన్లను తయారీ చేసే పరిస్థితి లేదని తయారీ కంపెనీల ప్రతినిధులు ఇటీవలే వెల్లడించారు. మరోవైపు డిజిటల్‌ చెల్లింపులను ప్రోత్సహించేందుకు బ్యాంకర్ల సహకారంతో విస్తృత ప్రచారానికి ప్రభుత్వం రంగం సిద్ధం చేస్తోంది.

Advertisement
Advertisement