మద్యం కోసం డ్రైవింగ్ లెసైన్స్ ఫోర్జరీ | Sakshi
Sakshi News home page

మద్యం కోసం డ్రైవింగ్ లెసైన్స్ ఫోర్జరీ

Published Fri, Jul 15 2016 12:49 AM

మద్యం కోసం డ్రైవింగ్ లెసైన్స్ ఫోర్జరీ

మత్తులో వెలుగులోకి వచ్చిన నిజం.. అరెస్టు చేసిన పోలీసులు
హైదరాబాద్: 19 ఏళ్ల కుర్రాడు మద్యం తాగాలనుకున్నాడు. బార్‌కు వెళ్లాలంటే వయసు తక్కువగా ఉంది. దీంతో దర్జాగా తన డ్రైవింగ్ లెసైన్స్ ఫోర్జరీ చేశాడు. ఎలాగోలా బార్‌కు వెళ్లినా మద్యం మత్తు అతడిని పోలీసులకు పట్టించింది. హైదరాబాద్ జూబ్లీహిల్స్ రోడ్ నం.10లోని ఎమ్మెల్యే, ఎంపీ కాలనీకి చెందిన విశేష్ అగర్వాల్(19) తన డ్రైవింగ్ లెసైన్స్‌ను ఫోర్జరీ చేశాడు. డ్రైవింగ్ లెసైన్స్‌లో విశేష్ పుట్టిన సంవత్సరం 1997గా ఉంది. అయితే, దాని జిరాక్సు ప్రతిలో ‘7’ను ‘4’గా మార్చాడు. కలర్ జిరాక్సు తీయించి లామినేషన్ చేయించుకున్నాడు.

ఈ ఫోర్జరీ ధ్రువీకరణతో మంగళవారం రాత్రి జూబ్లీహిల్స్ రోడ్ నంబర్ 45లోని గ్లోకల్ బార్ అండ్ రెస్టారెంట్‌కు వెళ్లాడు. అతిగా మద్యం సేవించి మత్తులోకి జారుకున్నాడు.  రాత్రి 10 గంటల ప్రాంతంలో ఎక్సైజ్ ఇన్‌స్పెక్టర్ శ్రీనివాసరావు తన సిబ్బందితో కలిసి బార్‌లో తనిఖీలు చేపట్టారు. మద్యం మత్తులో ఉన్న విశేష్ పొరపాటున అసలైన డ్రైవింగ్ లెసైన్స్‌ను ఎక్సైజ్ వారికి చూపించాడు. అందులో వయసు తక్కువగా ఉండటంతో బార్ సిబ్బందిని ఇన్‌స్పెక్టర్ నిలదీశారు. తాము తనిఖీ చేసిన తర్వాతే లోనికి అనుమతించామని చెప్పడంతో విశేష్ వద్ద సోదా చేశారు. ఫలితంగా ‘1994’తో కూడిన ఫోర్జరీ డ్రైవింగ్ లెసైన్స్ లభించింది. విశేష్ సైతం తన నేరాన్ని ఒప్పుకోవడంతో ఎక్సైజ్ అధికారులు అతడిని జూబ్లీహిల్స్ పోలీసులకు అప్పగించారు. దీంతో అతడిపై పలు కేసులు నమోదు చేసి అరెస్టు చేశారు.

Advertisement
Advertisement