కరువు కాటు.. నిధులు లోటు | Sakshi
Sakshi News home page

కరువు కాటు.. నిధులు లోటు

Published Fri, Aug 7 2015 2:26 AM

Drought bites Funding deficit

వరుణుడు కరుణించకపోతే పంటలకు తీవ్ర నష్టం
 
*  సీఎస్ ఐవైఆర్ కృష్ణారావుకు వివరించిన జిల్లా కలెక్టర్లు
 
*  నిధులు విడుదల చేస్తామని సీఎస్ వెల్లడి
సాక్షి, హైదరాబాద్: ‘తీవ్ర వర్షాభావ పరిస్థితులు నెలకొన్నాయి. పక్షం రోజుల్లో వరుణుడు కరుణించకపోతే సాగు చేసిన పంటలకు తీవ్ర నష్టం వాటిల్లుతుంది. ఉద్యానవన పంటలూ ఎండిపోవడం ఖాయం. గ్రామాలు, పట్టణాల్లోనూ తాగునీటి ఎద్దడి నెలకొంది. నిధులు లేకపోవడం వల్ల సహాయక చర్యలు చేపట్టలేకపోతున్నాం.

తక్షణమే నిధులు విడుదల చేస్తే.. రైతులను ఆదుకోవడానికి అవకాశం ఉంటుంద’ని అనంతపురం, కర్నూలు, వైఎస్సార్ కడప, నెల్లూరు, ప్రకాశం జిల్లాల కలెక్టర్లు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి(సీఎస్) ఐవైఆర్ కృష్ణారావుకు వివరించారు. కలెక్టర్ల ప్రతిపాదనలపై ఐవైఆర్ కృష్ణారావు స్పందిస్తూ.. తక్షణమే నిధులు విడుదల చేస్తామనీ  సహాయక చర్యలను వేగంగా చేపట్టాలని  ఆదేశించారు. రాష్ట్రంలో వర్షాభావ పరిస్థితులపై వ్యవసాయ, నీటిపారుదల, పంచాయతీరాజ్, గ్రామీణ నీటిసరఫరా శాఖల కార్యదర్శులతో కలిసి సీఎస్ గురువారం సచివాలయం నుంచి 13 జిల్లాల కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.

సాగు చేసిన బత్తాయి, నిమ్మతోటల్లో అనంతపురం జిల్లాలో 4వేల హెక్టార్లు, వైఎస్సార్ కడప జిల్లాలో 15,163 హెక్టార్లలో, నెల్లూరు జిల్లాలో 6,437 హెక్టార్లలో, ప్రకాశం జిల్లాలో 2,443 హెక్టార్లలో ఎండిపోయే దశకు చేరుకున్నాయని, వెంటనే ట్యాంకర్లతో నీటిని అందిస్తే వాటిని కాపాడుకోవచ్చని కలెక్టర్లు, జేసీలు వివరించారు. ఇందుకు నిధులు మంజూరు చేయాలని కోరారు.
 
ఆయకట్టుకు నీళ్లందించలేం..
శ్రీశైలం, నాగార్జునసాగర్ జలాశయాల్లో నీటి నిల్వలు నిండుకున్న నేపథ్యంలో ఆయకట్టుకు నీళ్లందించలేమని నీటిపారుదల శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ ఆదిత్యనాథ్‌దాస్ స్పష్టం చేశారు. కృష్ణా, గుంటూరు, ప్రకాశం జిల్లాల్లో 2.5లక్షల హెక్టార్లలో ఆరుతడి పంటల సాగుకు వీలుగా విత్తనాలు సిద్ధంగా ఉంచాలని వ్యవసాయ శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ విజయ్‌కుమార్ ఆ జిల్లాల కలెక్టర్లను ఆదేశించారు. కరువు మండలాల్లో పనిదినాలను ఏడాదికి వంద నుంచి 150కి పెంచుతూ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికి సంబంధించి ఉత్తర్వులేవీ అందలేదని సీఎస్‌కు అనంతపురం జిల్లా కలెక్టర్ శశిధర్ తెలిపారు. దీనిపై సీఎస్ గ్రామీణాభివృద్ధి శాఖ అధికారులపై మండిపడ్డారు.

Advertisement
Advertisement