తెలంగాణలోడ్రైపోర్ట్ | Sakshi
Sakshi News home page

తెలంగాణలోడ్రైపోర్ట్

Published Sat, Oct 17 2015 4:45 AM

తెలంగాణలోడ్రైపోర్ట్ - Sakshi

 ప్రి ఫ్యాబ్ కాంక్రీట్ తయారీ ఫ్యాక్టరీ కూడా..
 రాష్ట్రంతో ఎంవోయూ కుదుర్చుకున్న చైనా కంపెనీ సాని
 45 మంది చైనా కంపెనీల ప్రతినిధులతో సీఎం సమావేశం
 గృహ నిర్మాణ రంగంలో అపార అవకాశాలున్నాయని వెల్లడి

 
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో డ్రైపోర్ట్, ప్రిఫ్యాబ్ కాంక్రీట్ మాన్యుఫాక్చరింగ్ ఫ్యాక్టరీ నెలకొల్పేందుకు చైనాలోని అగ్రశ్రేణి సంస్థ సాని గ్రూప్ ఆఫ్ కంపెనీ ముందుకొచ్చింది. ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు సమక్షంలో ఆ కంపెనీ ప్రతినిధులు అధికారులతో ఎంవోయూ కుదుర్చుకున్నారు. దీంతో రాష్ట్ర ప్రభుత్వం-చైనా కంపెనీల మధ్య రెండు కీలక ఎంవోయూలు కుదిరినట్లయింది. శుక్రవారమిక్కడ ఫలక్‌నుమా ప్యాలెస్‌లో తెలంగాణ ప్రభుత్వం, అధికారులు-సాని గ్రూప్ నేతృత్వంలోని చైనా కంపెనీల ప్రతినిధుల సమావేశం జరిగింది. ముఖ్యమంత్రి కేసీఆర్ ముఖ్య అతిథిగా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
 
 ఈ సందర్భంగా డ్రైపోర్ట్ ఏర్పాటు చేసే ఒప్పంద పత్రాలను రాష్ట్ర పరిశ్రమల శాఖ కార్యదర్శి (ఇన్‌చార్జి) జయేశ్ రంజన్, సాని హెవీ ఇండస్ట్రీ చైర్మన్ వెన్‌జెన్, ఫోర్ట్‌లియాన్ యంగ్ గాంగ్ వైస్ ప్రెసిడెంట్ చున్‌హంగ్ పరస్పరం మార్చుకున్నారు. నిర్మాణాలకు ఉపయోగించే ప్రి ఫ్యాబ్ కాంక్రీట్ మాన్యుఫాక్చరింగ్ ఫ్యాక్టరీ స్థాపనకు సంబంధించిన ఒప్పంద పత్రాలను గృహ నిర్మాణ శాఖ కార్యదర్శి దానకిశోర్, సాని ఇంటర్నేషనల్ హౌజింగ్ జనరల్ మేనేజర్ హైజున్ డెంగ్ మార్చుకున్నారు. నౌకాశ్రయానికి సరుకులను రవాణా చేసేందుకు వీలుగా రోడ్డు, రైలు మార్గాలు ఉన్నచోట ఏర్పాటు చేసే సరుకుల ఎగుమతి, దిగుమతి కేంద్రాన్ని డ్రైపోర్ట్‌గా వ్యవహరిస్తారు.
 
 పెట్టుబడులకు అపార అవకాశాలు: సీఎం
 చైనా నుంచి వచ్చిన వివిధ కంపెనీల ప్రతినిధులకు ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘నేను చైనాకు వచ్చినప్పుడు మీరు ఎంతో ఆదరణ చూపారు. నా ఆహ్వానం మన్నించి ఇక్కడికి వచ్చారు. తెలంగాణలో పెట్టుబడులకు అపారమైన అవకాశాలున్నాయి. ప్రపంచవ్యాప్తంగా పెట్టుబడిదారులు, పారిశ్రామికవేత్తలను ఆకర్షించే వినూత్న పారిశ్రామిక విధానం అమల్లో ఉంది. అవినీతి రహిత పాలన ఉంది. పేదలు ఆత్మగౌరవంతో బతికేలా డబుల్ బెడ్రూం ఇళ్లు కడుతున్నాం. ఈ గృహ నిర్మాణ రంగంలో అపారమైన అవకాశాలున్నాయి..’ అని అన్నారు. ఈ కార్యక్రమంలో మంత్రులు జూపల్లి కృష్ణారావు, కె.తారకరామారావు, ఇంద్రకరణ్‌రెడ్డి, ఈటల రాజేందర్, జగదీశ్‌రెడ్డితోపాటు ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
 
 చైనా బృందంలో సాని గ్రూప్ చైర్మన్ లియాన్ వెన్‌జెన్, సాని (ఇండియా) డెరైక్టర్ జిగువో, సీఈవో డుయాన్ దావ్, సీసీటీఈజీ వైస్ ప్రెసిడెంట్ దీపక్ గార్గ్, చైనా మిన్‌హెంగ్ ఇన్వెస్ట్‌మెంట్ కార్పొరేషన్ వైస్ ప్రెసిడెంట్ జాంగ్ కేషు, చైనా కోల్‌మైన్ కన్‌స్ట్రక్షన్ గ్రూప్ కార్పొరేషన్ చైర్మన్ జియోజాంగ్, పోర్డు హోల్డింగ్ గ్రూప్ కంపెనీస్ వైస్ ప్రెసిడెంట్ చున్‌హాంగ్ తదితరులు మొత్తం 45 మంది ప్రతినిధులు పాల్గొన్నారు. తెలంగాణలో అమలు చేస్తున్న నూతన పారిశ్రామిక విధానం, మిగులు విద్యుత్ ఉత్పత్తికి చేస్తున్న ప్రయత్నాలు, డ్రైపోర్ట్ ఆవశ్యకతను, సింగరేణి కాలరీస్ ద్వారా జరిగే బొగ్గు ఉత్పత్తి, డబుల్ బెడ్రూం ఇళ్ల నిర్మాణం, పట్టణ ప్రాంతాల అభివృద్ధి, మౌలిక సదుపాయాల కల్పన, హైదరాబాద్‌లో రహదారులు, రవాణా వ్యవస్థ అభివృద్ధి తదితర అంశాలపై అధికారులు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు.
 

Advertisement

తప్పక చదవండి

Advertisement