Sakshi News home page

ఓటుకు రశీదు

Published Sun, Feb 28 2016 4:52 AM

EC plans for voter slips system in municipal elections

గ్రేటర్ వరంగల్, ఖమ్మం, అచ్చంపేట ఎన్నికల్లో అమలుకు యోచన
 
 సాక్షి, హైదరాబాద్: ఇకపై ఓటేస్తే వేలికి ఇంకే కాదు... చేతికి రశీదు అందుతుంది. ఇకపై రాష్ట్రంలో జరిగే స్థానిక సంస్థల ఎన్నికల్లో ఓటర్లకు రశీదు ఇచ్చేందుకు ఓటర్ వెరిఫయబుల్ పేపర్ ఆడిట్ ట్రయల్ సిస్టమ్ (వీవీపీఏటీ)ను అమలు చేయాలని రాష్ట్ర ఎన్నిక సంఘం సూత్రప్రాయంగా నిర్ణయించింది. వచ్చే నెల 6న జరగనున్న గ్రేటర్ వరంగల్, ఖమ్మం మునిసిపల్ కార్పొరేషన్లతో పాటు మహబూబ్‌నగర్ జిల్లా అచ్చంపేట నగర పంచాయతీ ఎన్నికల్లో దీన్ని అమలు చేసేందుకు అనుమతి కోరుతూ శనివారం రాష్ట్ర ప్రభుత్వానికి లేఖరాసింది.

ఈవీఎంల ద్వారా జరిగే ఎన్నికల్లో వీవీపీఏటీ అమలు చేయాలని దేశ సర్వోన్నత న్యాయ స్థానం 2013లో తీర్పు జారీ చేసింది. ఓటరు ఈవీఎం బ్యాలెట్‌పై ఉండే మీటను నొక్కగానే విజయవంతంగా ఓటేసినట్లు తెలుపుతూ.. అప్పటికప్పుడు ప్రింటై రశీదు జారీ అవుతుంది. ఈ ప్రతిపాదనలను సీఎం కేసీఆర్ ఆమోదిస్తే తదుపరిగా న్యాయ శాఖ పరిశీలించి ఓ నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది. పోలింగ్‌కు వారం రోజులు మాత్రమే ఉండడంతో శరవేగంగా అనుమతులు వస్తేనే ఈ ఎన్నికల్లో అమలుకు అవకాశం ఉండనుందని అధికార వర్గాలు పేర్కొంటున్నాయి. 
 
 జీహెచ్‌ఎంసీ ఫలితాల నేపథ్యంలో...
 జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో అధికార టీఆర్‌ఎస్ పార్టీ సునామీ సృష్టించడంతో ప్రధాన ప్రతిపక్ష పార్టీలు ఘోరపరాజయాన్ని చవిచూశాయి. అధికార పార్టీ ఈవీఎంల టాంపరింగ్‌కు పాల్పడడంతోనే ఇలా ఏకపక్షంగా ఫలితాలు వచ్చాయని కాంగ్రెస్ తీవ్ర ఆరోపణలు చేసింది. ఈ పరిణామాల నేపథ్యంలో వరంగల్, ఖమ్మం, అచ్చంపేట ఎన్నికల్లో ఓటర్లకు రశీదు ఇచ్చే విధానాన్ని అమలు చేసేందుకు రాష్ట్ర ఎన్నికల సంఘం మొగ్గు చూపినట్లు తెలుస్తోంది.

Advertisement
Advertisement