ఎట్లా జేసినా లొల్లే! | Sakshi
Sakshi News home page

ఎట్లా జేసినా లొల్లే!

Published Thu, Aug 10 2017 3:15 AM

ఎట్లా జేసినా లొల్లే!

కొత్త జిల్లాల ప్రకారమా.. పాత జిల్లాల ప్రకారమా?
- టీచర్‌ పోస్టుల భర్తీపై విద్యాశాఖ తర్జన భర్జన
కొత్త జిల్లాల ప్రకారమే చేయాలన్న న్యాయ శాఖ, జీఏడీ
ఆ ప్రకారం కొన్ని జిల్లాల్లో ఒక్క పోస్టు కూడా ఉండని వైనం
నిరుద్యోగుల నుంచి వ్యతిరేకత వస్తుందని ఆందోళన
పాత జిల్లాల ప్రకారం భర్తీ చేస్తే సాంకేతిక సమస్యలు!
 
సాక్షి, హైదరాబాద్‌: ఉపాధ్యాయ పోస్టుల భర్తీ నిబంధనలపై ఇటు విద్యాశాఖ అటు ప్రభుత్వాధికారులు తర్జనభర్జన పడుతున్నారు. ఉపాధ్యాయ అర్హత పరీక్ష ఫలితాలు వెలువడిన వారం రోజుల్లో 8,972 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ ఇస్తామని ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి గతంలో ప్రకటించారు. ఆ సమయం దగ్గరపడటంతో ఇపుడు కొత్త సమస్య తెరపైకి వచ్చిం ది. పోస్టులను కొత్త జిల్లాల ప్రకారం భర్తీ చేయాలా? లేక పాత జిల్లాల ప్రకారమా అని అధికారులు అయోమయంలో ఉన్నారు.

వరంగల్‌లో మంగళవారం నిరుద్యోగ అభ్యర్థులు ఆయన్ను కలసిన సందర్భంలో ఈ విషయమై ఆలోచిస్తున్నామని డిప్యూటీ సీఎం చెప్పినట్లు సమాచారం. కొత్త జిల్లాల ప్రకారం భర్తీ చేస్తే కొన్ని జిల్లాల్లో ఒక్క స్కూల్‌ అసిస్టెం ట్‌ పోస్టు కూడా లేకపోవడం, పోస్టులు లేకుం డా నోటిఫికేషన్‌ ఇస్తే నిరుద్యోగుల నుంచి వ్యతిరేకత వ్యక్తం అవుతుందేమోనని అధికారులు ఆందోళన చెందుతున్నారు. పాత జిల్లా ల ప్రకారం చేపడితే న్యాయపర, సాంకేతిక సమస్యలు తలెత్తే అవకాశమున్న నేపథ్యంలో ఏం చేయాలో తేల్చుకోలేకపోతున్నారు.
 
అసలే లేకపోతే ఎలా?
ఈ 8,972 పోస్టుల్లో తెలుగు మీడియంలో 4,779 సెకండరీ గ్రేడ్‌ టీచర్‌ (ఎస్‌జీటీ) పోస్టులుండగా.. 1,754 మాత్రమే స్కూల్‌ అసిస్టెం ట్‌ పోస్టులు ఉన్నాయి. మరో 374 పీఈటీ పోస్టులు, ఉర్దూ మీడియంలో 900 పోస్టులున్నాయి. కొత్త జిల్లాల ప్రకారం చూస్తే కొన్ని జిల్లాల్లో స్కూల్‌ అసిస్టెంట్‌ పోస్టులే లేవని అధికారులు చెబుతున్నారు. ఆ ప్రకారం నోటిఫికేషన్‌ జారీ చేస్తే సమస్యలొస్తాయని జిల్లాల వారీ పోస్టుల వివరాలను విద్యాశాఖ బయటకు రానివ్వడం లేదు. పాత జిల్లాల ప్రకారం నియమితులైన టీచర్లు పాత జిల్లా కేంద్రాలు, జిల్లా కేంద్రాల సమీప పాఠశాలల్లో పని చేస్తున్నారు.

జిల్లాల విభజన తర్వాత వారికి స్థాని కత ఆధారంగా శాశ్వత కేటాయింపులు జరపలేదు. దీంతో కొత్త జిల్లాల స్థానికతగల టీచర్లు పాత జిల్లా కేంద్రాలు, వాటి సమీప పాఠశాలల్లో ఉన్నందున అక్కడ ఉపాధ్యాయ ఖాళీలు లేవని, కాబట్టి తాము నష్టపోవాల్సి వస్తుం దని నిరుద్యోగుల నుంచి ఆందోళన వ్యక్తమవుతుందని అధికారులు చెబుతున్నారు. కాబట్టి పోస్టులు లేని జిల్లాల్లో పరిశీలన జరిపి, గతం లో హేతుబద్ధీకరణతో పాఠశాలలను మూసివేసి, డీఈవోల పరిధిలోకి తెచ్చిన పోస్టులను భర్తీ చేస్తే సమస్య ఉండదన్న భావన అధికారులు వ్యక్తం చేస్తున్నారు.
 
ఎలా భర్తీ చేయాలి?
కొత్త జిల్లాలు ఏర్పడిన నేపథ్యంలో ఉపాధ్యాయ నియామక నిబంధనలపై విద్యాశాఖ సీనియర్‌ అధికారులతో ప్రభుత్వం గతంలోనే ఓ కమిటీని ఏర్పాటు చేసింది. కొత్త జిల్లాల ప్రకారం ఆయా జిల్లాల డీఈవోలే నియామక పత్రాలు అందజేయాలని కొంతమంది అధికారులు పేర్కొనగా, మరికొంత మంది పాత జిల్లా ల ప్రకారం చేపట్టాలన్నారు. టీచర్ల శాశ్వత కేటాయింపులు జరగనందున పాత జిల్లాల ప్రకారమే నియామకాలు చేపట్టి, ఉద్యోగులను పంపించిన ఆర్డర్‌ టు సర్వ్‌ ప్రతిపాదన కొత్తగా నియమితులైన వారిని కేటాయించాలన్నారు. దీనిని న్యాయ శాఖ, జీఏడీ పరిశీలనకు పంపగా.. కొత్త జిల్లాలు ఏర్పడినందున, గెజిట్‌ నోటిఫికేషన్‌ ఇచ్చినందున, ఆ ప్రకారమే భర్తీ చేయాలని, లేదంటే న్యాయపర వివాదాలు తలెత్తుతాయని సూచించినట్లు తెలిసింది. 

Advertisement
Advertisement