Sakshi News home page

హోదా ఆశకు సమాధి

Published Thu, May 5 2016 1:55 AM

హోదా ఆశకు సమాధి - Sakshi

 ఏపీపై తేల్చేసిన కేంద్రం
 
 సాక్షి, న్యూఢిల్లీ/హైదరాబాద్: రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఆశలపై కేంద్రం నీళ్లు చల్లింది. ప్రత్యేక హోదా నిబంధనేదీ ఏపీ పునర్వ్యవస్థీకరణ చట్టంలో లేదని ఆర్థిక శాఖ సహాయ మంత్రి జయంత్‌సిన్హా పేర్కొన్నారు. ప్రత్యేక హోదా సాధనలో టీడీపీ నిర్లిప్త వైఖరిపై ప్రజల్లో ఆగ్రహావేశాలు వ్యక్తమవుతుండటం, హోదా కోసం విపక్ష వైఎస్సార్‌సీపీ తన వంతు కృషి కొనసాగిస్తుండటంతో.. ప్రజల దృష్టి మరల్చేందుకు, హోదా కోసం తామూ పోరాటం చేస్తున్నామని కలర్ ఇచ్చేందుకు టీడీపీ నేతలు ప్రయత్నాలు మొదలుపెట్టారు.

ఎప్పుడో పార్లమెంటు శీతాకాల సమావేశాల్లో టీడీపీ ఎంపీ అడిగిన ప్రశ్నకు సమాధానంగా గత నెల 25న జయంత్ సిన్హా లేఖ రాస్తే.. పదిరోజుల తర్వాత ఆ లేఖను  బయటపెట్టారు. బుధవారం లోక్‌సభలో ఆర్థిక బిల్లుపై చర్చ సందర్భంగా వైఎస్సార్‌సీపీ ఈ  అంశాన్ని ప్రస్తావిస్తుందనే ఏకైక కారణంతో, తామూ ప్రత్యేక హోదా కోసం ప్రయత్నిస్తున్నామని చెప్పుకునేందుకు టీ డీపీ ఈ హడావుడి చేసింది. అయితే  రాష్ట్రాలకు ‘హోదా’ మంజూరు విషయంలో ఇప్పటివరకు ఉన్న విధానాన్ని మార్చే ఆలోచన లేదని కేంద్ర మంత్రి కుండబద్ధలు కొట్టారు. డిసెంబర్ 21, 2015న లోక్‌సభ జీరో అవర్‌లో అనకాపల్లి ఎంపీ అవంతి శ్రీనివాసరావు ప్రత్యేక హోదా అంశాన్ని ప్రస్తావించారు. దానికి బదులుగా కేంద్రమంత్రి రాసిన లేఖను బుధవారం ఆయన విడుదల చేశారు. లేఖలోని సారాంశం ఇదీ..

  ‘‘ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ బిల్లు-2014పై రాజ్యసభలో 2014 ఫిబ్రవరి 20న చర్చ జరుగుతున్న సమయంలో అప్పటి ప్రధాని కొన్ని అంశాలను ప్రస్తావించారు. 13 జిల్లాలతో కూడిన ఏపీకి స్పెషల్ కేటగిరీ స్టేటస్‌ను ఐదేళ్ల పాటు వర్తింపజేస్తామన్నారు. కానీ విభజన చట్టంలో ప్రత్యేక కేటగిరీ హోదా కట్టబెట్టాలని ఎలాంటి నిబంధన పొందుపరచలేదు. అలాగే రెవెన్యూ లోటు భర్తీకి వీలుగా నిధులు ఇవ్వాలని గానీ, ఆ మేరకు ఆర్థిక సంఘం సిఫారసు చేస్తుందని గానీ చట్టంలో పొందుపరచలేదు.

అయితే విభజన అనంతరం తొలి ఏడాది ఏపీకి ప్రత్యేక సాయం కింద రెవెన్యూ లోటు భర్తీ చేసేందుకు ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టంలో 46(2) సెక్షన్‌ను పొందుపరిచారు. దీనికి అనుగుణంగా, ఏపీ అభివృద్ధికి మద్దతుగా 6,403 కోట్ల ప్రత్యే క సాయం కేంద్రం అందించింది. 2014-15లో రూ.4,403 కోట్లు, 2015-16లో రూ 2,000 కోట్ల నిధులను ఏపీ ప్రభుత్వానికి ఇచ్చాం. ఇందులో రెవెన్యూ లోటు భర్తీకి రూ. 2,803 కోట్లు, ఏడు వెనుకబడిన జిల్లాల అభివృద్ధికి రూ.700 కోట్లు, నూతన రాజధానికి రూ. 2,050 కోట్లు, పోలవరం ప్రాజెక్టుకు రూ. 850 కోట్లు ఇచ్చాం. 14వ ఆర్థిక సంఘం ప్రత్యేక హోదా గల రాష్ట్రాలకు, సాధారణ రాష్ట్రాలకు మధ్య ఎలాంటి వ్యత్యాసం చూపలేదు.

 అనేక మార్గాల్లో నిధులు: ఆ విధంగా ఏపీకి వివిధ మార్గాల ద్వారా.. అంటే కేంద్ర పన్నుల్లో రాష్ట్ర వాటా రూపంలో, 14వ ఆర్థిక సంఘం గ్రాంట్ల రూపంలో, రాష్ట్ర ప్రణాళిక పథకాల్లో కేంద్ర సాయంగా, కేంద్ర ప్రాయోజిత పథకాలు తదితర రూపాల్లో నిధులు అందుకుంటోంది. ఏపీ ప్రభుత్వ 2016-17 బడ్జెట్ ప్రకారం 2016-17లో రూ.51,487 కోట్ల కేంద్ర సాయం అందుకోబోతోంది. ఇందులో రూ.26,850 కోట్ల మేర సెంట్రల్ గ్రాంట్లు, 24,637 కోట్ల మేర కేంద్ర పన్నులు ఉన్నాయి. 2015-16 సవరించిన అంచనాల ప్రకారం ఈ రెండు పద్దుల మొత్తం 39,616 కోట్లుగా ఉంది. ఇందులో కేంద్ర పన్నుల వాటా రూ.21,894 కోట్లు. 2014-15 కంటే ఈ మొత్తం 30 శాతం అధికంగా ఉంది..’ అని జయంత్ సిన్హా పేర్కొన్నారు.

 పిల్లి మొగ్గలే పుట్టిముంచాయి: ప్రత్యేక హోదా విషయంలో రోజుకో మాట మాట్లాడటం ద్వారా చంద్రబాబు రాష్ట్రానికి తీరని అన్యాయం జరిగేందుకు కారణమయ్యారు. మరోవైపు ప్రత్యేక హోదా వల్ల రాష్ట్రానికి ఒనగూరే ప్రయోజనాలు వివరించటంతో పాటు దాని సాధనకు అలుపెరగని పోరాటం చేస్తున్న వైఎస్సార్‌సీపీకి అడుగడుగునా అడ్డంకులు కల్పించేందుకు శతవిధాలా ప్రయత్నం చేస్తున్నారు. చంద్రబాబు చేస్తున్న ప్రయత్నాల్లో లోపం వల్ల రాష్ట్రానికి తీరని అన్యాయం జరుగుతుందన్న ఆందోళన, ఆవేదనతో గత ఏడాది ఆగస్టులోనే  ఐదుగురు ఆత్మహత్య, ఆత్మాహుతులకు పాల్పడ్డారు.

ఇవేవీ బాబును కదిలించలేక పోగా రాష్ట్ర ప్రజానీకాన్ని గందరగోళంలోకి నెట్టేశారు. హోదా తప్పక వస్తుందని టీడీపీకి చెందిన ఒక కేంద్ర మంత్రి అంటే.. హోదా రాదని, ఆ విషయం సీఎంకూ తెలుసునని ఆ పార్టీకే చెందిన ఎంపీ ఒకరు అంటారు. తాము అధికారంలోకి వస్తే ఐదేళ్లు కాదు పదేళ్లు ప్రత్యేక హోదా ఇస్తామని తిరుపతి సభలో టీడీపీ, బీజేపీలు హామీ ఇచ్చాయి. ప్రత్యేక హోదా వస్తేనే రాష్ట్రం అభివృద్ధి పథంలో పయనిస్తుందని ఊరూవాడా ప్రచారం చేసిన చంద్రబాబు.. అధికారంలోకి రాగనే హోదా అంశాన్ని అటకెక్కించారు. ఓటుకు కోట్లు కేసులో పీకల్లోతు కూరుకుపోయిన చంద్రబాబు రాష్ట్ర ప్రయోజనాలను పణంగా పెట్టారు. హోదా ఇవ్వడం లేదంటూనే కేంద్ర ప్రభుత్వంలో తన మంత్రులను కొనసాగించడం చంద్రబాబు చిత్తశుద్ధిని స్పష్టం చేస్తోంది.
 
  హోదాపై బాబు ఎప్పుడేమన్నారు
► రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వాలి. ఐదేళ్లే ఇస్తామన్నారు. 15 ఏళ్లు ఇవ్వాలని ప్రధాని మోదీని కోరుతున్నా. రాష్ట్రానికి పరిశ్రమలు రావాలంటే రెండు మూడేళ్లు పడుతుంది. ఐదేళ్లే ఇస్తే పరిశ్రమలు ప్రారంభమయ్యే లోపు హోదా పోతే అభివృద్ధి ఆగిపోతుంది. అందువల్ల 15 ఏళ్లు ఇవ్వాలని కోరుతున్నా.
►  ప్రత్యేక హోదా ఇస్తే.. అదొక సంజీవని కింద అన్నీ అయిపోతాయని అంటున్నారు. ఏమొస్తాయండి..?. రెండే వస్తాయి. ఆర్థిక ప్యాకేజీ (ఈఏపీ), సెంట్రల్లీ స్పాన్సర్డ్ స్కీమ్. ప్రత్యేక హోదా బదులు ఎక్కువ డబ్బులు ఇస్తామన్నారనుకో.. ఇంకా నీకు బాధేముంది. నేను కాదనను కదా? కోడలు మగబిడ్డను కంటానంటే అత్త వద్దంటుందా?.
► ప్రత్యేక హోదానే మొత్తం అయిపోతుంది. స్వర్గం అయిపోతుందని చెబుతున్నారు. పదేళ్లు స్పెషల్ స్టేటస్ వచ్చిన రాష్ట్రాలు స్వర్గమైపోలేదే?

Advertisement
Advertisement