400 స్కూళ్లలో ఇంగ్లిష్ మీడియం | Sakshi
Sakshi News home page

400 స్కూళ్లలో ఇంగ్లిష్ మీడియం

Published Tue, May 17 2016 3:37 AM

400 స్కూళ్లలో ఇంగ్లిష్ మీడియం - Sakshi

♦ పెలైట్ ప్రాజెక్టు కింద వరంగల్ జిల్లాలో ప్రారంభం
♦ అధికారులతో చర్చించిన ఉప ముఖ్యమంత్రి కడియం
 
 సాక్షి, హైదరాబాద్: వరంగల్ జిల్లాలో 400 వరకు ప్రభుత్వ పాఠశాలల్లో ఒకటో తరగతి నుంచి ఇంగ్లిష్ మీడియంను పెలైట్ ప్రాజెక్టు కింద ప్రారంభించేందుకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా సోమవారం సచివాలయంలో వరంగల్ జిల్లా అధికారులతో ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి, విద్యాశాఖ ప్రత్యేక ముఖ్య కార్యదర్శి రంజీవ్ ఆర్.ఆచార్య సమావేశమయ్యారు. అలాగే ఇంగ్లిష్ మీడియం పాఠశాలల ఏర్పాటులో భాగంగా 2,500 మంది టీచర్లకు శిక్షణ ఇస్తున్న అంశంపైనా సమీక్షించారు.

ఈ శిక్షణను నిర్వహిస్తున్న ఆంగ్ల భాషోపాధ్యాయ సంఘాన్ని (ఎల్టా) ఈ సందర్భంగా అభినందించారు. కాగా, వరంగల్ జిల్లాలో ఇంగ్లిష్ మీడియం ప్రారంభానికి జిల్లా కలెక్టర్ కరుణ చేసిన ప్రతిపాదనలపై తగిన చర్యలు చేపట్టాలని ఈ సందర్భంగా కడియం రంజీవ్ ఆర్. ఆచార్యను, పాఠశాల విద్యా డెరైక్టర్ కిషన్‌ను ఆదేశించారు. ఈ సమావేశంలో జిల్లా కలెక్టర్ వాకాటి కరుణ, డీఈవో రాజీవ్, ఎల్టా వ్యవస్థాపక అధ్యక్షుడు బత్తిని కొమురయ్య, ఎల్టా అధ్యక్ష, కార్యదర్శులు పూల శ్రీనివాస్, వెంకటేశ్వర్‌రావు తదితరులు పాల్గొన్నారు.

 జిల్లాల వారీగా సమీక్షలు
 ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి జిల్లాల వారీ గా విద్యాశాఖపై సమీక్షలను ప్రారంభించారు. సోమవారం హైదరాబాద్, వరంగల్ జిల్లాలో విద్యా కార్యక్రమాలపై సమావేశాలు నిర్వహించా రు. త్వరలో మిగతా జిల్లాల్లో విద్యా కార్యక్రమాలపైనా సమీక్ష నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.

 రేషనలైజేషన్‌పై ఏం చేద్దాం?
 రాష్ట్రంలో పాఠశాలలు, టీచర్ల హేతుబద్ధీకరణ విషయంలో ఎలాంటి చర్యలు చేపట్టాలన్న అంశంపై విద్యాశాఖ తర్జనభర్జన పడుతోంది. విద్యార్థుల్లేని పాఠశాలలను మూసివేయాలా? ప్రత్యామ్నాయ విధానాలు ఏమైనా ఉన్నాయా? అన్న కోణంలో పరిశీలన జరుపుతోంది. సోమవారం కడియం శ్రీహరి నిర్వహించిన సమావేశంలో ఈ అంశంపై చర్చించారు. మొదట ఒక జిల్లాలో హేతుబద్ధీకరణ చేపట్టి, ఆ తరువాత అన్ని జిల్లాల్లో హేతుబద్ధీకరణ చేపట్టాలన్న నిర్ణయానికి వచ్చినట్లు తెలిసింది.

 ఈసారికి ప్రైవేటు పుస్తకాలే!
 రాష్ట్రంలోని ప్రైవేటు పాఠశాలల్లో ఒకటి నుంచి ఐదో తరగతి వరకు రాష్ట్ర విద్యా పరిశోధన, శిక్షణ మండలి (ఎస్‌సీఈఆర్‌టీ) రూపొందించిన పుస్తకాలు కాకుండా ప్రైవేటు పబ్లిషర్లు ముద్రించిన పాఠ్య పుస్తకాలనే కొనసాగించేందుకు ప్రభుత్వం ఓకే చెప్పినట్లు ప్రైవేటు పాఠశాలల యాజమాన్యాల సంఘం ఒక ప్రకటనలో తెలిపింది. హైకోర్టు ఆదేశాలు ఉన్నందున ఈ మేరకు ప్రభుత్వం అనుమతి ఇచ్చినట్లు వెల్లడించింది.

Advertisement
Advertisement